బాబాలకు మంత్రుల హోదా

బాబాలకు మంత్రుల హోదా
x
Highlights

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు నర్మదా బాబాలకు కాబినెట్‌...

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు నర్మదా బాబాలకు కాబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ సర్కార్ తీర్మానం చేసింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

నర్మదా నదీ పరిరక్షణ కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో హిందూ బాబాలతో ఓ కమిటీని నియమించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. అయితే, ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలోని ఐదుగురు బాబాలకు సహాయమంత్రి హోదాలను కట్టబెట్టింది. నర్మదానంద్‌ మహారాజ్‌, హరిహరానంద్‌ మహారాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహారాజ్‌, పండిత్‌ యోగీంద్ర మహంత్‌లకు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంత్రుల హోదాను ఇచ్చారు. నర్మదా నదీ పరిరక్షణ కుంభకోణంపై ఉద్యమించేందుకు బాబాలు సిద్ధమవుతున్న తరుణంలో ఐదుగురు బాబాలకు సహాయ మంత్రుల హోదాలను కట్టబెట్టడం ఎన్నికల గిమ్మిక్కు అని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

నర్మదా నది సంరక్షణకు ఏర్పాటైన జన్‌జాగృక్త అభియాన్‌ సమితిలో మార్చి 31న వీరంతా నియమితులయ్యారు. సమితి సభ్యులుగా వారంతా తమ పనులను మరింత సులువుగా చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి, సంక్షేమం పరంగా సంఘటితం చేయడంలో భాగంగానే.. బాబాలకు మంత్రుల హోదా ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని సీఎం చౌహాన్‌ అన్నారు.

నదీ పరిరక్షణ కుంభకోణంపై రథయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళతామన్న కంప్యూటర్‌ బాబా, యోగీంద్ర మహంత్‌లు తాజాగా తమ ప్రచార కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నట్టు ప్రకటించారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ బుజ్జగింపులు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శిస్తూంటే నదీ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులుగా తాము జిల్లా కలెక్టర్లతో మాట్లాడేందుకు మంత్రుల హోదా తప్పనిసరి అని సమర్థించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories