లీడర్స్ వర్సెస్ ఐఏఎస్ లు

లీడర్స్ వర్సెస్ ఐఏఎస్ లు
x
Highlights

ప్రభుత్వాధికారులపై ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? రాజకీయ పార్టీల వ్యూహాల్లో పబ్లిక్ సర్వెంట్స్ కాస్తా పావులుగా...

ప్రభుత్వాధికారులపై ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? రాజకీయ పార్టీల వ్యూహాల్లో పబ్లిక్ సర్వెంట్స్ కాస్తా పావులుగా మారుతున్నారా? సమాజం మీద ఎన్నో అభిప్రాయాలతో, తనదైన ముద్ర వేయాలన్న ఆకాంక్షలతో పాలనారంగంలోకి అడుగుపెట్టిన ఐఏఎస్ అధికారులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వివిధ రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల మీద ఎలాంటి అభియోగాలు వినిపిస్తున్నాయి.. లీడర్స్ ఎలా స్పందిస్తున్నారు?

ఆంధ్రాలో ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాసింది. విజయసాయి ఇంత అభ్యంతరకరంగా మాట్లాడతారా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. ఇంతకీ ఏపీలో ఏం జరిగింది?

ఏపీలో ఐఏఎస్ అధికారుల మీద వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా ఉండాల్సిన అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారంటూ కొద్దిరోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవలే సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు యరపతినేని శ్రీనివాసరావు తదితర ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వానికి సంబంధం లేని రాజకీయ పనుల కోసం పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వాధికారులను లోబరుచుకుంటున్నారని తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి రావాలని ప్రలోభపెడుతున్నారని ఈ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు.

విజయసాయి రెడ్డి ఆరోపణలపై, విమర్శలపై ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీలతో ప్రమేయం లేకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను అనుమానించడం, అవమానించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరంలో విజయసాయి చేసిన కామెంట్లపై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రభుత్వానికి లేఖ రాయడం విశేషం.

ఐఏఎస్ ల మీద ఆగ్రహం ఆంధ్రాకే పరిమితం కాలేదు. తెలంగాణలో కూడా పరిస్థితి సేమ్ టు సేమ్. కాకపోతే చిన్న తేడా ఉంది. అదేంటంటే ఏపీలో ప్రతిపక్షం ఐఏఎస్ ల మీద విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణలో అధికార పక్షమే అసంతృప్తి వ్యక్తం చేయడం. మరి ఈ తేడా ఎందుకు?

ఐఏఎస్ అధికారుల మీద అభ్యంతరాలు కేవలం ఆంధ్రాకే పరిమితం కాలేదు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలే తలెత్తడం విశేషం. విచిత్రంగా తెలంగాణలో అయితే అధికార పక్షం నేతలు, ఐఏఎస్ అధికారుల మధ్యే నువ్వా-నేనా అన్న లెవెల్లో విమర్శలు నడిచాయి. ఆ విమర్శల తీవ్రత మొత్తం ప్రభుత్వ ప్రతిష్టనే సవాలు చేసింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బతుకమ్మ కుంటను కుదించివేశారని, అభివృద్ధి పేరుతో ప్లాట్లుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకున్నారని కలెక్టర్ దేవసేన బహిరంగ విమర్శలే చేశారు. బతుకమ్మ కుంట పాత విస్తీర్ణానికి, ఇప్పుడున్న విస్తీర్ణానికి మధ్య తేడాను గూగుల్ ఇమేజ్ ద్వారా దేవసేన ప్రూవ్ చేయడం విశేషం.

తెలంగాణలో ఐఏఎస్ వర్సెస్ లీడర్స్ వివాదం ఒక్క జనగామకే పరిమితం కాలేదు. అనేక జిల్లాల్లో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా కలెక్టర్లపై ధ్వజమెత్తడం విశేషం. ఎమ్మెల్యేలను అభివృద్ధి పనుల్లో భాగస్వాములను చేయకపోతే పురోగతి కుంటు పడుతుందని అది పార్టీకి కూడా నష్టం చేస్తుందని స్వయంగా కేసీఆర్ కు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం మొర పెట్టుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయినా కేసీఆర్ మాత్రం ప్రజాప్రతినిధుల కన్నా ప్రభుత్వాధికారులకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఇక తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు భిన్నంగా ఆంధ్రాలో విపక్ష వైసీపీ నేతలు ఐఏఎస్ లపై విరుచుకుపడుతుండడం ఆసక్తి రేపుతోందని పరిశీలకులు అభిప్రాయపుడుతున్నారు.

ఓసారి ఉత్తరాదికి వెళ్లొద్దాం. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీదనే భౌతిక దాడి జరిగింది. దీంతో పబ్లిక్ సర్వెంట్స్ మీద ఇంత అసహనం ఎందుకు పెరుగుతోందన్నది చర్చనీయాంశంగా మారింది. మరి దాడి చేసిన ఎమ్మెల్యేను ఏం చేశారు? అరెస్టు చేశారా? చేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయా? ఎవరి ప్రత్యేక హక్కులు వారికున్నప్పుడు చొరవ తీసుకోవాల్సింది ఎవరు?

దేశ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీలో ఐఏఎస్ అధికారి మీద భౌతిక దాడే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ మీద క్రిమినల్ కేసు కూడా బుక్కయ్యిందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ ను కలిసి పలు అంశాలను చర్చించేందుకు ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ జర్వాల్, అమానతుల్లాఖాన్ వెళ్లారు. చీఫ్ సెక్రటరీతో చర్చిస్తున్న సందర్భంలోనే మాటామాటా పెరిగి అమానతుల్లాఖాన్ చేయి చేసుకున్నాడని వార్తలు వెల్లువెత్తాయి. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనతో చీఫ్ సెక్రటరీ అన్షుప్రకాశ్ హతాశుడయ్యారు.

జరిగిన సంఘటనపై ఎంతో కలత చెందిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం విశేషం. అసలు ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాధికారులకు మధ్య పూడ్చలేనంత అగాథాలు ఎందుకు పెరిగిపోతున్నాయనేది ప్రస్తుతం ఆందోళన రేపుతున్న అంశం.

దేశమంతా అనేక పార్టీలు, అనేక ఎజెండాలతో కూడి ఉండడం ప్రభుత్వాధికారుల మీద కూడా ఆయా పార్టీలు ఆ మేరకు ఒత్తిడి పెంచుతూండడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి వాటికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందనేది కాలమే జవాబు చెప్పాలి.

ప్రభుత్వాధికారులు ఏం చేసినా ప్రజాప్రతినిధులు నోర్మూసుకొని ఉండాలా? అలాగని అన్ని బాధ్యతలూ ప్రజాప్రతినిధులకే ఉంటాయని లీడర్స్ ఏకపక్షంగా వ్యవహరించవచ్చా? మరి ఇద్దరూ ఎవరికివారే అంటూ నిమిత్తమాత్రంగా ఉంటే ప్రజలకు పనులు చేయాల్సింది ఎవరు? ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాల్లో కీలకమైన ఇద్దరు ఒకరి మీద ఒకరు చెలరేగిపోతే ఆఖరుకు నష్టపోయేది ఎవరు? అత్యంత సున్నితంగా ఉండే ఈ పలుచని పొరను కాపాడుతూ పారదర్శకంగా పనిచేసే రోజుల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories