హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం

x
Highlights

న్యూఇయర్‌కి ముందే హైదరాబాద్‌ మహానగరం డ్రగ్స్‌ మత్తులో జోగుతోంది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి ఎక్కాల్సిన కిక్కు మూడ్రోజుల ముందే మొదలైపోయింది. నగరంలో...

న్యూఇయర్‌కి ముందే హైదరాబాద్‌ మహానగరం డ్రగ్స్‌ మత్తులో జోగుతోంది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి ఎక్కాల్సిన కిక్కు మూడ్రోజుల ముందే మొదలైపోయింది. నగరంలో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా జరుగుతోంది. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా మత్తు పదార్ధాలు విక్రయిస్తూనే ఉన్నారు. దాంతో న్యూఇయర్‌కి ముందే యువత డ్రగ్స్‌ మత్తులోకి జారుకుంటోంది.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాలు చెలరేగితున్నాయి. విచ్చలవిడిగా మత్తు పదార్ధాలను విక్రయిస్తున్నారు. పోలీసులు పటిష్ట నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ ముఠాలు చాకచక్యంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. న్యూఇయర్‌ వేడుకలకు సరిగ్గా మూడ్రోజుల ముందు హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. గతంలో ఎన్నడూ దొరకని విధంగా ఈసారి ఏకంగా 225 గ్రాముల కొకైన్‌ పట్టుబడటం పోలీసులనే విస్మయపరిచింది. ప్రధాన నిందితుడు జాన్‌ చిక్కూతోపాటు బెర్నార్డ్‌ విల్సన్‌, లుకాస్‌లను అదుపులోకి తీసుకున్న వెస్ట్‌జోన్‌ పోలీసులు వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

హైదరాబాద్‌లో 250 గ్రాముల కొకైన్‌ పట్టుబడటం ఇదే తొలిసారని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు. పట్టుబడిన కొకైన్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి 250 గ్రాముల కొకైన్‌, 25 గ్రాముల హెరాయిన్‌, రెండు ల్యాప్‌ ట్యాప్‌లు, 10 సెల్‌ఫోన్స్‌, 30 చాక్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సౌతాఫ్రికా, నైజీరియా నుంచి తక్కువ ధరకు కొకైన్‌, ‎హెరాయిన్‌ను కొనుగోలుచేసి ఇండియాలో ఒక్కో గ్రామును 570 డాలర్లకు విక్రయిస్తున్నారని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాసరావు తెలిపారు. కొకైన్‌ వాసన రాకుండా చాక్లెట్స్‌తో కలిపి గ్రాము చొప్పున సరఫరా చేస్తున్నారని సీపీ వెల్లడించారు.

వెస్ట్‌జోన్‌లో ముగ్గురు నైజీరియన్ల నుంచి పెద్దఎత్తున కొకైన్, హెరాయిన్‌ స్వాధీనం చేసుకుంటే చందానగర్‌లో మరో ముఠాను అరెస్ట్‌ చేశారు. చందానగర్‌ రెడ్డికాలనీలో ఇంజనీరింగ్‌ విద్యార్ధి గోనకుర్తి సంతోష్‌ కుమార్‌ నుంచి ఒక గ్రాము MDMA, 10 LSD డ్రగ్‌ బ్లాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్ధులే టార్గెట్‌గా ఈ డ్రగ్స్‌ను గోవా నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
న్యూఇయర్‌ వేడుకలపై నిఘా పెట్టినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి ఇచ్చామన్న సీపీ మొత్తం 50 టీమ్స్‌తో పబ్బుల దగ్గర నిఘా పెడుతున్నట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories