సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమే

సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమే
x
Highlights

సర్పంచ్‌ ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీల ప్రమేయం లేకుండా జరగనున్నాయి. అనేక...

సర్పంచ్‌ ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీల ప్రమేయం లేకుండా జరగనున్నాయి. అనేక కసరత్తుల తర్వాత పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం 2018 బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రవేశపెట్టారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే జరుగుతాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంటే పార్టీ గుర్తులపై జరగవు. పంచాయితీరాజ్ చట్టం 2018 బిల్లును ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 12 వేల 741 గ్రామ పంచాయతీలను గుర్తించింది సర్కార్. కొత్తగా 4380 గ్రామాలకు పంచాయతీ హోదా ఇచ్చింది.

ఇప్పటి వరకు ఐదేళ్లకోసారి మారుస్తున్న రిజర్వేషన్లను ఇకపై ప్రతి పదేళ్లకి మార్చనున్నారు. తండాలు పంచాయతీలుగా చేస్తామన్న టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 500 జనాభా అంతకన్నా తక్కువ జనాభా ఉన్నప్పటికీ పంచాయతీలు ఏర్పాటు చేసింది. 100% ఎస్టీ జనాభా ఉంటే అక్కడ ఎస్టీలకే రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాంటి పంచాయితీలు 1326 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

పాలనను మరింత పారదర్శకంగా చేస్తూ పంచాయితీలపై భారం తగ్గించి నిధులు పెంపు చెయ్యనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ వెసులుబాటు కల్పిస్తూ బిల్లు తయారు చేశారు. కొత్త బిల్లు ప్రకారం పంచాయతీ పాలక మండలికే కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ప్రతి నెలా గ్రామ పంచాయితీ సమావేశం, ప్రతి రెండు నెలలకు గ్రామ సభ జరపాలి.

సర్పంచ్ విధినిర్వహణలో విఫలమైతే చర్య తీసుకునే అధికారం కలెక్టర్లకే ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనుంది. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య నినాదం కొత్త చట్టంతో ఆచరణ రూపు దాలుస్తుందని ప్రభుత్వం చేబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories