రెక్కల కష్టాన్ని వెక్కిరిస్తున్న గిట్టుబాటు ధరలు..

x
Highlights

కడుపు మండి ఓ ఉల్లి రైతు ఏం చేశాడో తెలుసా రైతును ఉద్దరిస్తామంటూ మైకుల ముందు బీరాలు పలికే పాలకులకు, నిరసన ఎలా వ్యక్తం చేశాడో తెలుసా ఆ అన్నదాత వ్యక్తం...


కడుపు మండి ఓ ఉల్లి రైతు ఏం చేశాడో తెలుసా రైతును ఉద్దరిస్తామంటూ మైకుల ముందు బీరాలు పలికే పాలకులకు, నిరసన ఎలా వ్యక్తం చేశాడో తెలుసా ఆ అన్నదాత వ్యక్తం చేసిన ఆవేదనాతీరు, దేశం దృష్టిని ఆకర్షించింది. పాలకుల నిర్దయ ఏంటో ప్రపంచానికి చాటింది.ఈ రైతు పేరు సంజయ్ సాఠే. మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన సంజయ్, అష్టకష్టాలు పడి 750 కేజీల ఉల్లిని పండించాడు. మార్కెట్‌లో అమ్మేందుకు పంటను తీసుకెళ్లాడు. కానీ దళారుల దెబ్బకు హతాశుడయ్యాడు. పంటకు కనీస మద్దతు ధర కూడా రాలేదు. కేజీ ఉల్లి పలికిన రేటెంతో తెలుసా కేవలం రూపాయి నలభై పైసలు. దీంతో మొత్తం పంటకు రూ.1064లు వచ్చాయి. దీంతో సంజయ్‌ గుండె మండింది. ఉల్లి కోయకుండానే కన్నీరు ఉబికింది. తన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని ప్రధాని మోడీకి మనీ ఆర్డర్ ద్వారా పంపాడు.

ప్రధాని విపత్తు సహాయక నిధికి, పీఎం కార్యాలయానికి పంపిన ఆ మనీఆర్డర్‌ను అధికారులు స్వీకరించకుండా, మళ్లీ తనకే వెనక్కు పంపారు. ఆ సొమ్మును ఆన్‌లైన్‌లో పంంపాలని ఉచిత సలహా ఇవ్వడం చూసి విస్తుపోయాడు సాఠే. దేశంలో ఉల్లిరైతుల పరిస్థితికి అద్దంపట్టింది సంజయ్ సాఠే ఆవేదనా పూరిత వినూత్న నిరసన. రెక్కల కష్టాన్ని వెక్కిరించిన గిట్టుబాటు ధర చూసి, ఇంకా చాలామంది రైతులు సంజయ్ సాఠే నిరసన పద్దతినే ఫాలో అయ్యారు. రైతులను ఉద్దరించామని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు మనీ ఆర్డర్‌ చేశారు. ఇక చాలామంది రైతులైతే, ఉల్లి, టమాట పంటలను రోడ్లమీదే పారబోసి నిరసన తెలిపారు. ఆరుగాలం శ్రమించిన పంటలు, రూపాయి, అర్థరూపాయి పలుకుతుండటంతో కడుపుమండి పంటను రోడ్డు పాలు చేస్తున్నారు.

ప్రధానికి మనీఆర్డర్ చేసిన సంజయ్‌ సాఠే రైతును, ఒకప్పుడు మహారాష్ట్రతో పాటు కేంద్రం ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యవసాయంలో విప్లవాత్మక పద్ధతులు పాటించినందుకు గొప్పగా కీర్తించాయి. గతంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సంజయ్ అధిక దిగుబడి కోసం తాను అవలంభించిన విధానాలను ఆయనకు వివరించారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురయ్యిందని తోటి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయమంటేనే జూదం వర్షాలు పడి, సరైన విత్తనాలు దొరికి.. పంటలు వేస్తే చీడ పీడలు వేపుకు తింటాయ్. అయినా అప్పులు చేసి, పెట్టుబడి పెట్టి రైతు పంట పండించి మార్కెట్ కు తెస్తాడు.. అలాంటి రైతు నేరుగా పంటను అమ్ముకునే విధానం కోసమే మార్కెట్ యార్డులు, రైతు బజార్లు పుట్టుకొచ్చాయ్.. కానీ అక్కడా దళారుల దందాయే సాగుతోంది. వ్యాపారుల పైత్యమే నెగ్గుతోంది సంజయ్ సాఠేలాంటి ఆదర్శరైతులకు, దళారుల మోసంతో దగా అవుతున్నాడు. కేజీ ఉల్లిగడ్డలకు మార్కెట్‌ యార్డుల్లో రైతుకు లభిస్తున్నది రూపాయిన్నర, రెండు రూపాయలు. కానీ రైతు బజార్లు, సంతల్లో జనాలకు కేజీ ఉల్లి 20 రూపాయలు పైగా పలుకుతోంది. అంటే రైతుకు, వినియోగదారునికి మధ్య రేటులో తేడా దాదాపు 18 రూపాయలు. ఇంత పెద్ద మొత్తం దళారులు, వ్యాపారులు దోచుకుంటున్నా, పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. గిట్టుబాటు కాక, అప్పులు తీరక, చివరికి ఉరితాడుకు వేలాడుతున్నాడు రైతన్న.

ఇటీవలె దేశ రాజదాని దద్దరిల్లేలా రైతులు ఆందోళన చేశారు. రుణమాఫీ, కనీస మద్దతు కోసం వేలాదిగా, లక్షలాదిగా, దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ర్యాలీ చేశారు. మహారాష్ట్రలోనూ నిరసనలు తెలిపారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో రైతుల ఆగ్రహమే బీజేపీ కొంపముంచింది. అప్పుల మాఫీ, ఎంఎస్‌పీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో కాషాయ పాలకులను గద్దెదించారు. రుణమాఫీతో పాటు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. ఇటు రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్‌ను ఆశీర్వదించారు. రైతులు తలచుకుంటే ఏమవుతుందో, పాలకులకు పట్టే గతేంటో, ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిరూపించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడం లేదు. దాని నిదర్శనమే నేడు దేశవ్యాప్తంగా ఉల్లి, టమోటా రైతుల ఆగ్రహం.

Show Full Article
Print Article
Next Story
More Stories