logo
జాతీయం

కన్నడ కరియప్పకు నెహ్రూ ద్రోహం చేశారా?

కన్నడ కరియప్పకు నెహ్రూ ద్రోహం చేశారా?
X
Highlights

కర్నాటక ఎన్నికల పుణ్యమా అని ప్రజలు చరిత్ర తెలుసుకోగలుగుతున్నారు. ఎన్నికల సభల్లో పాల్గొంటున్న నేతలు ప్రజలకు...

కర్నాటక ఎన్నికల పుణ్యమా అని ప్రజలు చరిత్ర తెలుసుకోగలుగుతున్నారు. ఎన్నికల సభల్లో పాల్గొంటున్న నేతలు ప్రజలకు చరిత్ర పాఠాలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ ముందంజలో ఉన్నారు. నేతలు ప్రస్తావిస్తున్న చారిత్రక అంశాలతో భారత్ -పాకిస్థాన్ యుద్ధం, భారత సైనిక దళాల తొలి భారతీయ ప్రధానాధికారి, నాటి ప్రభుత్వం సైన్యం పట్ల వ్యహరించిన తీరు లాంటివన్నీ మరోసారి తెరపైకి వస్తున్నాయి. సైన్యానికి భారతరత్న పురస్కారం దక్కాలని కొన్ని నెలల క్రితం చీఫ్ ఆఫ్ ఆర్మీ చేసిన డిమాండ్ కూడా మరోసారి గుర్తుకొస్తోంది.

భారత ఆర్మీ చీఫ్ గా విదేశీయుడిని నియమించాలని నెహ్రూ భావించారా ? ప్రధాన మంత్రి నెహ్రూకు కోలుకోలేని షాక్ ఇచ్చిన సైన్యాధికారి ఎవరు ?
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో సైన్యం అంటే ప్రభుత్వం భయపడిందా ? తొలినాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సైన్యాధికారులను అవమానించాయా ?
రక్షణశాఖ మంత్రి గా ఆర్మీ చీఫ్ ఉండాలన్న ప్రతిపాదన వచ్చిందా ? ఫీల్డ్ మార్షల్ కరియప్పకు భారతరత్న ఇవ్వాలని సైన్యం ఎందుకు డిమాండ్ చేసింది ?
ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు...సందేహాలు....కర్నాటకలో ప్రధాన మంత్రి మోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలాంటి అంశాలెన్నో మరోసారి చర్చకు వస్తున్నాయి.

భారత సైనిక దళాల తొలి భారతీయ ప్రధానాధికారిగా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ కరియప్ప ను, తదనంతర జనరల్ తిమ్మయ్యను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ప్రధానమంత్రి మోడీ గుర్తు చేశారు. కర్నాటక కు చెందిన కరియప్ప పేరును ప్రచార సభల్లో ప్రస్తావించడం ద్వారా అటు కాంగ్రెస్ ను దెబ్బ తీయడంతో పాటుగా ఇటు కర్నాటక ఓటర్ల ఆదరాభిమానాలను పొందే ప్రయత్నం చేశారు. చరిత్ర చెప్పడంలో మోడీ చిన్న చిన్న పొరపాట్లు చేసినా, మొత్తానికి దేశ ప్రజానీకం దృష్టి సైన్యం పైకి మళ్ళింది. సర్జికల్ దాడులు చేసేటప్పుడు సైన్యానికి తుపాకులు కాకుండా ఆధారాల సేకరణ కోసం కెమెరాలు ఇవ్వాల అంటూ సెటైర్లు వేశారు. అలా చేయడం ద్వారా తమ పార్టీకి మాత్రమే దేశభక్తి అధికమని చాటుకునే ప్రయత్నం చేశారు.

ఒక్కసారి చరిత్ర పుటలను తిరిగేస్తే ఆశ్చర్యదాయక అంశాలెన్నో కనిపిస్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో సైనిక దళాల ప్రధానాధికారి నియామకం విషయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ప్రధాని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, భారతీయ సైనికాధికారులకు అనుభవం లేనందున మరికొంత కాలం ఓ బ్రిటన్ అధికారిని నియమిద్దామని అన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా అందుకు సై అన్నారు. ఆ సమయంలో ఓ సైనికాధికారి లేచి తాను ఓ సలహా ఇస్తానన్నారు. అదేంటో చెప్పమన్నారు నెహ్రూ. మన నాయకులకు కూడా పాలనలో అనుభవం లేనందున ప్రధానిగా విదేశీయుడిని నియమిద్దామని ఆ సైనికాధికారి అన్నాడు. దాంతో నెహ్రూ బిత్తరపోయారు. నాటి మహానాయకుడు నెహ్రూ కే ఆ విధంగా షాక్ ఇచ్చిన సైనికాధికారి లెఫ్ట్ నెంట్ జనరల్ నాథూ సింగ్ రాథోడ్. సైన్యానికి సారథిగా ఆయన కర్నాటకకు చెందిన సీనియర్ సైనికాధికారి కరియప్ప పేరును ప్రతిపాదించారు. నాడు అలా జరగకుంటే మరి కొన్నాళ్ళ పాటు మన దేశానికి బ్రిటిష్ వారే ఆర్మీ చీఫ్ లుగా ఉండేవారు.

ఇక కరియప్ప పాకిస్తాన్ తో జరిగిన మొదటి యుద్ధంలో కాశ్మీర్ లో పాకిస్థాన్ ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఆయన వెస్ట్రన్ ఫ్రంట్ కు సారథ్యం వహించారు. ఆ తరువాత కరియప్పతో నెహ్రూ ఘర్షణ పడ్డమాట వాస్తవమే. 1951లో రాజకీయ అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు కరియప్పపై మండిపడిన నెహ్రూ ఆయన్ని ఆస్ట్రేలియాకు హై కమిషనర్‌గా పంపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంటుందేమోనని కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అందుకే నాటి సైనికాధికారులను వివిధ రకాలుగా అవమానించి వేధించినట్లు చెబుతారు. కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లాలో జన్నించిన జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య 1957 నుంచి 1961 వరకు భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 1957, డిసెంబర్‌ నెలలోనే కృష్ణన్‌ మీనన్‌ కూడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మీనన్ తో తిమ్మయ్యకు సయోధ్య లేకపోయింది. సైన్యం పై మంత్రుల పెత్తనం ఉండకూడదని తిమ్మయ్య భావించారు. ఆ సమయంలోనే సైనిక దళాల ప్రధానాధికారి రక్షణ శాఖ మంత్రిగా ఉండాలన్న ప్రతిపాదన సైన్యం నుంచి వచ్చిందని కూడా చెబుతారు.

ఫీల్డ్ మార్షల్ కరియప్ప కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కొన్ని నెలల క్రితం సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ కోరారు. ఉన్నత స్థాయి లేనివారికి సైతం భారత రత్న అవార్డు ఇచ్చారని, అలాంటప్పుడు అన్ని విధాలుగా అర్హుడైన కరియప్పకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. సైన్యం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించే బీజేపీ ప్రభుత్వం ఈ సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. సైనిక దళాల ప్రధానాధికారి చేసిన సూచనను ప్రభుత్వం అంత తేలిగ్గా తోసిపుచ్చదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఆర్మీ చీఫ్ ఈ విధంగా మాట్లాడడం తగదని స్పష్టం చేసింది. అవార్డుల విషయంలో సైన్యం జోక్యం చేసుకోవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సింఘ్వీ అన్నారు. కరియప్ప విషయంలో నాటి నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన వేధింపు ధోరణినే నేటికీ కాంగ్రెస్ కొనసాగిస్తోందన్న విమర్శలు ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి. మొత్తం మీద మోడీ చెప్పిన చరిత్ర పాఠాలు కర్నాటక ఓటర్లకు, యావత్ భారతదేశానికి నాటి చరిత్రను గుర్తు చేశాయి.

Next Story