టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు
x
Highlights

అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభజన హామీల సాధన డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించారు....

అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభజన హామీల సాధన డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించారు. విభజన హామీల విషయంలో కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఆపకూడదని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమని ఎంపీలు ప్రకటించారు. ఇందుకోసం ఇతర పార్టీల మద్దతు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కోర్టుకు సైతం వెళతామన్నారు.

సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల నేపధ్యంలో చంద్రబాబు అమరావతిలోని తన నివాసంలో టీడీపీ ఎంపీలు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన హామీల సాధన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూ‍హం గురించి చర్చించారు. చంద్రబాబు ఒక్కో ఎంపీ నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఏపీ ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి జరగుతున్న అన్యాయంపై దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయించారు. విభజన చట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, హోదా-ప్యాకేజీ మతలబు గురించి లేఖలో వివరిస్తారు.

నాలుగేళ్లయినా విభజన గాయాలు మానలేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేస్తే..దానిని సరి చేయాల్సిన బీజేపీ కూడా అన్యాయంగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని ఎప్పుడూ చెప్పలేదన్న ముఖ్యమంత్రి హోదాకు సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందు వల్లే ప్యాకేజీకి అంగీకరించామని అన్నారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని గతంలో చెప్పిన కేంద్రం ఇప్పుడు దానిని కొనసాగించాలని అనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదే పేరుతో ఇవ్వాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఆర్ధిక లోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామని కేంద్రం చెప్పడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం ఫార్ములా ఇచ్చారు అసలు వాళ్లిచ్చిన ఫార్ములా ఏమిటని ప్రశ్నించారు. అయినా ఏపీకి న్యాయంగా రావాల్సినది ఇవ్వకుండా మీరే చెప్పండని రాష్ట్రాన్ని అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌పైనా చంద్రబాబు మండిపడ్డారు. అటు వైసీపీకి విశ్వసనీయత లేదన్న చంద్రబాబు జగన్ పార్టీ నాటకాలాడుతోందని విమర్శించారు. వైసీపీ కేవలం ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకుని విభజన సమయంలో ఇచ్చిన 18 అంశాలను వదిలేస్తోందని చంద్రబాబు తప్పు పట్టారు. కేవలం హోదా ఇచ్చి, ఇంకేమీ ఇవ్వకపోతే రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories