logo
జాతీయం

కన్నడ కొరివితో బీజేపీ తలగోక్కుటుందా? రిసార్ట్‌ రాజకీయాలు ఏం చెబుతున్నాయ్‌

కన్నడ కొరివితో బీజేపీ తలగోక్కుటుందా? రిసార్ట్‌ రాజకీయాలు ఏం చెబుతున్నాయ్‌
X
Highlights

కర్ణాటక రాజకీయాలు క్షణానికో రకంగా మలుపు తిరుగుతున్నాయి. బలం లేని బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు రంగంలోకి దిగడంతో...


కర్ణాటక రాజకీయాలు క్షణానికో రకంగా మలుపు తిరుగుతున్నాయి. బలం లేని బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. హంగ్ ఏర్పడిన నేపధ్యంలో గవర్నర్ వాజూభాయ్ వాలా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి యడ్యూరప్పకే సిఎంగా అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్,జేడిఎస్ కూటమి రగిలిపోయింది. నాటకీయపరిణామాల మధ్య యడ్యూరప్ప ఒక్కరే ఇవాళ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ జేడిఎస్ కూటమి అసెంబ్లీ లోని గాంధీ విగ్రహ ముందు నిరసన ప్రదర్శన జరిపింది. ఈగల్ రిసార్టు నుంచి తీసుకొచ్చిన తన ఎమ్మెల్యేలను ఈ ప్రదర్శనలో పాల్గొనేలా చేసింది. నిరసనల అనంతం ఎమ్మెల్యేలంతా మళ్లీ తమ రిసార్టుకు వెళ్లిపోయారు. మరోవైపు కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు యడ్యూరప్పను తన మద్దతు నిరూపించుకునే జాబితాను ఇమ్మని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో ఓ సీల్డ్ కవర్ ను యడ్యూరప్ప కోర్టుకు సమర్పించారు. కానీ అందులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నదీ వివరాలు బయటకు వెల్లడి కాలేదు.ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించారా లేక వారి సంతకాలతో ఇచ్చారా అన్న విషయంపైనా క్లారిటీ లేదు.

గవర్నర్ యడ్యూరప్పకు బలనిరూపణకు15 రోజులు గడువివ్వడం అన్యాయమంటోంది కాంగ్రెస్, జేడిఎస్ కూటమి. బిజెపి కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందనీ, దక్షిణాదిన ఎలాగైనా కాలు మోపాలన్న పట్టుదలతో నీచ రాజకీయాలకు పాల్పడుతోందనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాలనీ, మద్దతు ప్రకటించాలని దేవేగౌడ తెలుగు రాష్ట్రాల సిఎంలను కోరారు.. అలాగే బెంగాల్ సిఎం మమతాబెనర్జీని, నవీన్ పట్నాయక్ ను కూడా దేవేగౌడ అభ్యర్ధించారు.

దేవేగౌడ చేసిన విన్నపంపై స్పందించాలా వద్దా అన్న సంశయంలో పడింది టిడిపి.. ఇదిలా ఉంటే కర్ణాటక రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.ఇప్పటికే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని రాం జెఠ్మలానీ కోరారు. బలనిరూపణకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేలను సాధించే పనిలో పడిన బిజెపి వారికోసం కోట్లు ఎర చూపుతున్నట్లు సమాచారం.. దారికి రానివారిపై ఈడి కేసులు, పెండింగ్ లో ఉన్న పాతకేసులు తిరగతోడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సామదానబేధ దండోపాయాలతో మేజిక్ ఫిగర్ ను చేరుకోడానికి బిజెపి కసరత్తు చేస్తుంటే కాంగ్రెస్,జేడిఎస్ లది మరీ దారుణమైన పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలను చేజారకుండా గంప కింది కోడి పిల్లల్లా దాచుకోవాల్సిన పరిస్థితి.. ఇప్పటికే కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను ఈగల్ రిసార్ట్ లో దాచగా, జేడిఎస్ తమ వారిని కొచ్చిన్ తరలిస్తున్నట్లు సమాచారం.. రిసార్టు రాజకీయాలతో కాంగ్రెస్, జేడిఎస్ తమ వారిని కాపాడుకోడానికి పడరాని పాట్లు పడుతుంటే.. ధీమాతో కనిపిస్తున్న బిజెపి ఎవరెవరికి వలలు విసరుతోంది? ఇప్పటికే అవసరమైన 8 మంది మద్దతు కూడగట్టుకుందా అన్నది స్పష్టం కావడం లేదు..

మరోవైపు అన్యాయంపై రగిలిపోతున్న కాంగ్రెస్ గోవా, మణిపూర్ రాష్ట్రాల కేసులను తిరగదోడుతోంది. కర్ణాటక సూత్రాన్ని అక్కడ అసెంబ్లీలకి వర్తింప చేసి తమ ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. గోవా గవర్నర్ అపాయింట్ మెంట్ ను కూడా కాంగ్రెస్ కోరింది. ఇక రెండు సార్లు అతి తక్కువ సమయం సిఎంగా కొనసాగిన యడ్యూరప్ప ఈసారి పూర్తి కాలం అధికారంలో కొనసాగుతారా? లేక కాంగ్రెస్, జేడిఎస్ పోరాటం ఫలిస్తుందా.. వేచి చూడాలి.. ఏం జరుగుతుందో?

Next Story