logo
జాతీయం

మోడీ సర్కారుకు ఇదే ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌

మోడీ సర్కారుకు ఇదే ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌
X
Highlights

అరుణ్‌ జైట్లీ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి...

అరుణ్‌ జైట్లీ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే. దీనికితోడు త్వరలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా తాయిలాలు ఇవ్వాలంటే.. ఈ బడ్జెట్‌లోనే సాధ్యం. ఈ నేపథ్యంలో జైట్లీ గ్రామీణ భారతావనిపై దృష్టి పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో.. ఎన్నికల్లో మధ్య తరగతి, వేతన జీవులను తమవైపు తిప్పుకోవటానికి ఆదాయ పన్ను ఊరట అస్త్రాన్ని జైట్లీ ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడం, పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. కానీ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వం.. దీనిపై ఏ మేరకు ముందుకెళుతుందనే సందేహం నెలకొంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2017–18లో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవచ్చని తాజాగా ఆర్థిక సర్వే సైతం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచేందుకు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారించే అవకాశముంది. జాతీయ రహదారులు, రైల్వేల ఆధునీకరణకు భారీ కేటాయింపులు ఉంటాయనే అంచనాలున్నాయి.

బడ్జెట్‌ వరాలకు అడ్డం కిగా నిలిచేదేమైనా ఉంటే అది కచ్చితంగా ద్రవ్యలోటే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటికే ఆ పరిధి దాటిపోయింది. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకువచ్చి, ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడకపోతే స్టాక్‌ మార్కెట్లకు ప్రతికూల సంకేతాలు పంపే ప్రమాదముంది. భారత రేటింగ్‌పైనా ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇక ముడి చమురు ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్బణం, కరెంట్‌ ఖాతా లోటు పెరిగిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి.

ఈసారి బడ్జెట్‌పై అత్యంత ఉత్కంఠతో ఉన్నది స్టాక్‌ మార్కెట్‌ వర్గాలే. ఎందుకంటే షేర్లపై ఆదాయానికి పన్ను మినహాయింపు వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచవచ్చన్న భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం షేర్లు కొని ఏడాది తర్వాత విక్రయిస్తే... తద్వారా వచ్చే లాభాలపై పన్ను లేదు. ఆలోపు విక్రయిస్తే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. అయితే మోడీ ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్‌ నుంచి మరిన్ని నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఉందని.. ఏడాది దాటితే వచ్చే మూలధన లాభాలపై 7 నుంచి 10 శాతం పన్ను విధించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాకాకుండా పన్ను మినహాయింపు పరిమితిని మూడేళ్లకు పెంచవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. అంటే షేర్లు కొని మూడేళ్లలోపు విక్రయిస్తే వచ్చే లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఇక విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ప్రస్తుతం ఎలాంటి మూలధన లాభాల పన్ను లేదు. ఇప్పుడు అమల్లోకి తేవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయాల్లో ఏవైనా గురువారం స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

కార్పొరేట్‌ సంస్థలపై పన్నును ప్రస్తు తమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని 2015లో జైట్లీ హామీనిచ్చారు. కానీ గతేడాది బడ్జెట్లో కొన్ని వర్గాలకు మాత్రమే కాస్త ఊరట ఇచ్చారు. మొత్తం అన్ని కంపెనీలకూ ఈసారి కార్పొరేట్‌ పన్నును తగ్గించాలన్న డిమాండ్‌ వస్తోంది. ఇక డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ తొలగింపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను ను ఎత్తివేయడం వంటి డిమాండ్లపైనా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారింది.

జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని ఇటీవలి ఎన్నికల్లో బయటపడింది. దీంతో బీజేపీకి సంప్రదాయ మద్దతు దారులైన చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా.. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం నుంచి కొంతైనా బయటపడేలా ప్రోత్సాహకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Next Story