Top
logo

ప్రేమికులు దొంగ‌లుగా మారారు

ప్రేమికులు దొంగ‌లుగా మారారు
X
Highlights

హైదరాబాద్‌ పంజాగుట్టలోని లలిత జ్యువెలర్స్‌ సంస్థలో జరిగిన చోరీని పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. చోరీ కేసులో...

హైదరాబాద్‌ పంజాగుట్టలోని లలిత జ్యువెలర్స్‌ సంస్థలో జరిగిన చోరీని పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. చోరీ కేసులో ఇద్దరు ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాప్‌లో దోచుకున్న బంగారు ఆభరణాలను ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి అనే ప్రేమికులు బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్‌ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్‌ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో సులువుగా డబ్బు సంపాదించాలని ప్రేమజంట ప్లాన్ వేసింది. వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలిత జ్యువెలర్స్‌పై పడింది. గత సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో వీరిద్దరూ జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్‌ దృష్టిని మళ్ళించారు. అదును చూసుకుని అక్కడి కౌంటర్‌లో ఉన్న రెండు జతల బంగారు గాజులు, ఓ బ్రాస్‌లెట్‌‌ను ఎత్తుకెళ్లారు. దుకాణం మూసే సమయంలో స్టాక్‌ సరిచూడగా తేడా కనిపించింది. దీంతో మరుసటి రోజు పూర్తిస్థాయి ఆడిటింగ్‌ నిర్వహించిన యాజమాన్యం 66 గ్రాముల బరువుతో ఉన్న ఐదు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని గుర్తించి ప్రేమికులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారించడంతో చోరీ సొత్తును నందిగామలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 1లక్షా 20వేలకు తాకట్టు పెట్టినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.


Next Story