కాంగ్రెస్‌కు రాహుల్ పూర్వవైభవం తెస్తారా?

కాంగ్రెస్‌కు రాహుల్ పూర్వవైభవం తెస్తారా?
x
Highlights

సరిగ్గా 131 ఏండ్ల క్రితం డిసెంబర్ 28న ఏవో హ్యూమ్ అనే ఓ తెల్లవాడు స్థాపించిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. జాతీయోద్యమంలో భారత స్వాతంత్య్రంకోసం ఎంతోమంది...

సరిగ్గా 131 ఏండ్ల క్రితం డిసెంబర్ 28న ఏవో హ్యూమ్ అనే ఓ తెల్లవాడు స్థాపించిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. జాతీయోద్యమంలో భారత స్వాతంత్య్రంకోసం ఎంతోమంది మహానుభావులు ఈ పార్టీ ద్వారా శ్రమించారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుమారు 49 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలే పాలించారు. అందులోనూ సింహభాగం నెహ్రూ.. ఆయన కుటుంబ సభ్యులే పరిపాలించారు. ఏడు దశాబ్దాల భారత దేశ పురోగతిలో కానీ, వెనుకబాటులో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉందనడంలో సందేహం లేదు. కానీ దేశ రాజకీయాల్లో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ అగమ్యగోచరంగా మారింది. యావత్ దేశంలో తాను మాత్రమే అధికారంలో ఉన్న స్థితి నుంచి ఒక్కొక్క రాష్ట్రం చేజారిపోతూ.. చివరకు నాలుగు రాష్ర్టాలకు మాత్రమే పరిమితమైంది. ఇందిరాగాంధీ మరణానంతరం నుంచే క్రమంగా కాంగ్రెస్ పార్టీ వెలుగు మసకబారుతూ వచ్చింది. ఇందిర మరణానంతరం అకస్మాత్తుగా ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో కాంగ్రెస్‌కు సుమారు 450 వరకూ సీట్లను సంపాదించి పెట్టినా అదంతా ఇందిర సానుభూతి పవనాలవల్లనే జరిగింది. ఆయన ప్రధానిగా ఉన్నకాలంలో కమ్యూనికేషన్ల విప్లవం రావటం వల్ల ఆ క్రెడిట్ ఆయనకే దక్కింది. కానీ, అదే సమయంలో బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పరువుతో పాటు రాజీవ్ కుటుంబ పరువూ మంటగలిసింది.

ఆ తర్వాత 2014 వరకూ దేశంలో కాంగ్రెస్ కాదు కదా ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ రాకపోవడం సుదీర్ఘకాలం సంకీర్ణరాజకీయాల శకం కొనసాగింది. పీవీ నరసింహరావు అయిదేళ్లు పాలించినా, మన్మోహన్ పదేళ్లు పాలించినా, వాజపేయి నాలుగున్నరేండ్లపాటు పరిపాలించినా ఏ ఒక్కరూ మెజార్టీ ప్రభుత్వాన్ని నడిపింది లేదు. రకరకాల ప్రాంతీయ పార్టీల కూటమితో వాళ్లను సంతృప్తి చేసే రాజకీయ విన్యాసాలతో ప్రభుత్వాలు నడిచాయి. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం పీవీ నరసింహరావు పార్టీని అయిదేళ్ల పాటు తొట్రుపాటు లేకుండా నడిపించారు. ఆ తర్వాత సీతారాం కేసరి అధ్యక్షుడై ఏడాది తిరక్కుండానే అస్త్ర సన్యాసం చేయడంతో సోనియాగాంధీ సీన్‌లోకి వచ్చారు. ఆమె పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించేనాటికి దేశ రాజకీయాలు అత్యంత సంక్లిష్ట పరిస్థితిలోనే ఉన్నాయి. అయితే నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారి నేతృత్వం ఉంటేనే కాంగ్రెస్‌లో ఐక్యత కొనసాగుతుందన్న సెంటిమెంట్ ఉన్నది. ఆ కుటుంబం నేతృత్వంలోనే పార్టీకి మనుగడ ఉంటుందన్న నమ్మకం పార్టీ వర్గాల్లో ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో పెద్దగా పుంజుకొన్నది లేదు. వివిధ రాష్ర్టాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ 2004 ఎన్నికల్లో బీజేపీ కంటే కేవలం 8సీట్లు ఎక్కువగా (బీజేపీ 138, కాంగ్రెస్-145) గెల్చుకొంది.

బీజేపీని ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రానివ్వొద్దన్న ఒక్క సిద్ధాంతంతో 60సీట్లు గెల్చుకొన్న వామపక్షాలు కాంగ్రెస్‌కు బయటినుంచి మద్దతు నివ్వడంతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలను కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంది. 2009నాటికి కాంగ్రెస్ బలం 206కు పెరిగింది. కానీ రకరకాల స్కాంలు. మన్మోహన్‌సింగ్ నిష్క్రయాపరత్వం ఆ పార్టీని దెబ్బతీసిందనే చెప్పాలి. 2004 నుంచే కాంగ్రెస్ పార్టీ సోనియా కుమారుడు రాహుల్ గాంధీని భావి ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. కానీ, 2009లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్‌గాంధీని ప్రధాని పదవిపై కూర్చోబెట్టేంత ధైర్యం చేయలేకపోయింది. ఆయన సమర్థతపై కాంగ్రెస్‌కు పూర్తి నమ్మకం కుదరలేదు. మళ్లీ మన్మోహన్‌సింగ్‌కే అవకాశం ఇవ్వడంతో సహజంగానే రాహుల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కనాకష్టం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2009 తర్వాత అటు బీజేపీ నాయకత్వంలోనూ మార్పులు సంభవించాయి. అప్పటి వరకూ రాష్ర్టానికే పరిమితమైన నరేంద్రమోదీ ఒక్కసారిగా జాతీయనేతగా ఎమర్జ్ కావడం మొదలుపెట్టారు. మోదీ హిందుత్వ కార్డు నిస్సందేహంగా బీజేపీకి కలిసొచ్చింది. అటు పక్క ఒక్కో రాష్ర్టానికి జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ నుంచి చేజారిపోతుండటం.. రాహుల్‌కు అగ్నిపరీక్షలా మారింది.

చివరకు రెండు నెలల పాటు అదృశ్యమైపోయి లండన్ వెళ్లి రాజకీయ పాఠాలు నేర్చుకొని తిరిగి వచ్చారు. అలా రాజకీయాలకు సంబంధించి పాఠాలు విని వచ్చిన మొట్టమొదటి నాయకుడు బహుశా దేశంలోనే రాహుల్ గాంధీ ఒకరేనేమో. దీనికి తోడు కాంగ్రెస్‌కు అన్ని విషయాల్లో ట్రబుల్‌షూటర్‌గా ఉన్న ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతిని చేసి క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు తప్పించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది. 2014లో మోదీ ఒక ప్రభంజనంలా దూసుకొచ్చారు. సంకీర్ణ రాజకీయ యుగానికి స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయిలో సాధారణ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో సోనియా అనారోగ్య కారణాల వల్ల క్రియాశీలంగా వ్యవహరిస్తుండకపోవడం, రాహుల్ గాంధీ పూర్తి పట్టును సాధించలేకపోవడంతో సోనియా కూతురు ప్రియాంకను రంగంలోకి దింపే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. 2008నుంచే ప్రియాంక కోసం ఉద్ధృతంగా ప్రయత్నం జరిగింది. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పుడల్లా ప్రియాంక పేరును సీన్‌లోకి తెచ్చే ప్రయత్నాలు కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే చేశారు. కానీ, ఆమె రాక వల్ల రాహుల్ గాంధీ రాజకీయ జీవితం డోలాయమానంలో పడుతుంది కాబట్టి సోనియా అందుకు అంగీకరించలేదు. తన తదనంతరం రాయ్‌బరేలీ సహజంగానే ప్రియాంకకు రిజర్వ్ అవుతుంది అందువల్ల ఇబ్బంది లేదు. కానీ రాహుల్‌ను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. ఓ పక్క కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ బీజేపీ నినాదం ఇచ్చింది. ఆ విధంగానే ఒక్కో రాష్ర్టాన్ని చేజిక్కించుకొంటూ తన అధికారాన్ని మిత్రపక్షాలతో కలిసి 19 రాష్ర్టాలకు విస్తరించింది.

కాంగ్రెస్ నాలుగు రాష్ర్టాలకు పరిమితమైంది. అటు సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ దశలో రాహుల్ గాంధీ డిసెంబర్ 16న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. మొదట్లో కాసింత ఇబ్బంది పడ్డా ఇప్పుడిప్పుడు కొంత ధారాళంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యర్థికి దీటైన సమాధానం చెప్తున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలను అమలుపరుస్తున్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఆయన్ను సస్పెండ్ చేసేందుకు రాహుల్ వెనుకాడలేదు. క్రమంగా కాంగ్రెస్‌లో రాహుల్ నిదానంగానైనా నాయకుడుగా ఎదుగుతున్నారనే చెప్పాలి. అయితే నరేంద్రమోదీ వంటి బలమైన నాయకుడిని, ఆయన పక్కన చాణక్యనీతితో తన పార్టీలోని సీనియర్లనే మూడు చెరువుల నీళ్లు తాగించిన అమిత్‌షా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించగల బలమైన వ్యవస్థ రాహుల్ గాంధీకి ఇప్పుడు అవసరం. 65 ఏండ్లు దాటిన నేతలకు మంత్రిమండలిలో స్థానం ఇవ్వరాదని మోదీ విధాన నిర్ణయం తీసుకొని దాన్ని కచ్చితంగా అమలు చేశారు. అందువల్ల సీనియర్ల అసంతృప్తితో ఇబ్బందులు ఎదుర్కొన్నా తన నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేశారు. రాహుల్ గాంధీ తన పార్టీలో ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోగలరా? గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ అధికస్థానాలు గెల్చుకొన్నప్పటికీ అధికారానికి దూరం చేసిన దిగ్విజయ్ లాంటి నేతలను దూరం పెట్టగలరా? రాహుల్‌గాంధీ అత్యంత వేగంగా, అంతకుమించి కఠినంగా పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.

దేశంలో ఇప్పుడు సానుకూల రాజకీయ విధానమొకటి పెరుగుతున్నది. అభివృద్ధి కనిపిస్తున్న రాష్ర్టాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తగ్గి వరుసగా అధికారాన్ని దక్కించుకొంటున్న ముఖ్యమంత్రుల సంఖ్య పెరిగింది. మరోవైపు దేశంలో వామపక్షాల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. వారి ఓటు బ్యాంకు కూడా దారుణంగా తగ్గిపోయింది. బెంగాల్‌లో, కేరళలో కూడా బీజేపీ సీట్లు గెల్చుకొనే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వామపక్షాలపై కాంగ్రెస్ ఆధారపడే పరిస్థితి లేదు. తమిళనాడు వంటి రాష్ర్టాల్లో దిగ్గజాలైన కరుణానిధి కుర్చీకి పరిమితమైతే, జయలలిత కన్నుమూయడంతో అక్కడ రాజకీయాలు ఎన్నిరంగులు మారుతాయో చెప్పే పరిస్థితి లేదు. 2018లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో సిద్దరామయ్య ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆ పార్టీకి లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా తన బలాన్ని పెంచుకోవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్‌కు కేడర్ సమస్య లేదు. నేతలతోనే సమస్య. రాష్ర్టాల వారిగా, ప్రాంతాల వారిగా, వర్గాల వారిగా, చివరకు నేతల వారిగా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. రాహుల్ గాంధీ ఆ పని చేయగలరా..? అదే జరిగితే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం మళ్లీ లభిస్తుందనడంలో సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories