న్యాయమా నీవెక్కడ ?

న్యాయమా నీవెక్కడ ?
x
Highlights

ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట బాలికలపై లైంగికదాడుల వార్తల్ని వినాల్సివస్తోంది. ఇవేవీ పాలకుల, ప్రభుత్వాల చెవిన మాత్రం పడటం లేదు. సుప్రీంకోర్టు స్వయంగా...

ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట బాలికలపై లైంగికదాడుల వార్తల్ని వినాల్సివస్తోంది. ఇవేవీ పాలకుల, ప్రభుత్వాల చెవిన మాత్రం పడటం లేదు. సుప్రీంకోర్టు స్వయంగా కలుగజేసుకొని పెండింగ్‌ కేసులు ఎన్ని ఉన్నాయని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌ను అడిగితే లక్షకు పైగా కేసులు ఉన్నాయని తేలింది. 'పోక్సో' చట్ట ప్రకారం బాలికలపై లైంగిక దాడి కేసుల విచారణ ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలి. అలాంటిది ట్రయల్‌ కోర్టుల్లో లక్షకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండటమేందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రోజు రోజుకీ దేశవ్యాప్తంగా బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. దానికి తోడు కేసుల విచారణలో జాప్యం పెరుగుతోంది. 2016లో బాలికలపై లైంగికదాడులకు పాల్పడ్డ కేసులు దాదాపు లక్షకు చేరుకున్నాయి. అయితే ఆ ఏడాది ట్రయల్‌ కోర్టు తీర్పుకు నోచుకున్న కేసులు 229 మాత్రమే. ఈ మేరకు సమాచారం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్‌విల్కార్‌, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి వచ్చింది.

దీనిపై స్పందించిన ధర్మాసనం దేశవ్యాప్త హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్స్‌కు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. లైంగికదాడుల్లో బాలికలు బాధితులుగా ఉండి, కఠినమైన ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రెన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌ చట్టం కింద నమోదై, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సేకరించి నాలుగు వారాల్లోగా అందజేయాలని ఆదేశించింది.

పోక్సో చట్టం ప్రకారం.. బాలికలపై లైంగికదాడులకు పాల్పడిన కేసుల చార్జ్‌షీట్‌.. ట్రయల్‌ కోర్టు దృష్టికి వచ్చాక ఏడాది కాలంలో తుదితీర్పు వెలువరించాలి. ఎనిమిది నెలల బాలికపై ఆమె బంధువు లైంగికదాడికి పాల్పడిన కేసులో న్యాయవాది అలాక్‌ అలోక్‌ శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2016 నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో రిపోర్టును ఉటంకిస్తూ..పోక్సో చట్టం కింద మొత్తం 1,01,326 కేసులు నమోదు కాగా అందులో కేవలం 229 కేసులు మాత్రమే తీర్పును పొందాయని పిల్‌లో పేర్కొన్నారు.

ఇందులో 70,435 పోక్సో కేసులు 2015నుంచి కొనసాగుతుండగా 2016లో కొత్తగా 30, 891 కేసులు ట్రయల్‌ కోర్టుకు వచ్చాయని, దీంతో 2016లో మొత్తం పెండింగ్‌లో ఉన్న పోక్సో కేసులు లక్షకు చేరుకున్నాయని తెలిపారు. 12 ఏళ్ల లోపు బాలికలు లైంగికదాడికి గురైన కేసుల దర్యాప్తు, కోర్టుల విచారణ ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా పోక్సో చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు.

ఈ పిల్‌ను విచారిస్తూ..అన్ని విధాలుగా పరిశీలించి ఈ కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం వివరించింది. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల వివరాలను సేకరించేలా హైకోర్టు జనరల్స్‌కు సూచించాల్సిందిగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 20కు వాయిదా వేసింది ధర్మాసనం.

Show Full Article
Print Article
Next Story
More Stories