ఉరిమే ఉత్తరంలో ఉరకలెత్తే పార్టీ ఏది? నార్త్‌ తెలంగాణ నిజాలు!!

ఉరిమే ఉత్తరంలో ఉరకలెత్తే పార్టీ ఏది? నార్త్‌ తెలంగాణ నిజాలు!!
x
Highlights

మహా యుద్ధం సమీపిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. మరి ఎన్నికల యుద్ధంపై రాష్ట్రం ఏమంటోంది? మారే లెక్కలు...


మహా యుద్ధం సమీపిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. మరి ఎన్నికల యుద్ధంపై రాష్ట్రం ఏమంటోంది? మారే లెక్కలు జరిగే పరిణామాలు.. సరికొత్త సమీకరణలు ఈ ఎన్నికల్లో ఏ ట్రెండ్‌ను సెట్‌ చేయబోతున్నాయి? ఉద్యమంతో ఉరుముతున్న ఉత్తర తెలంగాణ ఏమంటోంది? దాని పరిధిలోని ఐదు జిల్లాల రాజకీయం ఏం చెబుతోంది? ఉత్తర తెలంగాణ ఉరుముతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చాలాచోట్ల హోరాహోరిగా రగులుతున్న ఎన్నికల వేడి. కొన్ని త్రిముఖ పోరుతో కాక పుట్టిస్తుంది. ఎవరెక్కడ గెలుస్తారు. ఎవరెక్కడ ఆధిక్యంలో ఉన్నారు. ఏ ప్రాంతంలో మూడ్‌ ఎలా మారుతోంది. ఆధిక్యం ఎవరిది? ఆధిపత్యం ఎవరిది? తీరిన ఆశల మాటేమిటి..? గల్లంతైన ఆశలెవరివి? ఉత్తర తెలంగాణలో ఉన్న వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పట్టు దక్కేదెవరికి? పటుత్వం కోల్పోతున్నదెవరు?

ఉద్యమాలతో ఉరిమి. పోరాటాలతో మెరుపులు మెరిపించిన ప్రాంతం ఉత్తర తెలంగాణ. పరిపుష్టమైన రాజకీయ చైతన్యంతో రగిలిపోయే ఉత్తర తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు, ఉనికి కాపాడుకునేందుకు పార్టీలన్నీ చెమటొడుస్తున్నాయి. ఇంతకముందు కంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలకు వచ్చేశాయి. 2014 సాధారణ ఎన్నికల్లో 8 చోట్ల విజయం సాధించిన హస్తం పార్టీ... ఆ మెజారిటీ పెంచుకోవాలన్న వ్యూహంతో సాగుతోంది. పట్టులేని ప్రాంతంలో పటిష్టం చేసుకోవాలని కమలం కసరత్తు చేస్తుండగా... సంక్షేమ ఫలాలే విజయతీరాలకు చేరుస్తుందని కారు పార్టీ కదనోత్సహాన్ని కనబరుస్తుంది.

ఉమ్మడి వరంగల్. ఈ జిల్లా తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల. తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా ఉన్న కాకతీయుల కోటలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడించాలని కారు పార్టీ నేతలు కదంతొక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఈసారి హోరాహోరి పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నా సర్వేల సారాంశంతో పార్టీలన్నీ గేమ్‌ప్లాన్‌ మార్చేశాయి. ప్రజలతో మమేకమవుతూ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌, సంక్షేమ ఫలాల అమలును టీఆర్ఎస్‌... రెండు పార్టీల వ్యతిరేక పవనాలను కమలం... అన్నింటిపై సత్తా చాటే లక్ష్యంతో ఉన్న సతంత్రులు... మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా మరోసారి ఉరుముతోంది.

12 నియోజకవర్గాల్లో మూడు చోటల బహుముఖ పోటీ కనిపిస్తుంది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కూడా కొంత కాలం సైలెంట్‌గా ఉన్న హస్తం పార్టీ... పట్టున్న స్థానాలను పదిలం చేసుకునే వ్యూహాన్ని అమలుచేస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను, అసంతృప్తిని కాంగ్రెస్‌ చేసుకుంటుంటే... సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్‌ ఆశపెట్టుకుంది. అయినా చాలా చోట్ల టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇక్కడి 10 నియోజకవర్గాల్లో పరిస్థితి అమీతుమీ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని టీఆర్ఎస్‌, ప్రజాకూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. బహుముఖ పోటీలున్న మధిర, భద్రాచలం, ఇల్లెందు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అంతర్గత కుమ్ములాటలతో అలసిపోయిన అధికార పార్టీలో...అధిష్ఠానం బుజ్జగింపులు కలసిరావచ్చుంటున్నారు విశ్లేషకులు. ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లిల్లో టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్యే ఉంది. మధిరలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌కు దీటుగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి ఉన్నారు. బీజేపీ పోటీలో ఉన్నా... ప్రధాన అభ్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయిలో లేదంటున్నారు జిల్లా ప్రజలు.

నిజామాబాద్‌ జిల్లా. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 9 నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి పార్టీలు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసిన అధికార పార్టీ... మళ్లీ అవే ఫలితాలను తీసుకురావాలన్న వ్యూహంతో ఉంది. జిల్లాలో కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేయాలన్నది హస్తం పార్టీ ఎత్తుగడ. జిల్లావ్యాప్తంగా కొన్ని చోట్ల బీజేపీ పుంజుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకచోట గెలవాలని హోరాహోరీ పోరాడుతోంది. మరొక చోట టీఆర్ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థి బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థులు ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించనునున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌, జుక్కల్‌, ఆర్మూరు, బాల్కొండలో ప్రధాన పార్టీల మధ్యనే ప్రధాన పోటీగా మారుతోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డిలలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కామారెడ్డిలో బీజేపీ చీల్చే ఓట్ల ప్రభావం ప్రధాన పార్టీలపైన పడే అవకాశాలు లేకపోలేదు. నిజామాబాద్‌ రూరల్‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంది. నిజామాబాద్‌ అర్బన్‌లో బీజపీ గట్టి పోటీ ఇస్తుంది. కిందటిసారి ఎన్నికల్లో ఒక సీటు కూడా దక్కని కాంగ్రెస్‌ మళ్లీ పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉంది.

ఇక కరీంనగర్‌ జిల్లా కదనోత్సాహంతో కదంతొక్కుతుంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ సిట్టింగ్‌లపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ పోటీలో ఉన్న సిరిసిల్ల, హుజూరాబాద్‌లతో పాటు మిగిలిన అన్ని చోట్లా గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో జగిత్యాల మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అధికార పార్టీనే గెలిచింది. కరీంనగర్‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. జగిత్యాలపై మంచి పట్టున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి, టీఆర్ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ నుంచి గట్టి పోటీ ఉంది. ఎంపీ కవిత ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడంతో తుది ఫలితంపై చర్చలు జరుగుతున్నాయి. కోరుట్ల, ధర్మపురి, రామగుండం, మంథని, వేములవాడ, మానకొండూరు, పెద్దపల్లి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. పెద్దపల్లిలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే శోభకు టికెట్‌ దక్కకపోవడంతో బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఈమె చీల్చే ఓట్లపై అధికారి పార్టీ అభ్యర్థి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎక్కువ ఓట్లు చీల్చితే కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బరిలో ఉన్న హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కని ప్రవీణ్‌రెడ్డి ఏ మేరకు పని చేస్తారన్నదానిపై విజయం ఆధారపడి ఉంది. ఈయన పూర్తి స్థాయిలో పని చేస్తేనే టీఆర్ఎస్‌ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక స్థానాన్ని మాత్రమే గెల్చుకొన్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉందని అంచనా.

ఉత్తర తెలంగాణలో చివరి జిల్లా... అడవుల ఖిల్లా ఆదిలాబాద్‌ జిల్లా. ఇక్కడి 10 శాసనసభా నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌ మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అన్ని చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ ఆదిలాబాద్‌, ముథోల్‌, నిర్మల్‌లో గట్టి పోటీ ఇస్తోంది. ఆదిలాబాద్‌, ముథోల్‌లలో త్రిముఖ పోటీ ఉంది. ఆదివాసీల మధ్య పోరు, గని కార్మికుల ప్రభావం, తిరుగుబాటు అభ్యర్థుల బెడద, పలు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ ఈ జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి. సీపీఐ పోటీ చేస్తున్న బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్‌ టీఆర్ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ కనిపిస్తుంది. సిర్పూరు, చెన్నూరు, మంచిర్యాలలో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో కారెక్కేశారు.

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వరరెడ్డిల మధ్య తీవ్ర పోటీ ఉండగా, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న స్వర్ణారెడ్డి కూడా మంచి పోటీ ఇస్తున్నారు. తుది పోరు మాత్రం టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యనే కనిపిస్తుంది. ఆదివాసీ ఉద్యమాలతో ఉడికిపోయిన అసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌లో పోటీ ఆసక్తికరంగా ఉంది. కొందరు స్వతంత్రులు ప్రధాన పార్టీలకు సవాలుగా నిలిచే అవకాశం కూడా ఉంది. బోథ్‌, ఆసిఫాబాద్‌లలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల జాతకాలు, పార్టీల తలరాతలు మార్చే ఈ ఎన్నికల మహాయుద్ధంలో అన్ని పార్టీలకు దక్షిణ తెలంగాణ దడ పుట్టిస్తుంది. హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల సమరంలో అంతిమ విజేత ఎవరో తేలాలంటే ఆఖరు నిమిషం వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories