logo

ముందస్తు ముంచేనా.. తేల్చేనా? చరిత్ర చెబుతున్న నిజాలు 

గతంలో ముందస్తుకు వెళ్లిన ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడ్డాయి. ఇప్పుడు 9 నెలల ముందే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారు! ఎన్నికలు ముగిశాయి! జాతీయ చానల్స్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని అంచనా వేస్తే.. విశ్వసనీయతకు మారుపేరైన లగడపాటి సర్వే మాత్రం కూటమికి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. దాంతో, ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ముందస్తుకు వెళ్లినందుకు కేసీఆర్‌ కూడా మూల్యం చెల్లిస్తారా!? లేక, ‘ముందస్తు చరిత్ర’ను తిరగరాస్తారా!? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ముందస్తుకు వెళ్లిన ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడ్డాయి. నిజానికి, ఉమ్మడి ఏపీలో మూడుసార్లు జరిగిన ముందస్తుల్లోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. సాధారణంగా ముందస్తు రెండు రకాలు. ఒకటి: అనివార్యమైన పరిస్థితుల్లో జరిగేది.. అంటే వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం రద్దయి, గడువు కంటే ముందు జరపాల్సిన పరిస్థితి రావడం! విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధికారంలోని పార్టీలు ముందస్తుకు వెళ్లడం రెండోది. ఉమ్మడి ఏపీలో రెండూ చోటుచేసుకున్నాయి. ఏపీ ఏర్పడిన నాటినుంచి 1978 దాకా నిరాఘాటంగా- షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. కానీ, టీడీపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోయింది. ఎన్టీఆర్‌ పార్టీ 202 స్థానాలతో అధికారం చేపట్టింది.

ఇందిరాగాంధీ హత్య దరిమిలా సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నా.. 1984 డిసెంబరు 14న రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా నాటి గవర్నర్‌ శంకర్‌దయాళ్‌ శర్మకు ఎన్టీఆర్‌ సిఫార్సు చేశారు. 1985లో తిరిగి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. తదుపరి 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఎన్టీఆర్‌ 4 నెలల ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. నక్సలైట్ల దాడి తర్వాత వచ్చిన సానుభూతి ఆశలు రేకెత్తించడంతో 2004 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నా.. 2003 నవంబరులోనే అసెంబ్లీని అప్పటి సీఎం చంద్రబాబు రద్దు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. బాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. అంటే, ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల, ఎన్టీఆర్‌, చంద్రబాబు ముగ్గురూ భంగపడ్డారనే చెప్పాలి.

ఇక, 1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రె్‌సలో చీలిక వచ్చింది. దాంతో, మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిర తొలిసారిగా ముందస్తు ప్రయోగం జరిపారు. ఏడాది ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు. గరీబీ హఠావో నినాదంతో 352 స్థానాల్లో విజయం సాధించారు. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ముందస్తుకు అయిష్టంగా ఉన్నా అద్వానీ ప్రేరేపణతో ఎన్నికలకు వెళ్లారు. ‘భారత్‌ వెలిగిపోతోంది’ నినాదంతో ప్రజల తీర్పు కోరిన ఎన్డీయే పరాజయం పాలైంది. ఆయనతోపాటు టీడీపీ కూడా ఓడిపోయింది. వెరసి, భావోద్వేగ కారణాలతో జరిగిన ముందస్తు ఎన్నికల్లో విజయాలు సాధించినా.. రాజకీయ లబ్ధి కోసం జరిపిన ముందస్తులో మాత్రం పార్టీలు ఓడిపోయినట్లు చరిత్ర చెబుతోంది. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top