ఉద్యమ యోధులు ప్రత్యర్థులయ్యారు.. ఎన్నికల్లోఢీకొట్టే అస్త్రాలేంటి?

ఉద్యమ యోధులు ప్రత్యర్థులయ్యారు.. ఎన్నికల్లోఢీకొట్టే అస్త్రాలేంటి?
x
Highlights

తెలంగాణలో ప్రధాన విపక్ష కూటమి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణవాదాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చింది. అటు అధికార పక్షం, ఇటు కూటమి కూడా దాన్ని...

తెలంగాణలో ప్రధాన విపక్ష కూటమి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణవాదాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చింది. అటు అధికార పక్షం, ఇటు కూటమి కూడా దాన్ని తమ ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమంలో కలసి పని చేసిన ఇద్దరు యోధులు నేడు ప్రత్యర్థులుగా మారారు. తెలంగాణ పొత్తు రాజకీయం అమరావతిని తాకి ఢిల్లీ కి మారి తిరిగి హైదరాబాద్ చేరింది. ప్రజాకూటమి లో సీట్ల సర్దుబాటుపై ఇప్పుడిప్పుడే కాస్తంత స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ నాయకుల మాటలను బట్టి 90 నుంచి 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ....టీజేఎస్... సీపీఐ..... మూడు మిత్ర పక్షాలు కలసి 25 నుంచి 30 స్థానాలను పంచుకోవాల్సి ఉంటుంది. కాస్త అటూ ఇటూగా టీడీపీ 15 స్థానాలు, టీజేఎస్ 8, సీపీఐ 5 స్థానాల్లో పోటీకి సిద్ధం కావచ్చు. ఎవరు ఎంత మేరకు త్యాగాలు చేస్తారనే దాన్ని బట్టి సీట్ల సంఖ్య నిర్ణయం కానుంది. కూటమి లోని అన్ని పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా, గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. మరో వారం దాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సీట్ల ఖరారులో జాప్యం కూడా వ్యూహాత్మకమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తులకు ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ గాలం వేసే పరిస్థితి ఉంది.

ఎన్నికల ప్రచారం గడువు ముగిసేందుకు కాస్త అటూ ఇటూగా ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయినా నేటికీ ప్రజా కూటమిలో అభ్యర్థులు ఖరారు కాలేదు. అభ్యర్థుల సంగతి అటుంచి.... ఏ పార్టీకి ఎన్ని స్థానాలో కూడా నిర్ణయం కాలేదు. అయినా కూడా కూటమి నాయకులంతా కలసికట్టుగానే ఉన్నారు. గంటల తరబడి, రోజుల తరబడి ఎడతెరపి లేని చర్చలు చేస్తూనే ఉన్నారు. ఈ చర్చలు అటు అమరావతిని తాకాయి. ఇటు ఢిల్లీనీ చేరాయి. అయినా ఇప్పటి వరకూ ఒక స్పష్టత రాలేదు. వచ్చిన స్పష్టత అంతా ఒకే ఒక్క విషయంలో....కేసీఆర్ ను ఎలాగైన గద్దె దింపడం. ఈ విషయంలో ప్రతి పార్టీకి దేని కారణాలు దానికి ఉన్నాయి. అందుకే అన్నీ ఒక్క చోటుకు చేరాయి. కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఏకతాటిపైకి రావడంలో ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం లేదు....ఆయా పార్టీలకు కూడా పెద్దగా ఇబ్బంది కూడా లేదు. తెలుగుదేశాన్ని కూడా కూటమిలో చేర్చుకోవడమే కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆయా పార్టీల్లోనే కొందరికి అది మింగుడుపడలేకపోయింది. అదే సమయంలో అది టీఆర్ఎస్ కు ప్రధాన ప్రచారాస్ర్తాన్ని కూడా అందించింది. నిజానికి మందస్తు ఎన్నికలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ జనసమితి కూడా పార్టీ నిర్మాణంలో అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఒక్కసారిగా ఎన్నికలు ముంచుకురావడంతో టీజేఎస్ కూడా ఎన్నో మెట్లు దిగి పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40 స్థానాలతో చర్చలు మొదలుబెట్టిన టీజేఎస్ చివరికు పది లోపు స్థానాలతో సర్దుకు పోవాల్సి వస్తోంది. కూటమి లోని ఇతర పార్టీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.

