ఒక్క మోదీ అస్త్రాలు ఏడు

ఒక్క మోదీ అస్త్రాలు ఏడు
x
Highlights

ఏ అస్త్రం ఎలా ప్రయోగించాలో, ఆ విలుకాడికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఏ ఆయుధం ఎలా విసరాలో ఆ రాజకీయ సైనికుడికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు....

ఏ అస్త్రం ఎలా ప్రయోగించాలో, ఆ విలుకాడికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఏ ఆయుధం ఎలా విసరాలో ఆ రాజకీయ సైనికుడికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అస్త్రశస్త్రాలు తీశాడా, ప్రయోగించాడా ఇక అంతే. ప్రత్యర్థి మట్టికరవాల్సిందే. ఇది మహాభారత సంగ్రామంలో అర్జునుడి శస్త్రవిన్యాసం కాదు, గుజరాత్‌ రణక్షేత్రంలో నరేంద్ర మోడీ ఆయుధ ప్రయోగం. దేశమంతా గుజరాత్‌ మోడల్ చూపి ఓట్లడిగిన మోడీ, అదే గుజరాత్‌లో డెవలప్‌మెంట్‌ను కాకుండా, ఏడు భావోద్వేగ అస్త్రాలకు పదునుపెట్టాడు. ఏంటవి?

రాహుల్‌పై మతాస్త్రం
బీజేపీ ఆయుధం, ఆయువు హిందూత్వ. కానీ దళితులు, మైనార్టీలు తన వెంటే ఉన్నారని లెక్కలేసుకున్న రాహుల్‌ గాంధీ, హిందూ ఓట్లపై గురిపెట్టారు. అందుకే గుజరాత్‌ పోల్‌లో ఎన్నడూలేనంతగా హిందూ ఆలయాల సందర్శన మొదలుపెట్టారు. ఏ ఊరికి వెళ్లినా, ఆ ఊరిలో ప్రసిద్ద గుడిని సందర్శించడం మానలేదు రాహుల్. దీంతో నరేంద్ర మోదీ కూడా ఒక్కసారిగా తన ప్రచార తీరే మార్చేశారు. రాహుల్‌ ఆలయాల సందర్శనపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమ్‌నాథ్‌ ఆలయ టెంపుల్‌ చరిత్ర, రాహుల్‌కు తెలుసా అంటూ ఫైరయ్యారు. ఎలాగైనా హిందూ ఓట్లు కాంగ్రెస్‌కు పడకూడదన్న లక్ష్యంతో, రాహుల్‌ నాన్‌ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేయడాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేశారు.

అయ్యర్ నీచ్‌ వ్యాఖ్యలతో సెంటిమంట
ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలో, ఎంత బలంగా ప్రయోగించాలో బహుశా మోదీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదేమో. అందుకు ఉదాహరణ, మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ బహిష్కృత నేత మణిశంకర్‌ అయ్యర్, ప్రధానిపై చేసిన నీచ్‌ వ్యాఖ్యలు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ కామెంట్లతో ఒక్కసారిగా గుజరాత్‌ క్యాంపెనింగ్‌ తీరునే మార్చేశారు నరేంద్ర మోదీ. ఈ కామెంట్లతో గుజరాతీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. తాను అచ్చమైన గుజరాతీనని, అయ్యర్ కామెంట్లు రాష్ట్ర ప్రజలందరిపైనా చేసినవని, బీసీని అయినందుకే ఇలాంటి నీచ్ వ్యాఖ్యలు చేశారని కులం కార్డుతో కుమ్మేశారు. ఈ కామెంట్‌ను మోదీ ఎంత శక్తివంతంగా ప్రయోగించారంటే, ఈ దెబ్బతో కాంగ్రెస‌ అయ్యర్‌ను సస్పెండ్‌ చేసి, నష్టనివారణ చర్యలు తీసుకుంది.

పాకిస్తాన్‌ బ్రహ్మాస్త్రం
సర్వేలు, ప్రజల తీవ్ర ప్రతిస్పందనలు బహుశా నరేంద్ర మోదీలో భయాన్ని రేకెత్తించాయేమో. దీంతో అన్నింటికీ తెగించారు మోదీ. ఆరెస్సెస్‌ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంలాంటి పాకిస్తాన్‌ ఆయుధాన్ని బయటికి తీశారు. బీహార్‌లో కాంగ్రెస్‌కు ఓటెస్తే, పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకుంటారని అమిత్‌ షా నాడు చేసిన వ్యాఖ్యల కంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు మోదీ. మణిశంకర్ అయ్యర్ తనను అడ్డుతొలగించుకోవడానికి పాకిస్తాన్‌‌కు సుపారీ ఇచ్చారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగలేదు మోదీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటోందని హిల్లరీ ఆరోపించినట్టుగానే, గుజరాత్‌ పోల్‌ను పాకిస్తాన్‌ ప్రభావితం చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అహ్మద్‌పటేల్‌ను గద్దెనెక్కించడమే ధ్యేయంగా, మణిశంకర్ అయ్యర్‌ ఇంట్లో రహస్య సమావేశం జరిగిందన్న మోదీ, దీనికి మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ఆర్మీ చీఫ్‌, పాక్ హైకమిషనర్‌ ఉన్నారని ఆరోపించారు. ఎలాంటి నిర్ధారణ, ఆధారాలు లేకుండా మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దేశ ప్రజలను ఆశ‌్యర్యానికి గురి చేసింది. మన్మోహన్‌తో పాటు కాంగ్రెస్ నేతలు, శివసేన, ఎన్సీపీతో పాటు ఎన్డీయేతరపక్షాలు మోదీ వ్యాఖ్యలను ఖండించాయి.

ముస్లిం రాజులతో యువరాజు పోలిక
ఏ దశలోనూ రాహుల్‌ను వదల్లేదు మోదీ. రాహుల్‌ ఆలయాల సందర్శనతో, హిందూ ముస్లిం ఓట్లను చీల్చి,పోలరైజేషన్‌కు ప్రయత్నించారు మోదీ. ఏకంగా రాహుల్‌ గాంధీని ముస్లిం రాజులతో పోల్చారు. రాహుల్‌ది మొఘల్‌ చక్రవర్తుల మనస్తత్వం అని, ఆయన ఔరంగా జేబ్‌ రాజ్యాన్ని తీసుకొస్తారని, బాబర్‌ భక్తుడని, ఖిల్జీకి బంధువంటూ విమర్శించారు. అంటే పరోక్షంగా కాంగ్రెస్‌ వస్తే, ముస్లింల రాజ్యమని, బీజేపీ గెలిస్తే హిందూవుల రాజ్యమని అర్థంవచ్చేలా మాట్లాడారు మోదీ.

రామ మందిరం రగడ
సుప్రీంకోర్టులో నడుస్తున్న రామ మందిరం ఇష్యూనూ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు మోదీ. విచారణను వాయిదావేయాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్‌ సిబాల్ వాదనపై విమర్శలు కురిపించారు. అంటే కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టంలేదని అర్థమైపోయిందని, ప్రచారంలో మాటల తూటాలు పేల్చారు. అంటే జాతీయవాదం, కులం, మతం, ప్రాంతం, ఇలా ఏ అస్త్రాన్నీ వదల్లేదు మోదీ. గోద్రా అల్లర్ల తర్వాత, జరిగిన ఎన్నికల్లోనూ మోదీ ఇదే పంథాను అనుసరించారు. కాంగ్రెస్ గెలిస్తే, హిందువును చంపేస్తారని క్యాంపెన్ చేశారు. కానీ ప్రధాని స్థాయిలోనూ అలానే మాట్లాడతారని మాత్రం ఎవరూ ఊహించలేదు.

హార్థిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీల బాగోతం
పాటిదార్ల ఉద్యమంతో కదంతొక్కిన హార్థిక్‌ పటేల్‌ను ఏకిపారేశారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్‌కు అమ్ముడిపోయాడని ఆరోపించారు. అంతేకాదు, హార్థిక్ ప్రతిష్టను దిగజార్చేలా, సెక్స్‌ టేపులను తెరపైకి తెచ్చారు.

జీఎస్టీ రేట్ల తగ్గింపు
అస్తవ్యస్తంగా జీఎస్టీని తెచ్చారంటూ, గుజరాత్‌లో బీజేపీపై ఓ రేంజ్‌లో ఆగ్రహం ఉంది. వ్యాపారుల్లో అత్యధికంగా మోదీ మీద గొంతుమీదికి ఉన్నారు. అందుకే ఆఖరి నిమిషంలో జీఎస్టీ రేట్లు తగ్గించి, వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు మోదీ.

ఎలక్షన్స్‌కు ముందురోజు మేనిఫెస్టో విడుదల
ఇవేకాదు, ఎన్నికల తేదీని కావాలనే వాయిదా వేయించారన్న ఆరోపణలు, పలు అభివృద్ది శంకుస్థాపనలు, ప్యాకేజీలు, చివరికి రేపు ఎలక్షన్స్‌ అనగా, మేనిఫెస్టో రిలీజ్ చేయడం, చివరి దశ ప్రచారం ముగింపు రోజు సీప్లేన్‌లో విహారం ఇలా ఏ అస్త్రమంటే, ఆ అస్త్రాన్ని గుజరాత్‌ ఎన్నికల్లో ప్రయోగించారు. చివరికి తన అనుకూల జాతీయ మీడియాతో రాహుల్‌ గాంధీపై అనేక ఆరోపణలు గుప్పించారు. విచిత్రం ఏంటంటే, దేశమంతా గుజరాత్‌ మోడల్‌ చూపి, ఓట్లు అడిగి గెలిచిన మోదీ, అదే అస్త్రాన్ని, అదే రాష్ట్రంలో ప్రయోగించలేకపోయారు. దేశానికి ప్రధాని అన్న విషయాన్నీ పక్కనపెట్టి, గుజరాత్‌ క్యాంపెనింగ్‌లో అంతా తానై వ్యవహరించారు. ఏకంగా 40 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏడు అరవీర అస్త్రాలు ప్రయోగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories