బై ఎలక్షన్స్‌... పార్టీలకు ఇంజెక్షనా? కనెక్షనా?

బై ఎలక్షన్స్‌... పార్టీలకు ఇంజెక్షనా? కనెక్షనా?
x
Highlights

తాజా ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ నే ఇచ్చాయి. స్థానిక పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నప్పటికీ,...

తాజా ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ నే ఇచ్చాయి. స్థానిక పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నప్పటికీ, లోక్ సభ ఉప ఎన్నికల విషయంలో మాత్రం వారు తమను తాము సమర్థించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో కైరానా ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. అక్కడ ఓటమి చవిచూడడం బీజేపీకి మింగుడుపడడం లేదు. దక్షిణాదిపై కన్నేసిన బీజేపీకి ఉత్తరాదినే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి ఈ పరిస్థితులను బీజేపీ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే. అలాంటి ఫలితాలు 2014 నుంచి మరెన్నో ఉన్నాయి.

లోక్ సభ ఉప ఎన్నికలు నాలుగు స్థానాలకు జరిగాయి. అందులో కైరానా ఒకటి. ఇక్కడ తమ అభ్యర్థి ఓడిపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకు కారణం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఓడిపోవడమే. పైగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించారు. అంతే కాదు... ఆ ప్రాంతంలో మూడో వంతు కూడా పూర్తి కాని జాతీయ రహదారిని ప్రారంభించారు. పోలింగ్ కు ఒక్క రోజు ముందు దాన్ని ప్రారంభించడం గమనార్హం. అయినా కూడా అక్కడ కమలం వికసించలేకపోయింది. అందుకు ప్రధాన కారణం విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడమే. అయితే బీజేపీకి ఇంతకు మించిన పరాభవం గతంలోనే జరిగింది. గోరఖ్ పూర్, ఫుల్ పూర్ లకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. గతంలో ఆ రెండు స్థానాల నుంచి యోగి ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య గెలిచారు. వారిద్దరూ సీఎం, డిప్యూటీ సీఎంలు కావడంలో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా కైరానా ఓటమి కూడా పార్టీకి జీర్ణించుకోలేనిదిగా మారింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఇక్కడ ఒక జాతీయ పార్టీ, రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. తాజాగా కైరానాలో కూడా అదే పరిస్థితి రిపీట్ అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. భారత రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ 80 లోక్ సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 73 స్థానాల్లో గెలవడం విశేషం. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటేనే అధికారంలోకి రాగలదు. దక్షిణాదిపై కన్నేసిన బీజేపీకి ఉత్తరాదినే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

తాజా ఉప ఎన్నికలను రాబోయే ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్నారు. కర్నాటక ఫలితం నుంచే కోలుకోలేకుండా ఉన్న బీజేపీకి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో ఒక్కదాన్నే గెలుచుకోవడం బీజేపీకి మింగుడుపడడం లేదు. యూపీ లోని కైరానాతో పాటుగా మహారాష్ట్ర లోని భండారా గోండియా, పాల్ గఢ్ లకు గాను పాల్ గఢ్ లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. కైరానాలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. అప్పట్లో గోరఖ్ పూర్, ఫూల్ పూర్ లలో అనుసరించిన వ్యూహాన్నే విపక్షాలు ఇప్పుడు కూడా అనుసరించాయి. ఇక మహారాష్ట్రలో పాల్ గఢ్ లో శివసేనపై గెలవడం ఒక్కటే బీజేపీకి కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పట్ల ప్రజలకు గల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మొత్తం మీద చూస్తే మోడీ తరంగం ముక్కలవుతున్నట్లుగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి మహా తరంగం కావాలంటే అందుకు తగ్గ చర్యలను తీసుకోవాల్సిందే. మరి ఈ విషయంలో బీజేపీ ఏం చేస్తుందో ఎదురు చూడాల్సిందే. ఇక్కడ అన్నిటి కంటే పెద్ద ప్రశ్న....ఇదే విధమైన ఐక్యతారాగాన్ని వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ విపక్షాలు ఆలపిస్తాయా అన్నదే. ఈ విషయంలో మాత్రం ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories