logo
జాతీయం

జీతాలు పెంచాలంటూ ఎంపీల వేడుకోలు

జీతాలు పెంచాలంటూ ఎంపీల వేడుకోలు
X
Highlights

వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు ఏ ప్రాజెక్టునైనా పట్టాలెక్కించగలరు.. లెక్క తప్పితే.. అటకెక్కించగలరు.....

వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు ఏ ప్రాజెక్టునైనా పట్టాలెక్కించగలరు.. లెక్క తప్పితే.. అటకెక్కించగలరు.. అధికారం అనే మంత్ర దండానికి అపరిమితమైన పవరుంటుంది. అభివృద్ధి రథం పగ్గాలు ఉండేది వారి చేతిలోనే.. తాము చెప్పిందే.. వేదం.. చేసిందే శాసనం.. ఇది మన పార్లమెంటు ప్రతినిధుల విశ్వరూపం.. ఇన్ని తిరుగులేని అధికారాలతో అద్భుతంగా పనిచేయాల్సిన వీరు జీతాలు పెంచాలంటూ ఇప్పుడు కొత్త డిమాండ్ లేవనెత్తుతున్నారు.. ఈ డిమాండ్ సరైనదేనా?

చేతిలో అధికారమనే మంత్రదండం ప్రజాప్రతినిధి అనే హోదా అయిదేళ్ల లైసెన్స్ జీతం కన్నా గీతం ఎక్కువ ఇన్ని సౌకర్యాలున్నా మన ఎంపీలు జీతం పెంచాలంటున్నారు కనీసం సెక్రటరీలకన్నా ఓ వెయ్యి తేడా చూపండంటూ వేడుకుంటున్నారు ఓ సాధారణ క్లర్కులాగా ఎంపీలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు. మన ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచాలట దేశంలో సగటు సామాన్యుడు పస్తులు పడుకుంటుంటే మన పార్లమెంటు ఎంపీలు మాత్రం తమకు జీతాలు పెంచాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెస్తున్నారు ఇప్పటికే లక్షకు పైగా జీతం, భారీగా ఇతర భత్యాలు, సౌకర్యాలు అనుభవిస్తున్న ఎంపీలు అది తమకేమాత్రం చాలదంటున్నారు తమ పనికి, హోదాకి తగిన గుర్తింపు ఉండాలంటే జీతం పెంచాల్సిందే నంటున్నారు.

పార్లమెంటు సమావేశాల సమయాన్ని వాకవుట్లు, సస్పెన్షన్లు, బాయ్ కాట్ లతో వృథా చేసే నేతలు వారి జీత భత్యాల పెంపు విషయంలో ఏ మత్రం మొహమాట పడకుండా డిమాండ్ చేస్తున్నారు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ నేత నరేష్ అగర్వాల్ సారధ్యంలో చేసిన ఈ డిమాండ్ కు పార్టీల కతీతంగా ఎంపీలంతా సపోర్ట్ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత యూపి సిఎం యోగీ ఆదిత్య నాథ్ సారధ్యంలో కమిటీ జీతాల పెంపును సూచిస్తూ ఒక నివేదిక తయారు చేసింది. ఈ పెంపును సెవెంత్ పే కమిషన్ కు జోడించాలని నరేష్ అగర్వాల్ డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఎంపీలకన్నా వారి సెక్రటరీల జీతమే ఎక్కువగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ సెక్రటరీలకన్నా కనీసం వెయ్యి రూపాయలైనా జీతం ఎక్కువ లేకపోతే తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదంటున్నారు నరే‌ష్ అగర్వాల్. ఎంపీల జీతం మీడియా ప్రతినిధుల జీతం కన్నా తక్కువే ఉందని కూడా నరేష్ అగర్వాల్ కామెంట్ చేశారు ఈ డిమాండ్ ను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కూడా సమర్ధించారు అందరి జీతాల్లాగా ఎంపీల జీతాలు కూడా పెరగాలని ప్రస్తుతం వస్తున్న మొత్తం వారికే మాత్రం సరిపోదనీ తేల్చారు అంతేకాదు సామాన్యుల జీత భత్యాలు కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డిమాండ్ ని తాను కూడా ఎప్పటినుంచో అధ్యయనం చేస్తున్నానని సరైన టైములో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. వాస్తవానికి ఈ డిమాండ్ 2016లో కూడా తెరపైకి వచ్చింది ఎంపీలకు ప్రస్తుతం ఇస్తున్న జీతాన్ని రెట్టింపు చేయాలంటూ పిఎంఓ ఆఫీస్ కే విన్నపాలు అందాయి.

గతంలో ఎంపీల జీతాన్ని పెంచాలంటూ రికమెండ్ చేసిన పానెల్ దానిని ఉన్న దానికంటే రెట్టింపు చేయాలని కోరింది. అలాగే పార్లమెంటు నియోజక వర్గం నిధులను కూడా రెట్టింపు చేయాలని, ఎంపీల పెన్షన్లను కూడా 75 శాతం పెంచాలనీ పానెల్ కోరింది. ఎంపీల జీతాలు చివరి సారిగా2010లో పెంచారు. అప్పట్లో 16 వేలుగా ఉన్న ఎంపీ జీతాన్ని 50 వేలకు పెంచారు ఇప్పుడు దీన్ని రెట్టింపు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎంపీల జీతం పెంచాలంటే పార్లమెంటు ప్రతినిధుల చట్టం1954కు సవరణలు చేయాలి. ప్రజాసమస్యలపైనా, అనేక ఇతర అంశాలపైనా ఒకరితో ఒకరు విభేదించే ఎంపీలు తమ జీతాల పెంపు విషయంలో మాత్రం ఐక్యత ప్రదర్శిస్తున్నారు పార్టీల కతీతంగా స్పందిస్తున్నారు పెంపు సమంజసమేనంటూ కమిటీ నివేదిక పిఎంఓ ఆఫీస్ కు చేరినందున ఇక పెంపు లాంఛనమే కానుంది. అసలే ఓపక్క ధరల పెరుగుదల, మరోపక్క జీఎస్టీ మోత, పేదల సంక్షేమం పేరుతో మోడీ విధిస్తున్న ఆంక్షల చట్ర బంధంలో సామాన్యుడు నలిగి పోతుంటే ఇలాంటి సమయంలో ఎంపీలు జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేయడం సంచలనం స్రుష్టిస్తోంది.

Next Story