గాలిపటానికి ఉన్న ఆ మాంజా బలమేంటి!!

గాలిపటానికి ఉన్న ఆ మాంజా బలమేంటి!!
x
Highlights

ఆ గాలిపటం మొన్నటి వరకు, పాతబస్తీలోనే ఎగిరింది. మహారాష్ట్రలోనూ చక్కర్లుకొట్టింది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అక్కడక్కడా బలమైన ఓటు బ్యాంకు...

ఆ గాలిపటం మొన్నటి వరకు, పాతబస్తీలోనే ఎగిరింది. మహారాష్ట్రలోనూ చక్కర్లుకొట్టింది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అక్కడక్కడా బలమైన ఓటు బ్యాంకు మాంజాతో, ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఈ ఎన్నికల్లో మాత్రం, పాతబస్తీ అవతల కూడా ఎగిరేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అన్నీ కుదిరితే, కింగ్‌ మేకర్‌లా అవతరించి, సత్తా చాటాలనుకుంటోంది....ఇంతకీ గాలిపటం కాన్ఫిడెన్స్ ఏంటి...ఊహకందని దాని వ్యూహాలేంటి? ఇప్పుడు తన కంచుకోటకు బయట కూడా విస్తరించాలని కంకణం కట్టుకుంది ఎంఐఎం. తెలంగాణ ఎన్నికలే అందుకు వేదికగా మలచుకోవాలనుకుంటోంది.

ఓల్డ్‌ సిటీలో బలంగా ఉన్న ఎంఐఎం, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించింది. మహారాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు కొల్లగొట్టి, సంచలనం సృష్టించింది. యూపీ, కర్ణాటకతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉనికి చాటుకుంది. హైదరాబాద్‌లో ఒక మూలకు పరిమితమైన పార్టీ, మహారాష్ట్రతో పాటు, మరిన్ని రాష్ట్రాల్లో సత్తా చాటడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇదే రాష్ట్రంలో మరిన్ని సీట్లు కొల్లగొట్టేందుకు, అనేక స్ట్రాటజీలు ఆలోచిస్తున్నారు పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ.

2014 ఎన్నికల్లో, గ్రేటర్‌లో ఏడు స్థానాల్లో విజయఢంకా మోగించింది ఎంఐఎం. మిగతా ప్రాంతాల్లో, అనేక చోట్ల రెండోస్థానంలో నిలిచి, ప్రధాన పార్టీల అభ్యర్థులను కంగారుపెట్టించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, గ్రేటర్‌లోనే తనకు బలమున్న మరిన్ని స్థానాలపై గురిపెట్టింది ఎంఐఎం. అందులో అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, ఉప్పల్‌, మహేశ్వరం, నిజామాబాద్‌ అర్బన్‌లను ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుంది. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని చాలా సందర్భాల్లో అన్నారు. అయితే, దానర్థం, ఇరు పార్టీల అభ్యర్థులు నేరుగా తలపడరని కాదని అంటోంది ఎంఐఎం. అందుకే టీఆర్ఎస్‌తో సంబంధం లేకుండా, తనకు ప్రాబల్యమున్న స్థానాలపై గురిపెడతానంటోంది.

హైదరాబాద్‌ పాతబస్తీలో ముస్లిం ఓటు బ్యాంకు పదిలంగా కాపాడుకుంటోంది ఎంఐఎం. అలాగని, అందరూ ముస్లిం అభ్యర్థులనే నిలబెట్టడం లేదు. ఎంఐఎం తరపున పోటీ చేసేవారిలో హిందూ, క్రిస్టియన్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేస్తానంటోంది ఒవైసీల పార్టీ. అయితే ఓల్డ్‌ సిటీ పార్టీ అన్న ముద్ర చెరిపేందుకు, మరిన్ని స్థానాల్లో విస్తరించేందుకు పట్టుదలగా ఉంది. 2014 తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 20 స్థానాల్లో పోటీ చేసింది ఎంఐఎం. ఏడు స్థానాల్లో విజయం సాధించింది.

మొత్తానికి దేశమంతా విస్తరించాలనుకుంటున్న ఎంఐఎం, ముందు తెలంగాణలో పాతబస్తే కాకుండా, ఇతర స్థానాల్లోనూ విజయబావుటా ఎగరేయాలని భావిస్తోంది. త్వరలో రెండో జాబితా ప్రకటిస్తామంటోంది. అభ్యర్థుల జాబితాపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నామని చెబుతున్న ఎంఐఎం, త్వరలో కీలకమైన స్థానాల్లో బలమైనవారిని రంగంలోకి దింపుతామంటున్నారు. గత ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాల్లో, ఈసారి విజయం తమదేనంటోంది. అంతేకాదు, ఇంతకుముందు అక్బరుద్దీన్‌ అన్నట్టుగా, కర్ణాటక సంకీర్ణ సమరంలో, కింగ్‌ మేకర్‌గా అవతరించి కుమారస్వామి సీఎం అయినప్పుడు, తాము కూడా కింగ్‌ మేకర్‌ కాలేమా అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories