Top
logo

రాజాసింగ్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రచ్చరచ్చ

X
Highlights

ప్రపంచమంతా ఇప్పుడు రంజాన్‌ సందడి సాగుతోంది. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, సాయంత్రం ఇఫ్తార్‌ విందులతో కోలాహలం...

ప్రపంచమంతా ఇప్పుడు రంజాన్‌ సందడి సాగుతోంది. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, సాయంత్రం ఇఫ్తార్‌ విందులతో కోలాహలం నెలకొంది. మొన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకంగా 66 కోట్లతో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందును టార్గెట్‌ చేస్తూ, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌ వేదికగా, కాకరేపే కాంట్రవర్సియల్‌ కామెంట్లు చేశాడు. ఇఫ్తార్‌ విందులు పెట్టి, ఓట్లను అడుక్కుంటున్నారని అన్నాడు. ముస్లింలతో కూర్చుని, విందు ఆరగించే నాయకులంతా బిచ్చగాళ్లని అభివర్ణించాడు.

ఇంతటితో రాజాసింగ్‌ మైక్‌ కట్టేయలేదు. పవిత్ర మతగ్రంధాలు, సిద్దాంతాలపై కామెంట్లు చేశాడు. కొన్ని మతాలు, వాటి మతగ్రంథాలు హిందువులను చంపాలని రాశాయని అన్నాడు. అటువంటి ఇఫ్తార్‌ విందులను తానెందుకు ఏర్పాట చేస్తానని, ఎవరైనా పిలిస్తే ఎందకు పోతానని చెప్పుకొచ్చాడు రాజాసింగ్. ఇవేకాదు, ఇంకా చాలా చాలా కామెంట్లు చేశాడు రాజాసింగ్. కానీ గోషామహల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రచ్చరచ్చవుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్‌, టీడీపీ, ఇంకా అనేక పార్టీలు, నాయకులు రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించారు. రాజాసింగ్ మాటలు దుర్మార్గపూరితమైనవి ముస్లిం మతపెద్దలు కూడా అన్నారు.

ఇఫ్తార్‌ విందు సాంప్రదాయం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్నదే. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ నెలలో, ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో మహమ్మదీయులు ఇచ్చే విందునే "రంజాన్ విందు", లేదా ఇఫ్తార్ విందు అంటారు.

వివిధ రాజకీయ పార్టీలు, ముస్లింలకు ఇఫ్తార్‌ విందులు ఇవ్వడం ఇప్పటిది కాదు. అసలు పొలిటికల్ పార్టీలకంటే ముందే, హిందువులే, తమ ఇరుగుపొరుగు ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ పార్టీలిచ్చే సంప్రదాయం పూర్వం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతారు. కఠోరమైన ఉపవాసమున్న ముస్లిం సోదరులకు, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడం, వారితో కలిసి భుజించడం అన్నది ఎప్పటి నుంచో సాగుతున్నదే. అంటే ఒకప్పుడు ఇఫ్తార్‌ విందులు, మతసామరస్యానికీ ప్రతీకలన్న మాట.

తర్వాతికాలంలో, రాజకీయ పార్టీలు, ఇఫ్తార్‌ విందుల్లోకి ప్రవేశించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ సంస్కృతిని ప్రారంభించిందని చెబుతారు. రంజాన్ మాసంలో కాంగ్రెస్‌ సహా తెలుగుదేశం, టీడీపీ, సహా అనేక పార్టీలు ముస్లింలకు భారీ ఎత్తున విందులిస్తాయి. మొన్న టీడీపీ, టీఆర్ఎస్‌ ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల్లో ముస్లిం సోదరులకు పార్టీలిచ్చాయి. ఇఫ్తార్‌ విందులపై చిందులేసే బీజేపీలోని చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఇఫ్తార్‌ పార్టీలిచ్చారు. కానీ రాజాసింగ్‌ మాత్రం, ఇఫ్తార్‌ విందులపై మాటల తూటాలు పేల్చాడు.

ఇఫ్తార్‌ పార్టీలు, ఓటు బ్యాంకు రాజకీయం కోసమేనన్న రాజాసింగ్‌ వ్యాఖ్యల్లో పూర్తిగా అవాస్తవం లేదు. రంజాన్‌ విందుల్లో ఓట్ల లెక్కలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మొత్తం రాజకీయమే అనడం కూడా సరైందికాదని విశ్లేషకుల అభిప్రాయం. మతసామరస్యం, పేద ముస్లింలను ఆదుకోవడం వంటి ఉద్దేశాలూ ఉన్నాయంటున్నారు. అలాగే విందుల వరకే రాజాసింగ్‌ మాటలు పరిమితమై ఉంటే, పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. మతాల మధ్య చిచ్చుపెట్టేవిధంగా రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అలాంటి కామెంట్లు, సమాజానికి ఏమాత్రం మంచి చేయవని విశ్లేషకులంటున్నారు. అంతేకాదు, ఇఫ్తార్‌ విందుల్లో రాజకీయముందంటున్న రాజాసింగ్ వ్యాఖ్యల్లోనూ రాజకీయం లేదా అని కూడా ఎదురుప్రశ్నలు దూసుకొస్తున్నాయి.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, కాంట్రావర్సియల్‌ కామెంట్స్ కొత్తకాదు. అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లతో పోటీ అన్నట్టుగా, వారికంటే నాలుగు ఎక్కువే మాట్లాడేస్తాడన్న ముద్ర వేయించుకున్నాడు. ప్రతి హిందువు, తమ ఇంట్లో కత్తులు పెట్టుకోవాలని ఒకసారి, టాలీవుడ్‌లో హీరోయిన్లపైన మరోసారి, వందేమాతరం పాడకపోతే ఈ దేశంలో ఉండొద్దని ఇంకోసారి, అయోధ్య రామ మందిర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే, నాలుక కోస్తా, పీకకోస్తా, ఇలా చెప్పుకుంటూ పోతే, లెక్కలేనని ప్రోవోకింగ్‌ కామెంట్లు చేశాడు. ఎన్నికల సమయంలో, ఇంకెన్నో రెచ్చగొట్టుడు ప్రసంగాలు. హైదరాబాద్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా పోలీస్‌ స్టేషన్లలో రాజాసింగ్‌పై కేసులున్నాయి. రకరకాల ఇష్యూలపై బీజేపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న తాజ్‌మహల్‌పైనా యూపీ బీజేపీ ఎమ్మెల్యే, చేసిన కామెంట్స్‌ కూడా కేరాఫ్‌ కాంట్రావర్సీ అయ్యాయి. మొత్తానికి ఇఫ్తార్ విందులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చాలా పార్టీలు ఈయన వ్యాఖ్యలు ఖండించాయి. ముస్లిం పెద్దలు, సామాజికవేత్తలు కూడా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, సమాజంలో చిచ్చురేపే వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచిస్తున్నారు.

Next Story