Top
logo

చిచ్చు పెడుతున్న మతరాజకీయం

X
Highlights

జిజ్యా పన్ను గురించి చరిత్రలో చదువుకున్నాం. ఉత్తర భారతాన్ని పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ మొదట హిందువులపై ఈ పన్ను ...

జిజ్యా పన్ను గురించి చరిత్రలో చదువుకున్నాం. ఉత్తర భారతాన్ని పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ మొదట హిందువులపై ఈ పన్ను విధించాడు. 16 వశతాబ్దిలో అక్బర్ ఆ పన్ను తొలిగించాడు. 17వ శతాబ్దిలో ఔరంగాజేబు ఆ జిజ్యా పన్ను మళ్ళీ విధించాడు అప్పట్లో ఆ పన్ను చెల్లించని వారిని గడ్డం పీకుతూ హింసించేవారు. మత మార్పిడి చేసుకోవాలని వేధించే వారు. ఇప్పుడు అదే గడ్డం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అంతేకాదు అదే తరహాలో మత మార్పిడి చేయిస్తామని, గడ్డం పెంచుకునేలా చేస్తామని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేలా నాయకులను ప్రేరేపించింది. తాజా ఉదంతం విషయానికి వస్తే మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన హేట్ స్పీచ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒవైసీ అలా ఎందుకు మాట్లాడారు ? అందుకు ఆయనను ప్రేరేపించిన సంఘటన ఏంటి ? కొంతమంది నాయకులు తరచూ ఎందుకలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు ? అలాంటి వ్యాఖ్యలతో సమాజంలో ఏం జరుగుతోంది ?

ఢిల్లీ సమీపంలో గురుగ్రామ్ లో రెండు వర్గాల వారి మధ్య ఇటీవల జరిగిన ఓ చిన్న వివాదం దేశంలో పెద్ద చిచ్చు రేపింది. ఇటీవల గురుగ్రామ్ లో కొంతమంది యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సందర్భంగా ముగ్గురు యువకులు ఓ ముస్లిం యువకుడిని సమీపంలోని బార్బర్ షాప్ లోకి తీసుకెళ్ళి గడ్డం తీసేయించారు. ఈ ఘర్షణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకు కారకులైన వారిని ఇస్లాంలోకి మారుస్తానని, గడ్డం పెంచుకునేలా చేస్తానని ఒవైసీ బెదిరించినట్లుగా వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయి.

ఒక ముస్లిం వ్యక్తి గడ్డం గీయించారు. అలా చేసిన వారికి, వారి తండ్రులకు నేను చెప్పేదొకటే మా గొంతులు కత్తిరించినా మేము ముస్లింలమే. మేము మిమ్మల్ని ఇస్లాంలోకి మారుస్తాం గడ్డం పెంచుకునేలా చేస్తాం అని ఒవైసీ హెచ్చరించారు. నిజానికి ఒవైసీ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ పలు సందర్భాల్లో ఒవైసీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. గో సంరక్షకుల దాడులు అధికమవుతున్నాయంటూ కేంద్రప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ సంఘటన జరగడం బీజేపీ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశమే.

విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంలో సంఘ్ పరివార్ నేతలు సైతం ముందంజలో ఉన్నారు. ఆరెస్సెస్, బీజేపీ, ఇతర అనుబంధ సంస్థల నాయకులు వీరిలో ఉన్నారు. దేశంలో ముస్లింల జనాభా పెరగడం, రామాలయ నిర్మాణం, గోసంరక్షణ లాంటి అంశాలపై ప్రసంగాల సందర్భాల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ పార్టీలకు, మతాలకు చెందిన నాయకుల ఆవేశపూరిత ప్రసంగాలు ప్రజానీకంలో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. అల్లర్లకు దారి తీస్తున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాలకు చోటు కల్పిస్తున్నాయి.

దేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు గత రెండు దశాబ్దాల కాలంలో అధికమయ్యాయి. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు 58 మందిపై హేట్ స్పీచ్ సంబంధిత కేసులు నమోదయ్యాయి. ఇంత అధిక సంఖ్యలో చట్టసభ సభ్యులపై కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఎన్నికల సందర్భంగా వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ లెక్కలు తేల్చారు. బీజేపీకి చెందిన పది మంది ఎంపీలు, మజ్లిస్, శివసేన నుంచి ఒక్కొక్క ఎంపీపై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఇది ఎంపీల లెక్క మాత్రమే. ఎమ్మెల్యేలను కూడా కలిపితే బీజేపీ నుంచి 27 మంది లెక్క తేలుతారు. మజ్లిస్ కు చెందినవారి సంఖ్య 6. అసదుద్దీన్ ఒవైసీ, బద్రుద్దీన్ అజ్మల్, ఉమాభారతి లాంటి వారెందరో ఇలాంటి కేసులు తమపై ఉన్నాయని స్వయంగా అంగీకరించారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఇలాంటి హేట్ స్పీచ్ కేసులు తమపై ఉన్నాయని వెల్లడించారు. ఇతర సంఘాల నాయకులు, మత నాయకులపై కూడా ఇలాంటి కేసులు అనేకం దాఖలవుతున్నాయి.

విద్వేష వ్యాఖ్యలు చేయడాన్ని నిషేధిస్తూ ఐపీసీలో పలు సెక్షన్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. రకరకాల కారణాల వల్ల కేసులు నమోదు కావడం లేదు. ఒకటి అరా నమోదైనా అవి నీరుగారుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. 2014 మార్చి 3న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్వేష వ్యాఖ్యలపై నిస్సహాయతను వ్యక్తం చేసేదిలా ఉంది. ప్రజలు తమ మనోభావాలను వ్యక్తం చేసేందుకు గల ప్రాథమిక హక్కును అణచివేసేలా ఎన్నికల కమిషన్ ను తాము ఆదేశించలేమని సుప్రీం కోర్పు స్పష్టం చేసింది. సమాజంలో, ప్రజల దృక్పథాల్లో వస్తున్న మార్పులను ప్రస్తావించింది.

గత కొన్నేళ్ళలో భావ ప్రకటన స్వేచ్ఛ కు ప్రాధాన్యం పెరిగింది. మరో వైపు సోషల్ మీడియా అంచనాలకు మించి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రాతలను, మాటలను అదుపు చేసే రోజులు పోయాయి. దానికి తగ్గట్లుగానే న్యాయస్థానాలు కూడా వివిధ అంశాలపై కొంత ఉదారంగానే ఉంటున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హేట్ స్పీచ్ లు పెరిగిపోయాయి. తమ మతవర్గంలో ఎదురు లేని నాయకులుగా చలామణి అయ్యేందుకు, పార్టీలో, ప్రజల్లో పాపులర్ అయ్యేందుకు కొంతమంది నాయకులు ఈ తరహా హేట్ స్పీచ్ ధోరణులను ఎంచుకుంటున్నారు. తమ భావజాలాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు హేట్ స్పీచ్ ను ఒక ఆయుధంగా చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ నాయకులుగా ముద్ర వేసుకుంటున్నారు.

అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు, సహనంగా ఉండాలని సూచించాల్సిన నాయకులే సంయమనం కోల్పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ఎన్నికల సమయంలో కావాలని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నించే నాయకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారే ఇప్పుడు ఆయా పార్టీలకు తురుపు ముక్కలుగా మారుతున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నాయకులకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తాయని ఆయన హితవు పలికారు. కానీ చిన్నా, పెద్ద బీజేపీ నాయకులు ఆ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

హేట్ స్పీచ్ పెరిగిపోవడానికి వివిధ సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. దేశ జనాభా తీరుతెన్నుల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం ఒక వర్గం వారికి ఆందోళన కలిగించేదిగా మారింది. మరో వైపున రాజకీయాల్లో మతం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సమాజంలో మెజారిటీ, మైనారిటీ చీలికలు వస్తున్నాయి. ఒక భావానికి, ఒక వాదానికి కట్టుబడి ఉండడం అని గాకుండా వర్గానికి, మతానికి కట్టుబడి ఉండడం అనే ధోరణి పెరిగిపోయింది. కుటుంబ నియంత్రణ, బహు భార్యత్వం, విడాకులు, ఆలయంలో పూజలు, ఆలయ నిర్మాణం, వేషధారణ, ఉగ్రవాదం, ఛాందసత్వం, యూనిఫాం సివిల్ కోడ్ ఇలా ఎన్నో అంశాలు నేడు సమాజంపై తమ ప్రభావాన్ని అధికం చేస్తున్నాయి. తమ గొంతు బలంగా విన్పించకుంటే, తమకు అన్యాయం జరుగగలదన్న భావన బలపడుతోంది. ఇవన్నీ కలగలసి నాయకుల విద్వేష వ్యాఖ్యలకు దారి తీస్తున్నాయి. ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ, సంయమనమే ప్రజాస్వామ్యానికి రక్ష. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. అలాంటి ఏకత్వాన్ని సాధించేందుకే అంతా కృషి చేయాలి.

Next Story