మంత్రిగారి ముచ్చట్లు..రాహుల్ ను మించిన దద్దమ్మ ఎవరున్నారు

మంత్రిగారి ముచ్చట్లు..రాహుల్ ను మించిన దద్దమ్మ ఎవరున్నారు
x
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్.. జాతీయ పార్టీల విధానాలపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయన్న కేటీఆర్.....

తెలంగాణ మంత్రి కేటీఆర్.. జాతీయ పార్టీల విధానాలపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయన్న కేటీఆర్.. మోడీ ఒకరు చెబితే వినే వ్యక్తి కాదంటూ నిష్టూరమాడారు. మిత్రపక్షం ఆందోళననే పట్టించుకోని బీజేపీ నేతలు తాము ఆందోళన చేస్తే పట్టించుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీల్లేవని పెద్ద ప్రాంతీయ పార్టీలు, చిన్న ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు కేటీఆర్.

ఇటీవలి కేంద్ర బడ్జెట్ దరిమిలా.. ఏపీలో మిత్రపక్షం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కమలనాథుల మీద తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి కూడా అలాంటి రియాక్షనే వ్యక్తమవుతోంది. ప్రాంతీయ సెంటిమెంట్లను, ప్రాంతాల అభివృద్ధిని ఆ ప్రాంతంలోని పార్టీలు తప్ప.. జాతీయ పార్టీలకు అర్థం కావంటూ కేటీఆర్... చిట్ చాట్ లో అభిప్రాయాలు వెల్లడించారు. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నాయకులను పట్టించుకునే వాళ్లే లేరని.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్నవాళ్లు టీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారన్నారు. బడ్జెట్ లో అన్యాయం చేసిన బీజేపీకి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. మోడీకి ఎవరేం చెప్పినా వినరని, ఆయన్ని అభిమానించడం అనేది వన్ సైడ్ లవ్ లాంటిదని కేటీఆర్ అభివర్ణించారు. ప్రజల సాధక బాధకాలు ప్రాంతీయ పార్టీలకే తెలుస్తాయని,
మిత్రపక్ష పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించలేకపోయిందని.. తెలంగాణ నుంచి 40 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే వెయ్యి కోట్లు కూడా కేంద్రం ఇవ్వలేకపోయిందంటూ.. బాహుబలి కలెక్షన్ కూడా రాలేదన్నారు కేటీఆర్. కాళేశ్వరం సహా ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా ఇవ్వలేకపోయారని కేటీఆర్ విమర్శించారు.

టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదా కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సవాల్ కు కట్టుబడి ఉన్నానని.. ఉత్తమ్ దాన్ని స్వీకరించినట్టయితే ముందుకు రావాలని కేటీఆర్ తన సవాల్ ను రిపీట్ చేశారు. తన సవాల్ ను స్వీకరించే దమ్ము ఉత్తమ్ కు ఉన్నా లేకున్నా.. 2019 ఎన్నికల తరువాత తాను మాట తప్పితే నిలదీయవచ్చన్నారు. జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల నాటి సవాల్ ను గుర్తు చేసుకోవాలన్నారు.

నల్గొండలో ఫ్లోరోసిస్ పాపానికి కాంగ్రెస్సే కారణమని.. 1956కు ముందు ఫ్లోరోసిస్ లేదని.. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే నల్గొండ వాసులకు ఆ దుర్గతి పట్టిందన్నారు. ఉద్యోగాలు కల్పించలేదంటూ కేసిఆర్ ను కాంగ్రెస్ నేతలు దద్దమ్మ అంటున్నారని.. అసలు రాహుల్ ను మించిన దద్దమ్మ దేశంలో ఎవరున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. సీఎం పదవి కోసం నరమేధాలు సృష్టించింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు. తన దావోస్ పర్యటనకు ఆహ్వానమే లేదని నోరు పారేసుకున్న ఉత్తమ్ కు కనీసం సారీ కూడా చెప్పాలన్న విజ్ఞత లేదన్నారు.

ఇక ఎమ్మార్పీఎస్ విభజనపై ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చి రద్దు చేశారన్న కేటీఆర్ నియోజకవర్గాల విభజన చేసినా, చేయకపోయినా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం చెప్పినట్లు పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ కన్నా ముందే జరుగుతాయని కేటీఆర్ అంచనా వేశారు. దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీల్లేవని.. పెద్ద ప్రాంతీయ పార్టీలు.. చిన్న ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో కోదండరాం సహా ఎవరైనా పార్టీ పెట్టొచ్చని 2019 ఎన్నికల తర్వాత జనం ఎవరిని ఆదరిస్తారో చూద్దామన్నారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories