ట్రంప్ దెబ్బ ఇలా ఉంటుంది

ట్రంప్ దెబ్బ ఇలా ఉంటుంది
x
Highlights

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, పక్కనే ఉన్న భారత్‌కు, ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారిన పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, పక్కనే ఉన్న భారత్‌కు, ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారిన పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్‌ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో చెంపచెళ్లుమనిపించే కామెంట్స్ చేశాడు ట్రంప్. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండదని చెప్పేశారు.

గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా పాక్‌కు 33 బిలియన్‌ డాలర్ల సాయాన్నందించింది. కానీ.. దీని ప్రతిగా పాక్‌ మమ్మల్ని మోసం చేసింది. దొంగలెక్కలు, అబద్ధాలు చెప్పింది. మా నేతలను వాళ్లు మూర్ఖులనుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించాడు ట్రంప్. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల స్వర్గధామం గా మారింది. అతితక్కువ సాయంతో అఫ్గానిస్తాన్‌లో వేట కొనసాగిస్తున్నాం. ఇకపై ఇలాంటివి సాగవు’ అని ట్రంప్‌ తొలి ట్వీట్‌లో హెచ్చరించాడు. పాకిస్తాన్‌పై ఇంత ఓపెన్‌గా, నిర్మోహమాటంగా, ఓ అమెరికా అధ్యక్షుడు మాట్లాడటం తొలిసారి. తన గడ్డపైనుంచి ఉగ్రవాదాన్ని తరిమేసేందుకు పాకిస్తాన్‌ సుముఖంగా లేని కారణంగా వారికి ఇవ్వాలనుకున్న 225 మిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రూ.14 న్నర వేల కోట్ల సాయాన్ని నిలిపేయాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే, పాకిస్తాన్‌ది బికారి బతుకే. పాకిస్తాన్‌ ఉగ్రవాద స్వర్గధామం అని ఇండియా ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడింది. పాక్‌ ఉగ్రపన్నాగాలపై ఆధారాలతో సహా రెండు దశాబ్దాలుగా పోరాడతోంది.

మొన్నటి వరకు పాకిస్తాన్‌పై ద్వంద్వ వైఖరి అవలంభించి, సూటిగా మాట్లాడని అమెరికా ఇప్పుడిప్పుడే నేరుగా తూటాలు ఎక్కుపెడుతోంది. టెర్రరిజానికి హెవెన్‌గా మారిందని ధ్రువీకరించింది. టెర్రర్ క్యాంపులను ధ‌్వంసం చేయాలని కూడా సూచించింది. కానీ అమెరికా ఇస్తున్న ఆర్థిక నిధులతో, దేశాన్ని బాగు చేసుకోవడానికి బదులు, ఉగ్రవాదాన్నే బలపరిచింది పాక్. కానీ ట్రంప్ వచ్చాక, పాకిస్తాన్ పప్పులు ఉడకడం లేదు. ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసిననాటి నుంచి ద్వంద్వ వైఖరి విడనాడాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా పాక్‌ తీరులో మార్పు రాకపోవటంతో, నేరుగా రంగంలోకి దిగాడు. ట్రంప్‌ కామెంట్లతో పాకిస్తాన్‌ పరిస్థితి, కుడితిలో పడిన ఎలుకలా మారింది.

అయితే ట్రంప్ చేసిన కామెంట్లపై నేరుగా విమర్శలు చేయలేక, మింగలేక కక్కలేక అన్నట్టుగా మాట్లాడుతోంది పాకిస్తాన్‌. ట్రంప్‌ ట్వీట్‌కు మేం వీలైనంత త్వరగా సమాధానమిస్తాం, ప్రపంచానికి అసలు నిజాలు బయటపెడతాం...వాస్తవాలు–కల్పితాల మధ్య తేడాను మేం వివరిస్తామటూ, పాకిస్తాన్ విదేశాంగమంత్రి అన్నారు.కానీ ఒసామా బిన్‌లాడెన్‌కు ఆశ్రమిచ్చిన అబద్దలాడి అభాసుపాలైంది పాకిస్తాన్. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు తప్పన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది కానీ, ధైర్యం చాలడం లేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక, పాకిస్తాన్‌పై వైఖరిలో క్రమంగా మార్పొచ్చిందన్నది వాస్తవం. ఉగ్రవాద పోరులో పాకిస్తాన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు 2017 మేలో ట్రంప్‌ ప్రకటించాడు. అదేనెలలో తాము అందిస్తున్న ఆర్థికసాయాన్ని, మిలటరీ లోన్‌గా మార్చాడు. పాకిస్తాన్ ఉగ్రవాద స్వర్గధామమని 2017 ఆగస్టులో నిక్కచ్చిగా చెప్పాడు. పాకిస్తాన్‌ ఉగ్రబాధిత దేశమని, దాని అభివృద్దికి అమెరికా 15 ఏళ్లుగా ఆర్థిక సాయం చేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా కూడా ఫండ్స్ ఇస్తోంది. ఇప్పటివరకూ సైనిక సాయంగా 255 మిలియన్ల డాలర్లు ఇచ్చింది.

ఆర్థిక మౌలిక వసతులకు 229 మిలియన్ డాలర్లు. సామాజిక మౌలిక వసతులకు 336 మిలియన్ల డాలర్లు. మానవతావాద సాయం 98 మిలియన్ల డాలర్లు. మల్టీ సెక్టార్‌కు 36 మిలియన్ల డాలర్లు. ఉత్పత్తికి 44 మిలియన్ల డాలర్లను ఇచ్చింది. అయితే, ఈ డబ్బులను మొత్తం ఉగ్రవాదులను మేపడానికి ఉపయోగించుకుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆ నిధులన్నింటిని ఆపివేయాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాయి. ముంబై మారణహోమం మాస్టర్‌మైండ్, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్‌ను కూడా గురిపెట్టింది అమెరికా. అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు చైనా వెనకడుగువేసినా, అమెరికా మాత్రం ప్రకటించింది. హఫీజ్‌ను, రెండు నెలల క్రితం విడుదల చేసినప్పుడూ బహిరంగంగానే విమర్శించింది. సయీద్‌ను వెంటనే అరెస్టు చేసి పునర్విచారణ జరపాలని సూచించింది. ఒకవేళ పాక్‌ ఈ అంశంపై స్పందించకుంటే అమెరికా–పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం తప్పదని హెచ్చరించింది. అయినా పాకిస్తాన్‌ తీరుమారలేదు. ఫలితమే, ఆర్థికసాయానికి బ్రేక్.

పాకిస్తాన్‌పై అమెరికా మాటలు నమ్మడానికి వీల్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, పాకిస్తాన్‌లో ఉగ్ర శిబిరాలు పెంచిపోషించింది అమెరికానే. భారత్, పాక్‌ల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకోవడం, రెండు దేశాలనూ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే అమెరికా లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్‌ను తిట్టి, భారత్‌ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు రాబట్టేందుకే అమెరికా ప్రయత్నిస్తోందన్న నేపథ్యంలోనే ట్రంప్‌ తాజా వ్యాఖ్యలను చూడాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories