పెళ్లంటే గుక్క‌ప‌ట్టి ఏడుస్తున్న వ‌రుడు

x
Highlights

అక్కడ బ్యాండ్ మేళం లేకుండానే మోత మోగిపోతుంది. పెళ్లవుతుంటే వధువు కాదు వరుడు గుక్కపెట్టి ఏడుస్తాడు. పెళ్లీడుకొచ్చిన కుర్రాడు ఇంట్లో ఉంటే పేరెంట్స్‌కి...

అక్కడ బ్యాండ్ మేళం లేకుండానే మోత మోగిపోతుంది. పెళ్లవుతుంటే వధువు కాదు వరుడు గుక్కపెట్టి ఏడుస్తాడు. పెళ్లీడుకొచ్చిన కుర్రాడు ఇంట్లో ఉంటే పేరెంట్స్‌కి కూడా ఒకటే దడ. పెళ్లీడు కుర్రాళ్లకు నిజంగానే రక్షణ లేకుండా పోయింది. ఇదంతా నిజమే.. మీరు వింటున్నది గన్‌ పాయింట్‌ సాక్షిగా నిజమే. గన్‌ పాయింట్‌లో తాళి కట్టాల్సిన పరిస్థితి అక్కడ వరులది. ఎందుకని? ఏ ఊరది?

పురాణ కాలంలో రాక్షస వివాహాలుండేవి. వధువును బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకొనే వారు. అది పురాణ కాలం. ఇప్పుడు కలి కాలంలో అది రివర్సైంది. అమ్మాయిలే అబ్బాయిలను ఎత్తుకొని పోయి పెళ్లిల్లు చేసుకొనే రాక్షసి వివాహాలు జరుగుతున్నాయి. ఇండియాలో ఇలాంటి రాక్షసి వివాహాలకు పెట్టింది పేరు బీహార్‌.

బీహార్‌లో వరులను ఎత్తుకొని పోవడం, తుపాకీ పెట్టి తాళి కట్టించడం సర్వ సాధారణం. పోలీసుల రికార్డుల ప్రకారం 2017 సంవత్సంలో 3.400 రాక్షసి వివాహాలు నమోదయ్యాయి. బీహార్‌లో వరులకు రక్షణ లేకుండా పోయింది. కుర్రాడు పెళ్లీడుకొచ్చాడంటే బీహార్‌లో తల్లిదండ్రులకు దడ. బయటికి వెళ్లిన కుర్రాడు క్షేమంగా ఇంటి కొచ్చే దాక డౌటే. అదే కాస్త అందంగా, అంతో ఇంతో చదువుకొని ప్రయోజకుడయ్యే లక్షణాలుంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఫుల్‌ డిమాండ్‌. అమ్మాయికి కుర్రాడు నచ్చాడా అంతే సంగతులు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు చెబుతుంది. ఫలానా కుర్రాడు నచ్చాడని. అంతే అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి తాంబూలాలు తీసుకొని వరుడి ఇంటికి వెళ్లరు. కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకొని బయలు దేరుతారు. యుద్ధానికి కాదు. తమ అమ్మాయికి నచ్చిన వరుడిని ఎత్తుకొని రావడానికి. అవసరమైతే కాళ్లు చేతులు కట్టేసైనా పెళ్లి చేయడానికి. ఇది బీహార్‌లో నిత్య కృత్యమైంది.

వరుడిని కిడ్నాప్‌ చేయడం, కత్తో, తుపాకో పెట్టి తాళి కట్టించడం ఇటీవల కాలంలో బీహార్‌లో ఎక్కువైంది. 2014లో రాక్షసి వివాహాలు 2,526 జరగగా, 2015లో 3,000, 2017లో అది 3,400కి చేరింది. అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులనో, బంధువులనో చంపేస్తామని వరుడిని భయపెడతారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి వరుడు ఎంత గింజుగున్నా వధువు బంధువులూ వినరూ, వధువూ వినదు. చచ్చినట్లు తాళి కట్టాల్సిందే. లేదంటే ఎవరో ఒకరు చావాల్సిందే. అలా ఉంటుందీ బీహార్‌లోని రాక్షసి వివాహాల తంతు. ఇప్పుడు బీహార్‌లో పెళ్లిళ్ల నెల. దీన్ని వాళ్లు లగాన్‌ అంటారు. ఈ లగాన్‌ సీజన్‌లో వరుల రక్షణ బీహార్‌ పోలీసులకు తలకి మించి భారమై పోయింది. ఎటు పక్క నుంచి అమ్మాయి బంధువులు తోడేళ్లలాగా కుర్రాళ్లను ఎత్తుకొని పోతారో అని హడలి పోతున్నారు.

ఇంతకీ బీహార్‌లా ఇలా పద్దెనిమిది సంవత్సారాలు దాటిన కుర్రాళ్లను ఎందుకు ఎత్తుకొని పోతారో తెలుసా? వర కట్నం. కేవలం వరకట్నమే కారణం. వరుడు కుటుంబాలు అడిగినంత కట్నాలు ఇచ్చుకోలేని వధువు కుటుంబాలే ఇలా కిడ్నాప్‌ చేసి మరీ తమ అమ్మాయిలకు పెళ్లిల్లు చేసేస్తుంటారు. మరి బలవంతంగా తాళి కట్టిన కుర్రాడు సక్రమంగా కాపురం చేస్తాడా అని మన లాంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనుమానం రావొచ్చు. బీహార్‌లో అలా ఏమీ ఉండదు. వరుడిని ఎత్తుకొచ్చి బలవంతంగా తాళి కట్టించిన అమ్మాయి బంధువులు.. పెళ్లయ్యాక వరుడు ఏవైనా తింగరి వేషాలేస్తే బొక్కలిరగదీస్తారు. అందుకనే గన్‌పాయింట్‌లో తాళి కట్టినా.. తరువాత సంసారం కూడా చచ్చినట్లు సవ్యంగానే చేస్తారట.

పెళ్లి కొడుకును ఎత్తుకొని వచ్చే తంతులో అమ్మాయి తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల సహాయం తీసుకుంటారు. లేదంటే.. కిరాయి క్రిమినల్స్‌ని కూడా నియమిస్తారు. ఈ లగాన్‌ సీజన్‌లో బీహార్‌ అబ్బాయిలకు అస్సలు రక్షణ లేకుండా పోతోంది. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రాక్షసి వివాహాలు జరుగుతున్నా.. అందులో బీహార్‌దే టాప్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories