ప్రకృతి విలయాలొచ్చినప్పుడల్లా మనిషికి భూమ్మీద నూకలు చెల్లిపోయాయనుకుంటాం సృష్టి వినాశనానికి సమయం దగ్గరపడిందని భయపడతాం మన పొరపాట్లే మనల్ని...
ప్రకృతి విలయాలొచ్చినప్పుడల్లా మనిషికి భూమ్మీద నూకలు చెల్లిపోయాయనుకుంటాం సృష్టి వినాశనానికి సమయం దగ్గరపడిందని భయపడతాం మన పొరపాట్లే మనల్ని కాటేస్తున్నాయని తర్కించుకుని విచారిస్తాం 2013లో ఉత్తరాఖండ్ ప్రకృతి విలయతాండవం మరిచిపోకముందే దేవభూమి కేరళ అదే ప్రకృతి కరాళనృత్యానికి కకావికలమయ్యింది. కొండలు, కొండవాలు ప్రాంతాల సంగతి అటుంచితే మహానగరాల మాటేమిటి మరి? వాటి మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్న మాట నిజం. చెట్లు నరికివేస్తూ కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న మహానగరాలకు ముంపు ప్రమాదానికి అతి చేరువలో ఉన్నాయన్నదీ నిజం. ఓ గంట గట్టిగా వాన పడితే విలవిల్లాడే భాగ్యనగరంపై వరుణుడు తన విశ్వరూపం చూపిస్తూ పంజా విసిరితే పరిస్థితి ఏంటి.? ఏదైనా జరిగితేనే హడావిడి చేసే యంత్రాంగం రాబోయే మహా విపత్తును నివారించే నష్ట నివారణ చర్యలు ఏం తీసుకుంటుంది? అసలేం తీసుకోవాలి.
మొన్న చెన్నై, నిన్న ముంబై రేపు మరోచోట కావచ్చు. కానీ మహానగరాల్లో ఎక్కడో చోట ఏటా వరదలు, విపత్తులు, ఉప్పెనలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. విపత్తు నోరు తెరిచిన ప్రతిసారీ ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. పోటెత్తుతున్న వరదల వల్ల సామాజిక, ఆర్థిక జీవనం పూర్తిగా స్తంభిస్తోంది. ఈ విపత్తుల వల్ల వాటిల్లిన నష్టం మాములుగా ఉండదు. ముంబై, చెన్నైలాంటి మహానగరాల్లోనూ కుండపోత వర్షాల ఉద్ధృతికి రహదారులు, వీధులన్నీ జలమయమై జనజీవితాన్ని దారుణంగా ప్రభావితం చేశాయి. ఏటికేడు నగరాలను వరదలు ముంచేస్తుంటే మన మహానగరం మాటేమిటి?
దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ముంపు ముప్పు తప్పదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు పెను ముప్పు తప్పదేమో అన్నట్టుగా ఉంది చూస్తుంటే.!! ఇరవై నాలుగు గంటలు తెరిపి ఇవ్వకుండా భారీ వర్షం పడితే అత్యంత ప్రభావితమయ్యే మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ఇది ఎన్‌డీఎంఏ చెబుతున్న మాట. మొదటి రెండు స్థానాల్లో ముంబై, చెన్నై నగరాలున్నాయి. చిన్న వర్షానికే చితికిపోయే భాగ్యనగరంపై వరుణుడు పంజా విసిరితే అల్లాడిపోవడం ఖాయం. 2000వ సంవత్సరంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలో పదుల సెంటిమీటర్ల జడివాన రాజధానిని నిండా ముంచేసింది. అలాంటి పరిస్థితే పునరావృతమైతే విశ్వనగరం పరిస్థితి ఏంటి? 2005లో ముంబై, 2015లో చెన్నైని ముంచెత్తిన అతి భారీ వర్షాల నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి?
హైదరాబాదే కాదు దేశంలోని ప్రధాన నగరాలు ఇలాంటి ముప్ప ముంగిటే ఉన్నాయి. ఆపద పొంచి ఉన్న రాష్ట్రాలు, నగరాలను ఎన్‌డీఎంఏ అప్రమత్తం చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోకుంటే మాత్రం పెను విపత్తు తప్పదు. చెన్నై, ముంబై నగరాల్లో కురిసే వర్షంలో సగం కురిసినా హైదరాబాద్ దారుణమైన నష్టాన్ని చవి చూడకతప్పదు. ఎందుకంటే హైదరాబాద్ పరిసరాల్లో వందలాది చెరువులు, కుంటలను ఆక్రమించేశారు. చెరువులు, కుంటల శిఖం భూములను కొల్లగొట్టి భవనాలు కట్టేశారు. అంటే ఏ లెక్కన చూసినా వరద వెళ్లే దారే లేదు. ముంబైలో గతంలో 24 గంటల పాటు 90 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు 5 రోజులపాటు జనజీవనం స్తంభించింది. చెన్నైలోనూ అంతే. 60 సెంటీమీటర్ల వాన పడ్డప్పుడు అక్కడ ప్రజానీకానికి వారంరోజులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో 24 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సగం నగరం వరదలోనే ఉంటుంది. రోజున్నర పాటు 60 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ముప్పావువంతు హైదరాబాద్ నీటిలో తేలియాడటం ఖాయం.
మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కురిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు వరద ముప్పు తీవ్రంగా ఉంటుంది. అంతకంటే రెట్టింపు ముప్పు ఉభయ గోదావరి జిల్లాలకూ ఉంటుంది. గోదావరి వరదలతో సంబంధం లేకుండా ఒకరోజు 30 సెంటీమీటర్ల వానపడితే ఏపీలోని 10 జిల్లాలు వరద ముప్పునకు గురవుతాయి. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప పట్టణాలు వరద ముంపులోనే ఉంటాయి. భారీ వర్షాలు పడితే దక్షిణాదిలో కేరళ తర్వాత అంతటి ఉపద్రవం ఏపీకి పొంచి ఉంది. ఆ తరువాత స్థానం కచ్చితంగా తెలంగాణాదే.
ప్రకృతి విపత్తుల రాకపోకలను పసిగట్టి, జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడుతున్నాం. అయితే ఆశించిన స్థాయిలో నష్ట తీవ్రతను తగ్గించలేకపోతున్నాం. ఇది నిజంగా అతి పెద్ద సమస్యగా మారింది. వరదల వల్ల సంభవిస్తున్న ఆర్థిక నష్టం దేశాన్ని భయపెడుతోంది. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాక కూడా వరదల బారినపడి మహానగరాలు పెద్దఎత్తున నష్టపోతున్నాయి. ఇందుకు ఆయా ప్రాంతాల్లో వరదనీరు బయటికి వెళ్ళే వ్యవస్థలు సరిగా లేకపోవడమే కారణమన్నది ముమ్మాటికి నిజం.
తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన నగరాలే కాదు మహానగరాలు కూడా ముంపు ముంగిట నిలబడ్డాయి. గంటా, రెండు గంటలు ఎడతెరిపి లేకుండా వాన పడితే చిగురుటాకుల వణికే మన భాగ్యనగరం సహా అనేక నగరాలు మహా విపత్తును ఎదుర్కోబోతున్నాయి. చెన్నై, ముంబై వరద బీభత్స పరిణామాలతో ప్రజలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కాంక్రీట్ అరణ్యాలతో వరదలు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మన దగ్గరే కాదు వాతావరణంలో మార్పు ప్రపంచమంతా కనపడుతోంది. ఒక మోస్తరు వర్షాల నుంచి ఇప్పుడు అనూహ్యంగా, అకస్మాత్తుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అప్పట్లో తుపాను వస్తేనే వచ్చే వరదలు ఇప్పుడు ఓ గంట గట్టిగా దంచి కొట్టే వానలకే నీళ్లూ, ఊళ్లూ ఏకమవుతున్నాయి. వాతావరణంలో మార్పులు పర్యావరణ సమతుల్యత లోపించడం వంటి కారణాలతో ఎవరికీ అర్థం కాని వర్షాలు పడుతున్నాయి. అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది అర్థం కాదు. 2015లో చెన్నైని ముంచెత్తిన వరద చరిత్ర మరిచిపోలేదు. గడిచిన వందేళ్లలో అలాంటి వర్షాలను చూడలేదు. భూతాపం వల్ల నగరాలు మునిగిపోతాయి. మహానగరాలు ముంపునకు గురవుతాయని నాసా ఎప్పుడో హెచ్చరించింది. అయినా మనలో స్పందన లేకపోవడమే బాధాకరం.
ఇలా ఎలా చూసినా... మహానగరాల మనుగడకు కచ్చితంగా ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ఒకప్పుడు మహానగరాలు చెట్లు, తోటలతో, సురక్షితమైన పర్యావరణంతో కళకళలాడేవి. ఇప్పుడు పచ్చని చెట్టు కనిపించే పరిస్థితి లేదు. మహానగరాల విస్తీర్ణం పేరిట చిన్న చిన్న చెట్లే కాదు ఏపుగా పెరిగిన మహా వృక్షాలను కూడా కూకటివేళ్లతో పెకిలిస్తూ కాంక్రీట్ అరణ్యాలుగా మార్చేస్తున్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం వెదజల్లుతోంది. వాస్తవానికి వరదనీరుకు సహజ పరివాహక వ్యవస్థ ఉండాలి. మహానగరాల్లో నిర్మాణాలు ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. కాల్వలకు నాలాలకు అడ్డంగా నిర్మాణాలు చేస్తున్నారు. నీరు ఎక్కడకు వెళ్లాలో తెలియక ఇళ్లలోకి ఇతర ప్రాంతాల్లోకి వెళుతోంది. అంతేగాక భూమిపై కాంక్రీట్ పెరగడం వల్ల నీరు ఇంకే అవకాశం లేదు. భూగర్భ జలాలు పెరగడం లేదు. వర్షపు నీటిని త్వరగా తొలగించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోవడం కూడా మహానగరాలకు శాపమే అని చెప్పాలి.
ఆపదలనేవి చెప్పిరావు. ఎప్పుడు ఏ రూపంలో దాడిచేసినా దీటుగా వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. లేకపోతే రెప్పపాటులో అంతులేని అనర్థం జరిగిపోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే మొన్నటి అసోం, బీహార్, నిన్నటి ఉత్తరాఖండ్, ఇవాళ్టి కేరళనే కరువు కాటకాలు, భారీ వర్షాలు, వరదలు, తుఫానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు మన సామాజిక ఆర్థిక వ్యవస్థలను ఎంత అస్తవ్యస్తం చేస్తున్నాయో మనకీ ఉత్పాతం కళ్లకు కట్టింది. అలాంటి విపత్తులను పూర్తిగా నిలువరించకపోయినా కాస్తంత అప్రమత్తంగా ఉంటే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందన్న నిజం తెలుసుకున్నప్పుడే ఈ భూమ్మీద మానవ మనుగడ సాధ్యమవుతుంది.
రోడ్లు.. వంతెనలు.. ఊళ్లూ ఏవీ వరద వేగాన్ని ఆపలేవు. అందుకే వరదలకు దారితీస్తున్న కారణాల అన్వేషణ జరగాలి నివారించలేకపోయినా ఎదుర్కొనే సత్తాను పెంపొందించే చర్యలు చేపట్టాలి. వాస్తవానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం దేశంలో 12 శాతం భూభాగం వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. వరదలు సంభవించాక ఏం చేయాలి వరద బాధితులకు ఎలాంటి సహాయ, పునరావాస చర్యలను అమలు చేయాలన్న అంశంపైనే కాకుండా వరదలు రాకముందే జాగ్రత్త పడటం ద్వారా మనల్ని మనం రక్షించుకున్న వాళ్లమవుతాం.
ఒక భారీ విపత్తు కనబరచే ఆర్థిక, విత్తపరమైన ప్రభావాలను అంచనా కట్టడం కష్టం. నష్ట అంచనా సాధ్యమైనంత సత్వరం జరగాలి. అప్పుడే అది దేశ ప్రగతిపై ఎంతమేరకు ప్రభావం చూపింది, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి వంటి వివరాలను పక్కాగా రూపొందించొచ్చు. ప్రకృతి విపత్తుల నష్ట నివారణ దీర్ఘకాలిక పెట్టుబడులతో ముడిపడి ఉంది. అభివృద్ధి వ్యూహాలకు తగిన మేరకు కేటాయింపులకు ప్రాధాన్యం కల్పించాలి. అత్యాధునిక వరద హెచ్చరికల వ్యవస్థను వినియోగించాలి. విపత్తుల తీవ్రత, వాటివల్లే కలిగే నష్టం ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగల సమర్థతను సంతరించుకున్న నాడే దేశ ఆర్థిక వ్యవస్థ తిరుగులేని వృద్ధిపథంలో నడుస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire