కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే....ఒంటరి చేసే యత్నంలో కాంగ్రెస్‌ నేతలు

కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే....ఒంటరి చేసే యత్నంలో కాంగ్రెస్‌ నేతలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామాకు బాధ్యులు ఎవరు ? అధికార, ప్రతిపక్షాలు ఎవర్ని టార్గెట్ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై...

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామాకు బాధ్యులు ఎవరు ? అధికార, ప్రతిపక్షాలు ఎవర్ని టార్గెట్ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోందా ? స్పీకర్ చర్యలు తీసుకుంటే....పార్టీ వెంకటరెడ్డి వెంట నడుస్తుందా ? లేదంటే కోమటిరెడ్డిని ఒంటరి చేస్తుందా ? హైడ్రామా మరింత రక్తి కట్టనుందా ? తాజా పరిణామాలు చూస్తుంటే..అవుననే సమాధానం వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఆందోళనతో అట్టుడుకింది. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా నాటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చారు. నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనను తాజాగా కాంగ్రెస్ సభలో కాపీ కొట్టడంతో సభ అట్టుడికింది. అసెంబ్లీలో మొదటి సారి సభ ప్రారంభానికి ముందే భారీగా మార్షల్స్ సభలో చేరి కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకులు, హెడ్‌ఫోన్స్‌ విసరడం అది కాస్తా మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తగలడంతో గాయాలయ్యాయ్. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు.

మండలి ఛైర్మన్‌పై మైక్‌, హెడ్‌ఫోన్స్‌ విసరడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోమటిరెడ్డికి సహకరించారని భావిస్తున్న సంపత్‌కుమార్‌, రామ్మోహన్‌రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ స్పీకర్‌ను కోరనున్నట్లు సమాచారం. ఎవరైతే సభలో దురుసుగా ప్రవర్తించారో వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనుంది. అందుకు తగ్గ ఆధారాలను సమర్పించాలని నిర్ణయించింది.

అయితే తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్యేల పై సస్పెన్స్ వేటు వేస్తే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ముగ్గురు సభ్యులపై వేటు వేస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బస్సుయాత్రలో ముగ్గురు సభ్యులపై వేటు అస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రెడీ అవుతున్నారు. ప్రభుత్వం కేవలం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపైనే వేటు వేస్తే పార్టీ ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా సీనియర్లు విస్త్రతంగా చర్చిస్తున్నారు. కేవలం కోమటిరెడ్డిపైనే వేటు వేస్తే పార్టీ ఆయన వెంటన కలిసి వస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో కోమటి రెడ్డికి చాలా మంది నేతలు వ్యతిరేకంగా ఉండడంతో ఆయన కోసం సభను బహిష్కరించకుండా ఒంటరి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌లో ఐక్యత ఉందని ప్రజలకు చెప్పడానికి సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని సభలో నిరసనకు దిగనుంది. తప్పనిసరి భావిస్తే తప్పా సభను బహిష్కరించే ఛాన్స్‌ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories