గోల్‌... మాల్‌ గోవిందం... ఇవీ మాల్స్‌ మోసాలు

గోల్‌... మాల్‌ గోవిందం... ఇవీ మాల్స్‌ మోసాలు
x
Highlights

వన్ స్టాప్ షాప్.. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన నినాదం ఇది. అంటే గుండు సూది నుంచి గోంగూర వరకూ అన్నీ ఒక్క చోటే దొరికే వెసులు బాటు. నగరంలో షాపింగ్ మాల్...

వన్ స్టాప్ షాప్.. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన నినాదం ఇది. అంటే గుండు సూది నుంచి గోంగూర వరకూ అన్నీ ఒక్క చోటే దొరికే వెసులు బాటు. నగరంలో షాపింగ్ మాల్ కల్చర్ వచ్చాక నగర జీవి సుఖపడ్డాడా? అన్నీ ఒక్క చోటే.... పైగా ఆఫర్లలోనూ దొరుకుతున్నాయన్న ఫీలింగ్ లో ఉన్నారా? ఆఫర్ మాటున మనల్ని నిలువుదోపిడీ చేస్తున్న షాపింగ్ మాల్స్ విశ్వ రూపం చూశారా? అయితే ఇప్పుడు చూడండి..

నగరంలో షాపింగ్ చేయడమంటేనే వినియోగ దారుడు బెంబేలెత్తాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పైకి హంగుగా, ఆకర్షణీయంగా ఉండే షాపింగ్ మాల్స్ లోపలికెడితే మాత్రం కస్టమర్లను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కళ్లు చెదిరే లైట్లతో, అట్రాక్టివ్ డిస్ ప్లే వెనక జరిగేదంతా మోసమే..షాపింగ్ మాల్ సోకు చూసి లోపలికెళ్లామా మనం అడ్డంగా బుక్కయిపోడం ఖాయం. ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగ దారులను ఆకట్టుకునే షాపింగ్ మాల్స్ తూనికలు- కొలతలు, నాణ్యత విషయంలో మాత్రం పచారీ కొట్లకన్నా దారుణంగా మోసగిస్తున్నాయి. తూకాల్లో మోసంతో పాటూ సరుకు ఎప్పుడు, ఎక్కడ తయారైంది, దాని ఎక్సపైరీ డేటేంటి అన్న మినిమమ్ వివరాలు లేకుండా సరుకును అమ్ముతున్నాయి.

నగరంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ఈ షాపింగ్ మాల్స్ పై తూనికలు కొలతల అధికారులు దాడులు చేశారు. ఇనార్బిట్ మాల్, డీమార్ట్, మోర్ లాంటి బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ , సూపర్ మార్కెట్లు కూడా తక్కువేం తినలేదని అధికారుల దాడిలో తేలింది. ఈ షాపులపై 102 కేసులు నమోదయ్యాయి. దాదాపు52 లక్షల విలువైన ఐటెమ్స్ ను సీజ్ చేశారు. ప్రతీ షాపింగ్ మాల్ లోనూ ఏ వస్తువైనా నిర్దేశించిన ధరకన్నా ఎక్కువ అమ్మరాదన్న నియమముంటుంది.కానీ ఈ బడా షాపింగ్ మాల్స్ ఆ నియమాలకూ తిలోదకాలిచ్చి ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకే అమ్ముతున్నాయి. ఇక షాపుల్లో డిజిటల్ తూనికల యంత్రాలున్నా.. అందులోనూ మోసాలున్నాయి.

మాదాపూర్‌.. ఇన్‌ఆర్బిట్ మాల్‌, పంజాగుట్ట..హైదరాబాద్‌ సెంట్రల్‌, కూకట్‌పల్లి.. ఫోరమ్‌ సుజనా మాల్‌, బంజారాహిల్స్‌.. జీవీకే మాల్స్ ల్లో తూనికల కొలతల శాఖకు చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఈ మాల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలను కొనసాగిస్తూ ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ నిబంధనలను ఉల్లంఘిస్తిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ రూల్స్‌ ప్రకారం వస్తువుపై తయారీదారు చిరునామా, తయారీ తేది, నికర బరువుతో పాటు ట్యాక్స్ లతో సహా ఎంఆర్‌పి ధరను ముద్రించాలి. అయితే, ఈ మాల్స్ కమొడిటీస్ రూల్స్ పక్కన పెట్టి దందా చేస్తున్నాయి. అంతేకాక ఎంఆర్‌పి మీద అడిషనల్ స్టిక్కర్స్ అంటిస్తున్నాయి. బ్రాండెడ్ పేరిట వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది.

హైదరాబాద్ నలుచెరగులా.. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి.. అందులోనూ అనేక కంపెనీలు ఈ బిజినెస్ లోకి దిగడంతో వాటి మధ్య పోటీ పెరగడం మోసాలకు ఊతమిస్తోంది. తూనికలు కొలతల అధికార్లు ఈ షాపులపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న షాపులపై చర్యలు తీసుకుంటున్నా.. వినియోగ దారులూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు తెలియ చేస్తున్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories