logo
జాతీయం

అడుగు పెట్టి... అల్లాడించాడు... మోడీ మేనియా ఎలా పనిచేసింది!!

అడుగు పెట్టి... అల్లాడించాడు... మోడీ మేనియా ఎలా పనిచేసింది!!
X
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే కర్ణాటక రణక్షేత్రంలో అడుగుపెట్టాడో అప్పుడే, మొత్తం కన్నడ రంగస్థలమే మారిపోయింది. ...

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే కర్ణాటక రణక్షేత్రంలో అడుగుపెట్టాడో అప్పుడే, మొత్తం కన్నడ రంగస్థలమే మారిపోయింది. రకరకాల అస్త్రాలతో సిద్దరామయ్య ముందంజలో ఉన్నాడన్న విశ్లేషణలు సాగుతున్న టైంలో, ఎంటరైన మోడీ, సీన్‌ మొత్తం మార్చేశాడు. కమలం విజయాలబాటపట్టించడంలో మోడీ, మరోసారి తాను ట్రంప్‌కార్డ్‌ అని నిరూపించుకున్నాడు. స్థానిక సెంటిమెంట్లను రగిలించారు. భాషా బేధాలు మరిచి,తనను అక్కున చేర్చుకున్నారని కన్నడిగుల మనసు దోచాడు. ఇక్కడి ప్రధానులు, సైనిక అధికారులను కాంగ్రెస్‌ అవమానించిందని ఏకరువుపెట్టారు. ఆశ్చర్యంగా దేవేగౌడను ప్రశంసించి, జేడీఎస్‌ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన సిద్దరామయ్య సర్కారును ఊడ్చిపారేయాలన్నారు మోడీ. పట్టుమని 15 నిమిషాలు కూడా పేపర్‌ చూడకుండా మాట్లాడలేని రాహుల్‌ తనకు పోటీకానేకాదనీ, కూడా మాటల తూటాలు పేల్చాడు. ఇలా అనేక అస్త్రాలను ప్రయోగించి, కన్నడనాట హస్తాన్ని అస్తవ్యస్తం చేసి, కమలాన్ని వికసింపజేశారు మోడీ.

ఎన్నికలు ఏవైనా,ఎక్కడైనా బూత్‌స్థాయిలో ఎలా చొచ్చుకుపోవాలో సరికొత్త పోల్‌ మేనేజ్‌మెంట్‌ను, దేశానికి పరిచయం చేశారు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా. యూపీ, బీహార్‌లో సక్సెస్‌ అయిన బూత్‌లెవల్‌ స్ట్రాటజీని కన్నడ కదనరంగంలో అమలు చేశారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగదళ్‌, ఇలా గల్లీగల్లీలో కాషాయదళాలను పరుగులుపెట్టించారు. ఇంటింటికీ బీజేపీ అన్న నినాదంతో గడపగడపను కార్యకర్తలను పంపించారు. ఇప్పుడు అమలవుతున్నవేంటి, తామొస్తే ఏం చేస్తామో సింపుల్‌గా చెబుతూ, కరపత్రాలు పంచారు. ఇంటింటికీ బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్‌ అయినందనడానికి, గ్రాండ్‌ విక్టరే నిదర్శనం.

సామాజిక సమీకరణల్లో తమకు తిరుగులేదని కమలనాథులు మరోసారి నిరూపించుకున్నారు. విజయంలో కీలకమైన లింగాయత్‌‌లలో సిద్దరామయ్య విభజనకార్డుతో సగం ఓట్లు పోతాయనుకున్న బీజేపీ, వాటిని మరోవర్గంలో పూడ్చుకోవాలనుకుంది. అందుకే దశాబ్దాలుగా తమకు దూరమైన దళితులు, గిరిజనులను దరికి చేర్చుకోవడానికి, శ్రీరాములును ప్రముఖంగా తెరపైకి తెచ్చారు. ఎస్టీ అయిన శ్రీరాములును డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఎస్టీల్లోనే కాదు, దళితుల్లోనూ శ్రీరాములకు మంచిపట్టుంది. శ్రీరాములు ప్రయోగం సక్సెస్ అయిందనడానికి హైదరాబాద్‌ కర్ణాటకలో బీజేపీ విజయాలే ఉదాహరణ.
దళితులు, క్రిస్టియన్లు,ముస్లింలను కలిపి, సిద్దరామయ్య అహిందా అన్న పదబంధాన్ని ప్రయోగించారు. దీనికి క్వైట్ అపోజిట్‌గా బీజేపీ హిందూత్వను ప్రయోగించింది. టిప్పు సుల్తాన్‌ను వెనకేస్తున్న కాంగ్రెస్‌ను, ముస్లిం పక్షపాతిగా ముద్రవేసి, హిందూ ఓట్ల ఏకీకరణ మంత్రం వేసింది. ముఖ్యంగా మతఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే, మంగళూరు వంటి ప్రాంతాల్లో అహిందా వర్సెస్ హిందూత్వ అస్త్రాన్ని బలంగా సంధించింది. కర్ణాటక జనాభాలో 17 శాతమున్న లింగాయత్‌లు, మొదటి నుంచి పక్కా బీజేపీ ఓటు బ్యాంకు. కానీ సిద్దరామయ్య వీరికి మైనార్టీ మత హోదా ఇచ్చి, బీజేపీని ఇరకాటంలో పెడదామనుకున్నాడు. కానీ ఇది కేవలం ఓట్ల జిమ్మిక్కుగా, లింగాయత్‌లనే కాదు, హిందూ మతాన్ని విభజించే కుట్రగా తిప్పికొట్టడంలో కమలం సక్సెస్‌ అయ్యింది. ప్రజల్లో అవగాహన పెంచగలిగింది. అందుకే లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, ముంబై కర్ణాటకలో అత్యధిక స్థానాలు కొల్లగొట్టింది.

ఏ ప్రభుత్వమున్నా ప్రభుత్వ వ్యతిరేకత ఏదో ఒకస్థాయిలో ఉంటుంది. దాన్ని ఓట్లుగా మలచుకోవడంలోనే ప్రతిపక్షం విజయం ఆధారపడి ఉంటుంది. యడ్యూరప్పకు తోడు మోడీ, అమిత్‌ షాలు, సిద్దరామయ్య ప్రభుత్వంపై, అవినీతి పాలనపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో కరప్షన్‌ ఏ రేంజ్‌లో పాతుకుపోయిందో, సామాజిక మాధ్యమాలతో పాటు ఇంటింటీకి వెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. గాలి జనార్ధన్‌ రెడ్డి అండ్ మైనింగ్‌ బ్యాచ్‌‌ను, చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా నెత్తినపెట్టుకున్న బీజేపీ, తప్పు చేసిందన్న విశ్లేషణలు మొదట్లో సాగాయి. గాలి ధనబలం, కండబలం, హైదరాబాద్ కర్ణాటక రీజియన్‌లో ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుందో ఫలితాలు నిరూపించాయి. బళ్లారి, కొప్పాల్, రాయ్‌చూర్, యాద్గిర్, గుల్బర్గా, బీదర్‌లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. గాలి బలం కమలానికి, బూస్ట్‌నిచ్చింది.

కాంగ్రెస్, జేడీఎస్‌, బీజేపీ త్రిముఖంగా పోటీపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, కాంగ్రెస్‌కే లాభిస్తుందన్న విశ్లేషణలు జరిగాయి. కానీ ఈ ట్రయాంగిల్‌ పోరులో, జేడీఎస్‌కు పడే ఓట్లు కూడా బీజేపీకే పడ్డాయని, ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ఇలా కమలం విజయానికి ఎనిమిది అంశాలు, నిచ్చెనమెట్లయ్యాయి.

Next Story