logo
జాతీయం

పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా
X
Highlights

అనుకున్నదే అయ్యింది. అవిశ్వాసంపై చర్చ లేకుండానే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. 12 సార్లు అవిశ్వాసం...

అనుకున్నదే అయ్యింది. అవిశ్వాసంపై చర్చ లేకుండానే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. 12 సార్లు అవిశ్వాసం నోటీసులిచ్చినా అవేవీ చర్చకు రాలేదు. ఇక చివరిరోజు మాత్రం అవిశ్వాసం అనే మాట లేకుండానే ముగించారు. ఇటు రాజ్యసభ కూడా అదే దారిలో వెళ్లింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మగిశాయి. రెండు విడతలుగా సాగిన ఈ సమావేశాలు.. శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఎప్పట్లాగే అన్నాడీఎంకే ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గంధరగోళం నెలకొంది. చివరిరోజు కాబట్టి సభ్యులు సంయమనం పాటించాలని.. సభను నిరవధిక వాయిదా వేసే ముందు ప్రకటన చేస్తున్నట్లు వివరించడంతో.. అన్నాడీఎంకే సభ్యులు శాంతించారు.

తర్వాత స్పీకర్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరును ఆమె చదివి వినిపించారు. 2018 బడ్జెట్ తో పాటు.. సభ సాగిన సమయం, ఆమోదం పొందిన బిల్లుల వివరాలను చదివి వినిపించారు. సభలో ఆందోళనల నేపథ్యంలో.. ముఖ్యమైన బిల్లులను కూడా ఆమోదించలేకపోయినట్లు.. ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పై 12 గంటల పాటు చర్చ జరిగిందని వివరించారు. ఆ తర్వాత వెంటనే వందేమాతరం గీతాలాపన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు.. స్పీకర్ ప్రకటించి.. నిష్క్రమించారు.

అయితే సభ ముగిసిన తర్వాత టీడీపీ ఎంపీలు.. అక్కడే ఉన్న ప్రధాని మోడీని చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విభజన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ నిరసన తెలిపారు. మరోవైపు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఈ జులైలో పదవీకాలం ముగియనున్న డిప్యూటీ ఛైర్మెన్ కురియన్ కు సభ అభినందనలు తెలియజేసింది. కీలక సమయాల్లో సభను విజయవంతంగా నడిపించారని.. పలు కీలక బిల్లుల ఆమోదంలో ఆయన పాత్ర మరవలేనిదని.. ఛైర్మెన్ వెంకయ్యనాయుడు కురియన్‌ను కొనియాడారు. తర్వాత సభ జరిగిన తీరును వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా చదవి వినిపించారు. ఆ తర్వాత వందేమాతర గీతాలాపన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Next Story