Top
logo

అటు అసమ్మతులు... ఇటు బుజ్జగింపులు... గులాబీ దళపతి ఎలక్షన్‌ స్ట్రాటజీ!!

అటు అసమ్మతులు... ఇటు బుజ్జగింపులు... గులాబీ దళపతి ఎలక్షన్‌ స్ట్రాటజీ!!
X
Highlights

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది టిఆర్ఎస్. వరుస సభలతో ఎన్నికల గ్రౌండ్లో తాడోపేడో తేల్చుకోవాలని...

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది టిఆర్ఎస్. వరుస సభలతో ఎన్నికల గ్రౌండ్లో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోన్న గులాబీ బాస్, ప్రచార జైత్రయాత్రను మళ్లీ పట్టాలెక్కించబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో భారీగా జనాన్ని సమీకరించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తేవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి వరుస బహిరంగ సభలతో హోరెత్తించబోతున్నారు గలాబీ దళాధిపతి. ముందస్తు ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్ఎస్, 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరింది. అంతటితో ఆగకుండా నియోజకవర్గాల వారీగా గులాబీ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే, ప్రచారంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ముహూర్తంగా భావించి, హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత గణేష్ నవరాత్రులతో ఆశీర్వాద సభలను వాయిదా వేసినా, పార్టీలో అంతర్గత సర్దుబాట్లపై దృష్టి సాధించింది టీఆర్ఎస్ అధిష్టానం. ఇప్పుడు బతుకమ్మ, దసరా పండుగలోపు ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలను పూర్తి చేయాలని భావించింది. అందులో భాగంగా ఈనెల మూడో తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు దాదాపు మూడు లక్షల మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని జిల్లా పార్టీ నేతలను ఆదేశించారు గులాబీ బాస్.

నిజామాబాద్‌తో మొదలుపెట్టి ఈ భారీ బహిరంగ సభలను నల్గొండ, మహబూబ్‌ నగర్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులకు. నేతలకు సభా బాధ్యతలు అప్పగించారు. ఆ దిశగా ఆయా జిల్లాల్లో సభా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ముగిసిన తర్వాత, దసరా పండగ సందర్భంగా బహిరంగ సభలకు కాస్త విరామం ఇవ్వనున్నారు. ఈలోపు బతుకమ్మ పండుగ సందర్భంగా పార్టీ శ్రేణులు, మహిళా విభాగం ప్రజల్లోకి వెళ్లి చురుకుగా పని చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వేడిని పెంచనున్నారు. టిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా కెసిఆర్, ప్రచారంతో పార్టీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నాయి గులాబీ శ్రేణులు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా నాలుగేళ్లుగా, టిఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు మహాకూటమి టార్గెట్‌గా ప్రసంగించబోతున్నారు. ప్రతిపక్షాలపై పంచ్ డైలాగులతో విరుచుకుపడాలని పార్టీ నేతలకు సూచిస్తున్న కేసీఆర్, తాను అదేశైలిలో ఈసారి మరింతగా ప్రసంగించాలని భావిస్తున్నారు.

Next Story