కక్ష సాధింపా? వ్యూహంలో భాగమా? అరెస్టుల వెనుక అసలు కథ!!

కక్ష సాధింపా? వ్యూహంలో భాగమా? అరెస్టుల వెనుక అసలు కథ!!
x
Highlights

ఎన్నికల వేళ, కేసులు-అరెస్టులతో అలజడి రేగుతోంది. నకిలీ పాస్‌ పోర్ట్ కేసుల్లో, జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, హౌసింగ్‌ సొసైటీ కేసులో...

ఎన్నికల వేళ, కేసులు-అరెస్టులతో అలజడి రేగుతోంది. నకిలీ పాస్‌ పోర్ట్ కేసుల్లో, జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసుల నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే, పాత కేసులు తిరగతోడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీఆర్ఎస్‌ నేతలంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు తీసుకుని.. అమెరికాకు మనుషులను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, తెలంగాణలో కలకలం రేపింది. జగ్గారెడ్డిని అరెస్టు చేయడం, ఇటు కాంగ్రెస్‌ సంగారెడ్డి బంద్‌కు పిలుపునివ్వడంతో అలజరేడి రేగింది.

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో.. తన భార్య, కుమార్తె, కుమారుని పేర్లతో.. గుజరాత్ కు చెందిన ఓ కుటుంబానికి పాస్ పోర్టులు పొందారని..వాటి ఆధారంగా వీసాలు పొంది ఇద్దరు మహిళలు, ఓ యువకుడిని అమెరికాకు తన వెంట అక్రమంగా తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పటాన్ చెరువు సమీపంలో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..కోర్టు తీర్పుతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

జగ్గారెడ్డి అరెస్టుపై కలకలం రేగుతుండగానే, హౌసింగ్‌ సొసైటీ కేసుకు సంబంధించి రేవంత్‌ రెడ్డికి, జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేయడం సంచలనమైంది. తనను అరెస్ట్ చేస్తే.. ఏం జరుగుతుందో కేసీఆర్‌కు తెలుస్తుందని, రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై శాయంపేటలో కేసు నమోదైంది. గండ్ర తనను తుపాకీతో బెదిరించారంటూ ఓ వ్యక్తి శాయంపేట పోలీసులను ఆశ్రయించారు. క్రషర్ మిషన్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో వెంకట రమణారెడ్డి, అతని సోదరుడు భూపాల్ రెడ్డి తనను బెదిరిస్తున్నారని ఎర్రబెల్లి రవీందర్ రావు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో గండ్రపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, రాజకీయ కక్ష సాధింపులతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు గండ్ర. కేసుల వ్యవహారంతో తమ పార్టీకి సంబంధంలేదని టీఆర్ఎస్‌ నేతలంటున్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. జగ్గారెడ్డి వంటి దేశ ద్రోహులను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దారుణమన్నారు టీఆర్ఎస్‌ నేతలు. మొత్తానికి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేసులు, అరెస్టులు కలకలం రేపుతున్నాయి. అధికార, విపక్షాల పరస్పర ఆరోపణలు కాకరేపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories