Top
logo

నాలుగేళ్ల తెలంగాణ నజరానాలు

X
Highlights

నాలుగేళ్ల తెలంగాణ ముఖచిత్రమిది. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో, వెలకట్టలేని అమరుల త్యాగాల పునాదులపై...

నాలుగేళ్ల తెలంగాణ ముఖచిత్రమిది. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో, వెలకట్టలేని అమరుల త్యాగాల పునాదులపై పురుడుపోసుకుంది తెలంగాణ రాష్ట్రం. జూన్‌2, 2014న తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు... సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలకు దిక్సూచిలా తెలంగాణను దేశం ముందుంచారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పాలనకు నాలుగేళ్లు. కేసీఆర్‌ పాలనకూ నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో చేపట్టిన ఆనేక కార్యక్రమాల్లో రైతాంగ సంక్షేమానికే పెద్ద పీట వేశారు ముఖ్యమంత్రి. అన్నదాతలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం చేసుకుని బంగారు పంటలు పండించేలా సకల హంగులు సమకూరుస్తున్న తీరు దేశవ్యాప్తంగా ఆకర్శితమవుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఎన్నెన్నో... వాటన్నింటిలో ముఖ్యమైన పథకాల సమహారమే ఈ నాలుగేళ్ల తెలంగాణ.

బతుకు భరోసా ఇచ్చేదే ఆసరా పథకం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు అండగా నిలబడే ఉద్దేశంతో ప్రవేశపెట్టేదే ఆసరా పథకం. మలిదశలో బతుకు భారం కాకుండా...ఎవరి మీద ఆధార పడకుండా ఉండాలన్న సత్సంకల్పంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాటగిరీలవారీగా పింఛన్ మొత్తాన్ని పెంచారు. ఈ పథకం కింద గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ సర్కారు బడ్జెట్‌ను కేటాయించి లబ్ధిదారులకు చెల్లింపులు జరిపింది.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం నిరుపేదల్లో వెలుగులను నింపుతుంది. వయస్సు మీద పడిన వృద్ధులకు, ఇంటిపెద్ద దిక్కు కోల్పోయి బతుకు పోరాటం చేస్తున్న వితంతువులకు, అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకు, కులవృత్తిపై ఆధారపడి బతుకులీడుస్తున్న గీత, నేత కార్మికులకు బతుకు భరోసా ఇచ్చేదే ఆసరా పథకం.

2014 నవంబరు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు పురుడు పోసుకున్న ఆసరా పథకం... కాలం కర్కశ చక్రాల క్రింద నలిగిన జీవితాలకు ఆసరాగా నిలుస్తూ వస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆసరాతో భరోసా ఇచ్చిన కేసీఆర్‌... అనర్హులకు కోత..అర్హులకు చేయూత అంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ ఆసరా పథకాన్ని అమ ల్లోకి తీసుకురావడమేగాక.. గత పాలకులు ఇచ్చిన 200 పెన్షన్‌ను 1000కి పెంచారు. వికలాంగులకు 1500లకు పెంచి తమ మాటను నిలబెట్టుకోవడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

గత ప్రభుత్వాలు ఇచ్చిన పింఛనుతో అవసరాలు తీరని పరిస్థితుల నుంచి, తమ కనీస అవసరాలను తీర్చగలిగేలా ప్రతి నెల వెయ్యి నుంచి 1,500 వరకు పింఛను లభించడం నిరుపేద వర్గాల్లో ఆనందం నింపుతుంది. అందుకే ఆసరా పథకాన్ని పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఈ పథకం కింద వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు కూడా పింఛన్లు అందిస్తుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు అరకొర పింఛనే అందుతుండగా, అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే అన్ని కేటగిరీల లబ్ధిదారులకు అధిక మొత్తం లభిస్తుంది. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఆసరా పథకానికి రూ. 4వేల కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం.

నిరుపేదల ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు అద్భుతమైన కానుక

ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ప్రయాస. చాలా ఖర్చుతో కూడుకున్న కార్యం. నిరుపేదలయితే అప్పులు చేసి వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్దదిక్కుగా, ఆడబిడ్డకు అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఆర్థికసాయం కొండంత అండ అవుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకే వర్తించిన ఈ పథకాన్ని ప్రస్తుతం ఆహారభద్రత కార్డులు కలిగిన పేదలందరికీ వర్తింపచేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

పేదింటి ఆడపిల్లకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన కానుక అందించారు. అదే కల్యాణలక్ష్మి. నిరుపేదల ఇంట్లో పుట్టిన ఆడపిల్లల పెళ్లి ఘనంగా జరిపించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకే వర్తించిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రస్తుతం ఆహారభద్రత కార్డులు ఉన్న పేదలందరికీ వర్తింపచేశారు. కొత్త జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబంలోని యువతి పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది.

కళ్యాణలక్ష్మి పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రవేశపెట్టిన ప్రభుత్వం... తొలి కానుకగా 51 వేల రూపాయలు అందించింది. అప్పటి నుంచి విడతలవారీగా పథకం ఉద్దేశాన్ని, నిధుల మొత్తాన్ని పెంచుకుంటూపోయింది. 2017-18 బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి పథకం ఆర్థికసాయాన్ని 51 వేల నుంచి 75,116లకు పెంచిన సర్కార్‌ 2018 మార్చి 19న దాన్ని అమాంతం లక్ష 16 వేలకు పెంచి... నిరుపేదలకు ఆర్థిక ఊతాన్ని అందించింది.

దరఖాస్తు విధానమంతా ఆన్‌లైన్ ద్వారా ఉండడంతో ఎక్కడా అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఏ వర్గానికి చెందిన వారైనా తమ కుటుంబంలోని ఆడపిల్లల వివాహాం కోసం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈబీసీ జాబితాలో ఉన్నవారు, నిరుపేదలు... ఇలా అన్ని వర్గాలకు చెందిన తెలంగాణలోని ప్రజలంతా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఘనంగా పెళ్లిళ్లు చేశారు. ఆడపిల్లను ఘనంగా అత్తారింటికి సాగనంపారు.
కేసీఆర్ కిట్‌తో పేదలకు అండ
ఇప్పటివరకు కాన్పు అంటే మామూలు జనాలకు గుండెల మీద బరువే. గత ప్రభుత్వాల నిర్వాకం మూలంగా ప్రభుత్వ దవాఖానల మీద భయం. ప్రైవేట్ దవాఖానల మీద అనుమానాలు పెరిగాయి. సగటు జీవి ప్రభుత్వ దవాఖానకు ధైర్యంగా వెళ్లలేడు. ప్రైవేట్ దవాఖానలో ఖర్చు భరించలేడు. సగటుజీవి దవాఖానకు వెళ్లాలంటేనే గుండె గుబేల్‌మనే పరిస్థితి. కానీ కేసీఆర్‌ ఈ పరిస్థితికి చరమగీతం పాడుతూ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే అమ్మఒడి, కేసీఆర్‌ కిట్స్‌.

సగటు మనిషికి ఏం కావాలో... ఎలా జీవించాలనుకుంటాడో బాగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌. అందుకే మనిషి కనీస అవసరాలు కూడు, గూడు, విద్య, వైద్యాన్ని అధిక ప్రాధాన్యమిస్తూ... వారి ఆత్మగౌరవ సూచికగా మారారు కేసీఆర్‌. కేవలం నాలుగంటే నాలుగేళ్ల పాలనలో గత అరవై ఏళ్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఆ పట్టుదల నుంచి... ఆ ప్రజా సేవ తత్పరత నుంచి మొలకెత్తిందే అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ పథకం.

కాన్పు అంటేనే గుబులుపడే సామాన్యులకు అమ్మఒడి పథకం, కేసీఆర్ కిట్‌తో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. పథకం అంటే ఒక ప్రహసనంగా కాకుండా ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది సర్కార్‌. తక్కువ సమయంలోనే లక్ష మందికి పైగా కేసీఆర్ కిట్లు అందాయంటే పథకంపై ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

గత జూన్ ముందువరకు వెలవెలబోయిన ప్రభుత్వ దవాఖానాలు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రవేశపెట్టిన పథకం.. నూటికి నూరుపాళ్లు తన లక్ష్యాన్ని చేరుకుంది. 2017, జూన్ 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం అత్యల్పకాలంలోనే ప్రజలందరికీ చేరువైంది.

అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 561 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం కోసం ప్రత్యేకంగా 102 పేరిట 250 వాహనాలు పని చేస్తున్నాయి. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయసు వచ్చేంతవరకూ నాలుగు విడతలలో అనగా గర్భం దాల్చిన ఐదు నెలలలోపు డాక్టరు పరీక్ష అనంతరం 3 వేల రూపాయలు, ప్రసవ సమయంలో ఆడ శిశువుకు 5 వేల రూపాయలు, లేదా మగ శిశువుకు 4 వేల రూపాయలు, శిశువుకు వ్యాధినిరోధక టీకాలు 14 వారాల వయసులో 3 వేలు, 10 నెలల వయసులో 2 వేల చొప్పున నాలుగు విడతలలో రూ. 12,000 రూపాయలను అందిస్తోంది. ప్రసవం తర్వాత 2 వేల రూపాయల విలువైన 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్‌ కిట్‌ను కూడా ఇస్తుంది. కేసీఆర్ కిట్‌లో తెలంగాణవ్యాప్తంగా 5 లక్షల 66 వేల 799 మంది నమోదు చేయించుకోగా .. కాన్పులైన లక్షా 28 వేల 462 మంది కేసీఆర్ కిట్లు అందుకోవడం విశేషం.

ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పం
మిషన్‌ భగీరథ... నీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాగునీటి కోసం గ్రామీణులు, ముఖ్యంగా మహిళలు కష్టపడటాన్ని, అరక్షిత నీటితో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితిని క్షేత్రస్థాయలో పరిశీలించిన ముఖ్యమంత్రి... మహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న 31జిల్లాల్లో రక్షిత తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులు యుద్ధప్రతిపాదికన సాగుతున్నాయి.

మిషన్ భగీరథ... తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో బృహత్తర పథకం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశానికి అంకురార్పణే మిషన్ భగీరథ. 2016, ఆగస్టు 7న గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర అప్పుడే సృష్టించింది.

మిషన్‌ భగీరథ ద్వారా సుమారు .42,000 కోట్ల రూపాయలతో కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాలను కలిపాలన్నది లక్ష్యం. దీని నుంచి 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం రాష్ట్రంలోని 24 వేల గ్రామాలు, 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించబోతున్నారు. తాగునీటి సమస్యలను తీర్చి... స్వచ్ఛమైన నీరు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం.

తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్‌ భగీరథను చేపట్టారు. నీటి వనరు నుంచి పైపులైన్ల ద్వారా నీటిని ఓవర్‌హెడ్‌ ట్యాంకు లేదా రిజర్వాయర్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు ట్యాంకులు, పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా వాటర్‌ట్రిట్‌మెంట్‌ ప్లాంట్‌లు, రిజర్వాయర్లు, ట్యాంకులు, ఇంటింటికీ కుళాయిలకు అవసరమైన ఇంట్రాపైప్‌లైన్ల నిర్మాణం పూర్తయ్యేవిధంగా అన్ని ప్యాకేజీల్లోనూ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
చారిత్రాత్మక పథకంతో కరువుకు శాశ్వత పరిష్కారం
మిషన్ కాకతీయ ఓ లక్ష్యం, ఓ స్ఫూర్తి. ఊర్లకు జీవనాడి లాంటి చెరువులను మరమ్మతు చేసే పథకమే మిషన్ కాకతీయ. ఇప్పుడది తెలంగాణ నలుచెరుగులా కార్యరూపం తీసుకుంటుంది. మారుమూల పల్లెల్లో కూడా చెరువులు కళకళలాడుతున్నాయి. పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరువు అన్న మాట వినిపించకుండా... ఆ జాడ కనిపించకుండా... శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్‌ మదిలో నుంచి పుట్టిన చారిత్రాత్మక పథకమే మిషన్‌ కాకతీయ.

తెలంగాణలో కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన బృహత్తర పథకమే మిషన్ కాకతీయ పథకం. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ చారిత్రాత్మక పథకం కరువుకు శాశ్వత పరిష్కారంగా మారింది. తెలంగాణలో నెర్రలు బారిన చెరువులను నిండుకుండల్లా మారుస్తున్న మహాయజ్ఞంగా మిషన్‌ కాకతీయ అందరి నోట నానుతోంది. సమైక్య పాలనలో ధ్వంసమైన చెరువులకు పున:ర్జన్మ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి మొట్టమొదటి హమీనే మిషన్ కాకతీయగా ప్రజల ముందుకొచ్చింది.

2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌‌లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్‌. ఇక అప్పటి నుంచి అదొక మహా యజ్ఞంలా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వానికి దీని ఫలితాలపై స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎట్లా కొనసాగించాలన్న అంశంపై విస్తృతమైన చర్చ జరిపారు సీఎం.

పూడికలు తీసి చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం మిషన్‌ కాకతీయ లక్ష్యం. తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో పరచడం, చెరువు కట్టలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకం రూపుదిద్దుకుంది. చెరువుల్లో పెరిగిన తుమ్మ చెట్లను నరికి వేయడం, గుర్రపు డెక్క మొక్కల తొలగించడం, చెరువుల శిఖం భూములను కబ్జాల బారి నుంచి రక్షించడం...ఇవన్నీ మిషన్‌ కాకతీయ విజన్.

ఉద్యమం సందర్భంగా చెరువుల పునరుద్ధరణ జరగాలని ప్రజలు కలగన్నారు. ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ కలను సాకారం చేయడానికి బలమైన సంకల్పం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46531 సాధారణ చెరువుల్లో... 4 వేలున్న గొలుసుకట్టు చెరువులున్నాయి. వీటి నిర్మాణంలో అత్యున్నత నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించి దక్కన్‌ పీఠభూమిలో ఉన్న అననుకూల భౌగోళిక పరిస్థితులను అనుకూలతగా మార్చుకొని సముద్రాలని తలపించే చెరువులను నిర్మించాలన్నది కేసీఆర్‌ ఉద్దేశం. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం అనితర సాధ్యంగా కొనసాగింది. తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు బాటలు వేసింది. ఆర్థిక సాంస్కృతిక వికాసానికి దోహదం చేసింది. అదే కలను సాకారం చేసే దిశగా మిషన్‌ కాకతీయతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

2018-19ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు రూ.4 వేల పెట్టుబడి సాయం
వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయం అందించేలా పటిష్ఠమైన విధివిధానాలతో... అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది సర్కార్‌. ఫసల్‌కు నాలుగు వేల చొప్పున ఏడాదిలో ఎకరాకు 8 వేల రూపాయలు ఇవ్వడం పథకం లక్ష్యం.

రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో రూపొందిందే రైతుబంధు పథకం. ఈ ఏడాది మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి- ఇందిరానగర్‌‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ధర్మరాజుపల్లి వాసులు సీఎం చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

2018-19 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్‌. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో 12 వేల కోట్లు కేటాయించింది. పట్టాదారులకే నేరుగా చెక్కులు అందిస్తోంది. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం 50 వేల లోపు ఉంటే ఒకే చెక్కు ద్వారా ఇస్తారు. 50 వేలు దాటితే రెండు చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. 8 బ్యాంకుల ద్వారా ఈ చెక్కులను రైతులకు ఇస్తోంది.

రైతుబంధు పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అంటే 181 వ రోజు నుంచి 270వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. మొత్తంగా రైతుబంధు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం పొందుతున్నారు.

చెక్కుల పంపిణీని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, రాష్ట్ర సమాచార శాఖ అధికారులు కమిటీలో ఉంటారు. చెక్కులపై రైతుబంధు పథకం పేరు కూడా ముద్రిస్తారు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే. ఆ లోపు మార్చుకోకుంటే తరువాత కొత్త చెక్కు తీసుకోవాల్సిందే.

సుపరిపాలన దిశగా సుస్థిర పాలన అందించటం క్లిష్టమైనదే కాకుండా కష్టసాధ్యమైనది కూడా. రాష్ట్ర ఏర్పాటుకు పోరాడడం ఒక ఎత్తయితే, సుస్థిరాభివృద్ధికి సుపరిపాలన ఎంతో అవసరం. ఆ దిశగా వేస్తున్న అడుగులు సహజంగానే ఇతరులకు పెద్దగా కనిపించకపోవచ్చు. అవి అడుగులే కాదనే వారు ఉంటారు. కానీ ముఖ్యమంత్రి ఒక్క అడుగే వేల కిలోవిూటరల్‌ ప్రయాణానికి పునాది అంటారు. అందుకే తాను నమ్ముకున్న బాటలో సాగడానికి ఆయన విమర్శలను పక్కన పెట్టారు. అందుకే అచిర కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో తనదైన ముద్రను వేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల భవిష్యద్దర్శనం ఉన్న నేతగా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి, ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Next Story