మెట్టు దిగిన మోడీ-అమిత్ షా: అద్వానీ-మురళీ మనోహర్ జోషిలకు బుజ్జగింపు

మెట్టు దిగిన మోడీ-అమిత్ షా: అద్వానీ-మురళీ మనోహర్ జోషిలకు బుజ్జగింపు
x
Highlights

తాజా ఉప ఎన్నికల ఫలితాలతో మోదీ ,అమిత్‌ షాలకు తత్వం బోధపడిందా ? 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాలుగు అడుగులు వెనక్కు వేయక తప్పదని భావిస్తున్నారా ?...

తాజా ఉప ఎన్నికల ఫలితాలతో మోదీ ,అమిత్‌ షాలకు తత్వం బోధపడిందా ? 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాలుగు అడుగులు వెనక్కు వేయక తప్పదని భావిస్తున్నారా ? దూరమవుతున్న మిత్రులను కలుపు కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా ? ఇందుకోసం వృద్థతరం నేతలను తెర మీదకు తెచ్చేందుకు అధినేత అమిత్‌ షా స్వయంగా రంగంలోకి దిగారా ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు కమలనాథుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

పది రాష్ట్రాల పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాషాయ దళం .. పరిస్ధితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ అంథకారమవుతుందని నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు మేల్కొకపోతే 2019 ఎన్నికలను ఎదుర్కొవడం కష్టమని భావించిన ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారు. విభేదాలతో దూరమవుతున్న మిత్రులను దగ్గర చేసుకోవడంతో పాటు పార్టీలోని అసంతృప్తి గళాలను బుజ్జగించే పనిలో పడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రెండున్నరేళ్లలో ఢిల్లీ, పంజాబ్‌ మినహా పలు చోట్ల ఏక పక్ష విజయాలు సాధిస్తూ వచ్చిన బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత వరస ఓటములు ఎదురయ్యాయి. పార్టీకీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను సైతం కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో కాంగ్రెసేతర పార్టీలతో కయ్యానికి కాలు దువ్వడం కంటే స్నేహ హస్తం చాచడమే ముఖ్యమని అగ్రనేతలు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్ధాన్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ మూడు చోట్ల బీజేపీ అధికారంలో ఉండగా .. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మూడు రాష్ట్రాల పరిధిలోని ప్రభుత్వాలపై తీవ్ర స్ధాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ... పార్టీ పరాజయం పాలైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కష్టాలు తప్పవని కషాయదళం భావిస్తోంది. ఇలాంటి సమయంలో మిత్రులను దగ్గర చేసుకుంటే ఆశించిన స్ధాయిలో ప్రయోజనం దక్కుతుందని నేతలు నిర్దారణకు వచ్చారు. ముఖ్యంగా దళితులు, బీసీలను దగ్గర చేసుకునేలా వ్యూహాలు రచిస్తోంది.

పార్టీ ఏర్పాటు నుంచి మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న శివసేన గతకొద్ది కాలంగా ప్రధాని మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీపై తమ అభ్యర్ధులను బరిలోకి దింపింది. విజయం సాధించలేకపోయినా ... బీజేపీని ఓడించడంలో మాత్రం సఫలమైంది. ఈ దశలో శివసేనను దూరం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని భావించిన అమిత్‌షా విభేదాలను పరిష్కారానికి శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కానున్నారు. అయితే శివసేన మాత్రం 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ప్రకటించడం ఇప్పుడు వారి మధ్య విబేధాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది. మరో మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌తో గురువారం భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో పాటు లాలూను దూరం చేసుకుని తమకు దగ్గరైన నితీష్‌ కూడా ఇటీవల కాలంలో స్వరం మారుస్తున్నట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారు. సీట్ల పంపకం పేరుతో నితీష్ ఇస్తున్న ప్రకటనలు ఇబ్బందిగా మారుతున్నాయని గ్రహించి ... చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు.

దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యాకలాపాలకు దూరం ఉన్న వృద్ధ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలను తెరపైకి తేవాలని అమిత్‌షా భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో కలిసి ఓ సారి ఇరువురితో చర్చించిన అమిత్‌షా ... 2019 ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించినట్టు సమాచారం. వీరితో శత్రుఘ్న సిన్హా వంటి నేతలను కూడా బుజ్జగించేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపారు. వ్యక్తిగత ప్రతిష్టను సైతం పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సమయంలో అంతా ఏకం కావాల్సిన అవసరముందంటూ అమిత్‌షా నేతలకు స్వయంగా నూరిపోస్తున్నారు. బీజేపీతో పోత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని శివసేన అధినేత ఉద్దవ్ ప్రకటించినప్పటికి ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ అగ్రనేతలు ఇక ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ తాను పోటీ చేసే సీట్లను సైతం కొత్తగా కలిసి వచ్చే మిత్ర పక్షాల కోసం వదులుకోవాలని భావిస్తున్న తరుణంలో బీజేపీ కూడా ఇప్పుడున్న మిత్ర పక్షాలు దూరం కాకుండా జాగ్రత్తపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories