ప్రేమాట... పెళ్లి బాట... ప్లేయర్స్‌ లవ్‌ బాల్‌

ప్రేమాట... పెళ్లి బాట... ప్లేయర్స్‌ లవ్‌ బాల్‌
x
Highlights

మానవజీవితంలో పుట్టుక ఎంత విలక్షణమైనదో....పెళ్లికీ అంతే ప్రాముఖ్యత ఉంది. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ జీవితంలో వివాహం అనేది ఓ మధురఘట్టం. కొందరు ప్రేమ...

మానవజీవితంలో పుట్టుక ఎంత విలక్షణమైనదో....పెళ్లికీ అంతే ప్రాముఖ్యత ఉంది. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ జీవితంలో వివాహం అనేది ఓ మధురఘట్టం. కొందరు ప్రేమ వివాహాలు చేసుకొంటే...మరికొందరు..పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోడం సాధారణ విషయమే. అయితే క్రీడారంగంలో అహరహం శ్రమిస్తూ...దేశకీర్తిప్రతిష్టలకోసం పాటుపడే క్రీడాకారులు సైతం.. పెళ్లికి ఏమాత్రం మినహాయింపు కాదు. దేశాలు, రాష్ట్రాలు, క్రీడలు, రంగాలకు అతీతంగా నిలిచిన క్రీడాప్రముఖుల ప్రేమాట...పెళ్లిబాట.

పెళ్లి...రెండక్షరాల మాట మాత్రమే కాదు. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల అపూర్వకలయిక. మనిషి పుట్టుక కు మాత్రమే కాదు....వివాహానికీ ఎంతో ప్రాధాన్యముంది.పెళ్ళంటే...మూడుముళ్ళు...ఏడడుగులు మాత్రమే కాదు. యువతీయువకులు...వివాహబంధంతో ఒక్కటై జీవనయానం సాగించే మధురఘట్టం. కష్టసుఖాలను, ఆటుపోట్లను ఎదుర్కొంటూ సాగించే సాహసయానం.

వివాహం...మానవజీవితంలో మాత్రమే కాదు...దేశం కోసం అహరహం శ్రమించే క్రీడాకారుల జీవితంలోనూ ఓ ప్రధాన భాగమే. క్రీడలే ఆశగా, శ్వాసగా...జీవితంగా భావించే క్రీడాకారులు సైతం....ప్రేమకు, పెళ్లికి ఏమాత్రం అతీతులుకారు. పురుష, మహిళా క్రీడాకారులు...కలసి సాధన చేయటం,...ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనటం మామూలు విషయమే. అయితే..కలసి సాగించే ప్రయాణంలోనే ఒకరి భావాలు ఒకరికి నచ్చడం, భావోద్వేగాలను పంచుకోడం ద్వారా దగ్గరయ్యే క్రీడాకారులు లేకపోలేదు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల మధ్య మాత్రమే కాదు...వివిధ దేశాల క్రీడాకారుల మధ్య స్నేహం చిగురించడం...అదికాస్త ప్రేమగా ...పెళ్లిగా మారిన సందర్భాలు ఉన్నాయి. క్రీడలకు మాత్రమే కాదు...ప్రేమకు, పెళ్లికి హద్దులు, సరిహద్దులు లేవని...కులాలు, మతాలు, భాషాభేదాలు అసలే లేవని...తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జీవితాన్ని చూస్తేనే తెలుస్తుంది. అంతర్జాతీయ చదరంగ పోటీలలో పాల్గొనే సమయంలో పరిచయమైన సెర్బియా గ్రాండ్ మాస్టర్ నదెద్జాను జీవితభాగస్వామిగా చేసుకోడమే కాదు...తెలుగు సాంప్రదాయ వివాహం చేసుకోడం ద్వారా.. హరికృష్ణ...ప్రేమకు, పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పాడు.

జర్నలిస్ట్ గా మారిన భారత మాజీ చెస్ ప్లేయర్ నిఖిలేష్ సైతం...కొలంబియా గ్రాండ్ మాస్టర్ ఏంజెలో కు తన ప్రేమను చాటి...వేలికి ఉంగరం తొడగటం ద్వారా సంచలనం సృష్టించాడు. చదరంగ క్రీడకు చెందిన ఈ రెండుజంటలను చూస్తే...ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అంతేకాదు...భారత బ్యాడ్మింటన్ క్రీడలోనూ మనకు ప్రేమజంటలు ఎక్కువగానే కనిపిస్తాయి. ప్రేమను వివాహబంధంగా మార్చుకొన్నవారే అధికంగా ఉన్నారు.
ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, భారత ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్...మాజీ ఒలింపియన్ పీవీవీ లక్ష్మిని...తన జీవితభాగస్వామిగా చేసుకొని...ఇద్దరు బిడ్డలతో పండంటి కాపురానికి యజమానిగా మారాడు. ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేశ్ కుమార్...ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా హాకీ ప్లేయర్ నిధి ఖుల్లర్ ను పెళ్ళాడి...సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇదంతా చూస్తుంటే...డాక్టర్లను డాక్టర్లు, యాక్టర్లను యాక్టర్లు పెళ్లాడటం ఎంత సహజమో....క్రీడాకారులను క్రీడాకారులు జీవితభాగస్వాములుగా చేసుకోడం అంతే సహజమని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories