logo
జాతీయం

ఎంపీలే కాదు.. ఎమ్మెల్యేలదీ అదేమాట

ఎంపీలే కాదు.. ఎమ్మెల్యేలదీ అదేమాట
X
Highlights

ఎంపీలేకాదు.. ఎమ్మెల్యేల జీతాలూ పెంచాలన్న వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి పెరుగుతున్న ఖర్చులు, జీవన...

ఎంపీలేకాదు.. ఎమ్మెల్యేల జీతాలూ పెంచాలన్న వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి పెరుగుతున్న ఖర్చులు, జీవన ప్రమాణాల నేపధ్యంలో ప్రస్తుతం వస్తున్న జీతం ఏ మాత్రం సరిపోదని మన ప్రజాప్రతినిధులంటున్నారు అసలు మన ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు, అలవెన్సులు ఎలా ఉంటాయ్?

మన ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు చివరి సారిగా పెరిగింది 2010లో అప్పట్లో ఎంపీల జీతాలు ఒకేసారి మూడింతలు పెంచారు 16 వేలనుంచి 50 వేలకు పెంచుతూ ఒక బిల్లును పాస్ చేశారు అప్పట్లో ఈ నిర్ణయం వివాదంగా కూడా మారింది. ఎంపీల రోజువారీ ఎలవెన్సు వెయ్యి నుంచి రెండు వేలకు, నియోజకవర్గంలో ఆఫీస్ ఎలవెన్సును 20 వేలనుంచి 40 వేలకూ పెంచారు. గత ఏడాది మాజీ ఎంపీల పెన్షన్ ను 8 వేల నుంచి 20 వేలకు పెంచారు. ఎంపీల జీతాలు ఇంత భారీగా పెరుగుతున్నా.. ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలకు సంతృప్తి మాత్రం లేదు కనీసం అయిదింతలు పెరిగితేనే బాగుంటుందని వారు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఎంపీలకు ఇచ్చే జీతం కన్నా ఎలవెన్సులు, అధికారాలు, మర్యాదల రూపంలో అందేదే ఎక్కువ మనదేశంలో ఎంపీలకి చాలా విలువ ఎక్కువ మామూలు జీతంకన్నా ఇతర పనులు, కాంట్రాక్టుల రూపంలో, వివిధ హోదాలలో వారికి లభించే అలవెన్సులు, అదనపు జీతాలు భారీగానే ఉంటాయి అంతేకాక పదవి చేపట్టిన నాటినుంచి ప్రతీ ఎంపీ ఏవో ఓ పనుల రూపంలో ఆమ్యామ్యాలు, లంచాలు తీసుకుంటూనే ఉంటారు. కంటికి కనిపించని క్విడ్ ప్రోకో రూపంలో పనులు చాలా జరిగిపోతూనే ఉంటాయి అయినా జీతాల కోసం మధ్య తరగతి జీవుల్లాగా డిమాండ్ చేస్తూండటం విచిత్రం.

ఎంపీలే కాదు ఎమ్మెల్యేలూ మన దేశంలో తక్కువ తినలేదు. ఇంకా చెప్పాలంటే ఎంపీలకన్నా ఎమ్మెల్యేల జీతమే ఎక్కువ ఎమ్మెల్యేల జీత భత్యాలు కూడా లక్షకు తక్కువ లేవు సాధారణంగా ముఖ్యమంత్రి జీతం ఎంతుండాలన్నది ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటుతో సంబంధం ఉండదు ముఖ్యమంత్రుల జీతాలు ప్రతీ పది సంవత్సరాలకూ ఒకసారి పెరుగుతాయి. ఎమ్మెల్యే జీతం లాగే సిఎం జీతంలోనూ డిఏ, ఇతర ఎలవెన్సులు ఉంటాయి. ఒక సిఎం జీతాన్ని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అసెంబ్లీ నిర్ణయిస్తుంది ప్రస్తుతం దేశంలోకే ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎంగా కేసీఆర్ వార్తలకెక్కారు ఆయన జీతం అందరు సిఎంలకన్నా ఎక్కువ కేసీఆర్ నెలకు నాలుగు లక్షల పదివేలు జీతంగా తీసుకుంటుండగా ఏపి సీఎం చంద్రబాబు నాయుడు మూడు లక్షల 35 వేలు జీతంగా తీసుకుంటున్నారు కేసీఆర్ కు లక్షా 80 వేలు బేసిక్ శాలరీ, డిఏ కింద 96 వేలు అదుతుంది ఇక టిఏ కింద అందేది 30 వేలు ఏపీ సీఎం చంద్రబాబు మొత్తం జీతంలో బేసిక్ లక్షా 38 వేలు కాగా, డిఏ79 వేలు, టిఏ46 వేలుగా ఉంది. ఇక కేసీఆర్ తర్వాత ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన జీతం మూడు లక్షల 90 వేలు ఆ తర్వాత స్థానం యూపి సీఎంది.
ఇక అందరికన్నా తక్కువ జీతం తీసుకుంటున్న ది త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన జీతం లక్షా అయిదు వేల అయిదు వందలు మాత్రమే.

జీతం పెంచాలని కోరుకుంటున్న ఎంపీలు మరి తమ విధి నిర్వహణలో అంత చిత్తశుద్ధితో ఉన్నారా?పార్లమెంట్ అనే దేవాలయంలో అంత నిబద్ధతతోనూ పనిచేస్తున్నారా? చేస్తున్న పనికన్నా వేస్టు చేస్తున్న సమయమే ఎక్కువని ఎంపీల ట్రాక్ రికార్డ్ చెబుతోంది మరి జీతాల పెంపుదల చేయాల్సిందేనా?

ప్రభుత్వం చేసిన, చేస్తున్న, చేయబోయే పనులకు దానిని జవాబుదారీగా నిలబెట్టడం కట్టు తప్పితే నియంత్రించడం పార్లమెంటు విధి అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన పనులు, చేయాల్సిన వాటి గురించి ప్రశ్నించి ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదే కానీ మన దగ్గర అర్ధవంతమైన చర్చలకన్నా అల్లరి, గందరగోళం ఎక్కువ గత పార్లమెంటు సమావేశాల్లో విలువైన సభాసమయాన్ని విపక్షాలు చాలా దారుణంగా దుర్వినియోగం చేసాయి. దాదాపు 80 శాతం సమయం కేవలం డీమానిటైజేషన్ పై విపక్షాల గందరగోళం వల్ల వృథా అయింది. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను పరిశీలించి, వాటిపై చర్చించి అవసరమైతే మార్పులు సూచించి అర్ధవంతమైన చర్చలకు, ఉపయోగకరమైన చట్టాలకు తెర తీయాల్సిన ఎంపీలు అసలు ఉద్దేశ్యాన్నే గాలికి వదిలేస్తున్నారు.

ప్రజాసమస్యలకు పరిష్కారం జరగాల్సిన చోట రెచ్చగొట్టుకోడాలు, తొడగొట్టుకోడాలు, దూషణ, భూషణలు జరిగిపోతున్నాయ్ ఒకరినొకరు హద్దుమీరి తిట్టుకోడం కొట్టుకోడం పరిపాటిగా మారిపోయింది ఎంపీలు తమ హోదాను మరచి ఉభయ సభల్లోనూ రచ్చ రచ్చ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎంపీల బాధ్యతారాహిత్యం వల్ల విలువైన బిల్లులు ఆగిపోతున్నాయ్ పరిష్కరించాల్సిన సమస్యలు అలాగే ఉండిపోతున్నాయ్ ఆ బిల్లులు చట్టంగా మారి ఎందరికో ప్రయోజనం కలిగించాల్సి ఉండగా.. పార్లమెంటు సమావేశాలు జరగక కోట్లాది మంది నష్ట పోవాల్సి వస్తోంది.. 2015 పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో లోక్ సభలో 102 గంటల సమయం సభ జరిగితే.. అందులో ప్రయోజన కరంగా సాగినది 47 గంటలు మాత్రమే.. మిగతా54 గంటలూ దుర్వినియోగమే అయింది.. లోక్ సభలో వినియోగించుకోవల్సిన సమయాన్ని కేవలం46 శాతం మాత్రమే అర్దవంతంగా వినియోగించుకోగలిగారు మన ఎంపీలు.. దాదాపు 54 శాతం సమయం వృథాయే అయింది. ఇక2016 శీతాకాల సమావేశాల వివరాలకొస్తే..108 గంటల సమయంలో అర్ధవంతంగా సభ జరిగినది కేవలం 16 గంటలే.. 91 గంటల సమయం వేస్టయిపోయింది. అంటే ఎన్నో బిల్లులు, శాసనాలూ చర్చకు నోచుకోకుండా మిగిలిపోయాయి. టూజీ స్పెక్ట్రమ్, బొగ్గు స్కామ్ అంశాలపై రోజుల తరబడి పార్లమెంటు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.

అటు రాజ్యసభలోనూ అదే తీరు 2015 వర్షాకాల సమావేశాల్లో మొత్తం వందగంటలు రాజ్యసభ నడిస్తే అందులో అర్ధవంతంగా సాగినది కే వలం తొమ్మిదంటే తొమ్మిది గంటలు మిగతా 91 గంటల సమయం వృథాయే అయింది. ఇక 2016 శీతాకాల సమావేశాల తీరూ అంతే 106 గంటలు రాజ్యసభ జరిగితే అందులో 19 గంటలు మాత్రమే సద్వినియోగం అయింది. మిగిలిన 86 గంటలూ దుర్వినియోగమే ఈ తీరున సభలు జరుగుతుంటే వీరు కష్టపడిపోతున్నదెంత? ప్రజా సేవ చేస్తున్న దేముంది? అయినా జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం విచిత్రం.

మన ఎంపీలకు కల్పిస్తున్న రాయితీలను లెక్కేస్తే ఓ ఊరిని బాగు చేయొచ్చు ఓ నియోజక వర్గాన్ని చక్కదిద్దొచ్చు ఒక్కసారి ఎంపీ అయితేనే ఓ తరానికి సరిబడ పోగేసుకునే నేతలున్న ఈ రోజుల్లో ఎంపీల జీతాల పెంపు డిమాండ్ సరైనదేనా?

మన ప్రజా ప్రతినిధులలో కొందరికి పార్లమెంటుకు హాజరవడం జస్ట్ హాబీ కోటాలో రాజ్యసభ సీట్లు పొందే ఎంపీలకు మరీ వెసులుబాటు వారు నెలకోమారు పార్లమెంటుకు రావడమే ఎక్కువ వీరు నియోజక వర్గాల ముఖం చూసింది లేదు అక్కడి సమస్యలపై అవగాహన ఉండదు ఎంపీ లాడ్స్ నిధులు వాడరు అవి మురిగిపోయి వెనక్కుపోవాలి తప్పిస్తే పైసా ఖర్చు చేయరు వారు పార్లమెంటుకు రావడమంటే పార్లమెంటుకు గౌరవం పెరిగినట్లుగా భావిస్తారు.

మరికొందరు నేతలు పార్లమెంటులోనే కునుకు తీస్తారు సమస్యలపై స్పందించడం కూడా అంతంత మాత్రమే ప్రజల సొమ్ముతో ఎన్నికై నిలబడ్డ ఈ నేతలంతా వాస్తవానికి అయిదేళ్లపాటూ తమ నియోజక వర్గం తలలో నాల్కలా మెలగాలి వారి అవసరాలను తీర్చాలి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి ప్రజాసేవలో అనునిత్యం తరించాలి కానీ మన దగ్గర ఈ తరహా నేతలెంతమంది ఉన్నారు? ఒక్కసారి పదవి చేపడితేనే.. తరాలకు సరిపడ ఆస్తులు పోగేసుకునే ఎంపీలకూ కొదవ లేదు. నీతికి, నిజాయితీకి, నిలబడి నూటికి నూరుపాళ్లు ప్రజాసేవపైనే దృష్టి పెట్టే వారు చాలా తక్కువ ఎంపీలకు రాయితీల రూపంలో దక్కుతున్న వెసులు బాట్లతో ఓ ఊరిని బాగుచేయొచ్చు ఓ నియోజక వర్గాన్ని చక్కదిద్దొచ్చు.. వారి ఫోన్ బిల్లులు, విమానయాన ఖర్చులు, అధికారిక నివాసాలు, రవాణా ఖర్చులు, రాజభోగాలన్నీ లెక్క కడితే ఇప్పుడు వారు పెంచమని అడుగుతున్న జీతంకన్నా ఎక్కువే ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు రాయితీల రూపంలో పొందుతూ ఇంకా జీతాలు పెంచాలని కోరడం న్యాయమేనా?

మన దేశం వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు అధికారాన్ని ఏళ్ల తరబడి ఒకే కుటుంబం చేతిలో ఉంచుకుని ప్రయోజనాలు పొందుతున్నవారే తరాల తరబడి అవే నియోజక వర్గాలను కంచుకోటలుగా నిలబెట్టుకునే కుటుంబాలూ ఉన్నాయి ఎన్నికలలో పోటీ చేయడానికి పెడుతున్న ఖర్చును కూడా కార్పొరేట్ కంపెనీల నుంచి చందాల రూపంలో సేకరిస్తున్న నేతలు ఆ తర్వాత కాంట్రాక్టులు దక్కించుకోడంలోనూ కోట్లలలోనే లాభాలు కళ్ల చూస్తూ జీతాలు పెంచమని అడగటం భావ్యమేనా?

ఎంపీలందరూ ఇలాగే ఉన్నారని కాదుగానీ మెజారిటీ ఎంపీలది ఇదే తీరు ఓపక్క ప్రధాని రాజభోగాలు తగ్గించుకోవాలని, ఎంపీలు సింప్లిసిటీని ఫాలో అవ్వాలని చెబుతుంటే మన ఎంపీలు మాత్రం ఇంకా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇంత హోదా, ఇన్ని అధికారాలు అంత జీతం పొందుతున్న ఎంపీలే ఇంకా డిమాండ్ చేస్తే.. ఏ అధికారం, హోదా లేక సమస్యలతో సతమతమయ్యే సామాన్యుడు ఎంత జీతం పెంచమని అడగాలి ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ధరల పోటు.. పన్నుపోటు ఎదుర్కొంటూన్న మధ్యతరగతి జీవి జీతం పెంచమనడంలో అర్ధం ఉంది కానీ.. ఎంపీలకు జీతాలు పెంచమని అడగటం న్యాయమేనా? మధ్యతరగతి జీవులు, వేతన జీవులకు చేస్తున్న పని, ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిర్ణయిస్తున్నప్పుడు.. ప్రజల ఓట్లతో గెలిచి అధికారం దక్కించుకునే ఎంపీలకు ఇదే నిబంధన వర్తింప చేస్తే తప్పేముంది?పని చేసిన ఎంపీలకే జీతం పెంచితే.. మన వ్యవస్థ కూడా బాగుపడుతుంది.. దీనికి ఎంపీలు ఒప్పుకుంటారా? పనిని బట్టి వేతనం.. ప్రతిభను బట్టి ప్రమోషన్.. ఉద్యోగులకు వర్తింప చేసే ఈ సూత్రాన్ని మన ఎంపీలకు వర్తింప చేయడంలో తప్పేముంది?ఎంపీలు కూడా జీతం తీసుకుంటున్న ఉద్యోగులే కదా.

Next Story