తెలుగుదేశంపై మాటలు ఎక్కుపెట్టి కూటమి మిత్ర పక్షాలను డిఫెన్స్ లో పడేద్దామన్నది టీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయలేం. వ్యూహరచనలో మేటి కేసీఆర్. అందుకే మొన్నటి ఎన్నికల్లో 61 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఆ తరువాత తన బలాన్ని మరింత పెంచుకుంది. పదిహేను స్థానాల్లో గెలిచిన తెలుగుదేశం ఆ తరువాత అసెంబ్లీలో అడ్రస్ లేకుండా పోయింది. పొరుగు రాష్ట్ర పార్టీగా ముద్ర పడిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి తెలంగాణలో తన ఉనికి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ద్రోహిగా ముద్రపడిన టీడీపీతో పొత్తు ఏంటని టీఆర్ఎస్ నిలదీస్తోంది. ప్రజా కూటమిని నడిపించేది చంద్రబాబు నాయుడు అంటూ విమర్శిస్తోంది. తెలంగాణ ద్రోహికి ఆత్మగౌరవం తాకట్టు పెడుతారా అంటూ ప్రశ్నిస్తోంది. కూటమి పై టీఆర్ఎస్ సంధిస్తున్న అస్ర్తాలను కొంతవరకు కోదండరామ్ ఇమేజ్ అడ్డుకునే అవకాశం ఉంది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు పేరుంది. అలాంటి వ్యక్తి సైతం టీడీపీతో పొత్తును ఆమోదించారంటే అందులో తెలంగాణకు పనికొచ్చే అంశం ఏదైనా ఉంటుందని విశ్వసించే వారు ఎంతో మంది ఉన్నారు. అందుకు తగ్గట్టే కూటమి ధోరణి కూడా ఉంది. జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటేనని కోదండరాం స్పష్టం చేశారు. కొన్ని విధానాలకు లోబడే రేపటి నాడు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రకటించారు.

ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలక్కి వచ్చినా.... ఆశించిన రీతిలో పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందా అన్నదే కీలక ప్రశ్నగా మారింది. గత ఎన్నికల నాటి గణాంకాలను బట్టి చూస్తే కాంగ్రెస్, టీడీపీ ఓట్లు కలిస్తే అది మంచి ఫలితాలనే అందించాలి. దానికితోడు నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత మేరకు వచ్చే వ్యతిరేకత కూడా విపక్షానికి తోడు కావాలి. మరి నిజంగా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా ? పార్టీల మధ్య పొత్తు అదే స్థాయిలో ఓట్లు రాలుస్తుందా...అంటే అది కత్తి మీద సాములాంటిదే. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎంతో ముందుగానే తన అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలవుతున్న తరుణంలో అభ్యర్థుల ప్రకటనలో జరిగే జాప్యం తమకు మేలు చేస్తుందనే కూటమి పక్షాలు భావిస్తున్నాయి. ఒక వారంలోగా సీట్ల సర్దుబాటును పూర్తి చేసి.... ఒక్కసారిగా ప్రచారాన్ని ఉధృతం చేయవచ్చునని అవి భావిస్తున్నాయి. బరిలోకి దిగుతారనుకున్న కొందరు ప్రముఖ నాయకులు ప్రచారానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా చేసే నాయకులకు మరో విధంగా మేలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది.

గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ హవా నడిచింది. కాంగ్రెస్, టీడీపీలు దక్షిణ తెలంగాణలో తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి. ఈ దఫా ఉత్తర తెలంగాణలో కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దానికి తోడు ఎంతో కొంత ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆ పార్టీకి పడే ఓట్లపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో నష్టపోయే సీట్లను దక్షిణ తెలంగాణలో దక్కించుకునేందుకు ఆ పార్టీ కృషి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత కలహాలు, అసంతృప్తి లాంటివాటిని ప్రజా కూటమి ఏ మేరకు కైవసం చేసుకుంటుందనే దానిపై కూటమి అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కూటమి అభ్యర్థుల ఎంపికలో కులసమీకరణాలు ఎలా ఉంటాయి, ఎంత మంంది మహిళా నాయకురాళ్ళకు టికెట్లు ఇస్తారన్నది కూడా మరో ఆసక్తిదాయక అంశం కానుంది. తెలంగాణ ప్రజానీకంలో కోదండరామ్ కు ఉద్యమనాయకుడిగా ఉన్న గౌరవాన్ని కూటమి ఏ మేరకు సొమ్ము చేసుకుంటుందో చూడాలి. కూటమిలోని పార్టీలన్నిటికీ వేటి అవసరాలు వాటికి ఉన్నాయి. పార్టీ నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయిన టీజేఎస్ .....కాంగ్రెస్ పై ఆధారపడక తప్పదు. తెలుగుదేశంతో జట్టు కట్టిన కాంగ్రెస్, దానిపై వచ్చే విమర్శలను తట్టుకునేందుకు టీజేఎస్ తో జట్టు కట్టకతప్పలేదు. ఇన్ని అంశాల మధ్య తెలంగాణ లో రాజకీయం రసవత్తరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories