Top
logo

బైరెడ్డి చేరికతో కాంగ్రెస్ లో పెరిగిన జోష్

X
Highlights

కర్నూలు జిల్లాలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి బైరెడ్డి...

కర్నూలు జిల్లాలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపింది. బైరెడ్డి మాదిరిగానే మరో ఇద్దరి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తే పూర్వ వైభవం గ్యారెంటీ అన్న గట్టి నమ్మకంతో అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లా లో పూర్వవైభవం సాధిస్తామన్న ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ముందు ఏపిలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించాలని తహతహ లాడుతోందా? విభజనతో శత వసంతాల పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. అయిదేళ్లు గడిచిపోయాయి. గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజల హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ప్రతిపక్షం గొంతు పోయేలా ప్రశ్నిస్తున్నా నిధులివ్వాల్సిన కేంద్రం ఇవ్వడం లేదు అందుకే ఏపిలో అభివృద్ధి జరగడం లేదు ఇలాంటి సమయంలో తమ పార్టీ బరిలోకి దిగితే ప్రజల ఆదరణను చూరగొనవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రానికి మంచి చేసినా, చెడు చేసినా తమ పార్టీకే చేయగల సత్తా ఉందని ముందుకొస్తోంది. అర్ధరహితంగా విభజించి తప్పు చేశామనీ, ఆ తప్పును హోదా ఇచ్చి సరిదిద్దుకుంటామనీ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రజల ముందుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే కర్నూలు వేదికగా రాజకీయం మొదలు పెట్టింది. నంద్యాల ఎన్నికల్లో పోటీ చేసి తమ ఉనికిని చాటుకుంది. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు సైతం నిర్వహించింది. అయితే కడుపు రగిలిపోయిన ఓటరు కాంగ్రెస్ వైపు కన్నెత్తయినా చూడలేదు. అయినా అది ఏ మాత్రం నిరాశ చెందక తమ పట్టును సాధించుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను ఓ కంట కనిపెడుతూనే ఆశా వహులపై దృష్టి సారించింది. జన బలం, ధన బలం ఉండి కూడా పార్టీ టిక్కెట్ లు రాకుండా నిరుత్సాహంగా ఉన్న నేతల వివరాలను ఆరా తీస్తోంది. రాయలసీమ ఆకాంక్షను బలంగా ఎలుగెత్తి చాటి ఆ తర్వాత కాలంలో కనుమరుగైపోయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ కన్నేసింది. ఆర్పీఎస్ వ్యవస్థాపక మాజీ అధ్యక్షుడైన బైరెడ్డి ఏ పార్టీ లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగాయి. బిజెపి, లేదా టిడిపిలో చేరతారంటూ లెక్కలేశారు కొందరు నేతలు. అయితే అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకొని వచ్చాడు బైరెడ్డి.

బైరెడ్డి రాకతో జిల్లాలో ఓ తెలియని ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. వచ్చీ రాగానే పార్టీ నేతలను ఉత్తేజ పరుస్తూ ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ఎక్కువ మంది కాంగ్రెస్ లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలతో పార్టి బలోపేతం పై సమాలోచనలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం నెలకొంది.

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ క్రియాశీలకం కావడానికి కీలకమైన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తన ఆలోచనలకు మరింత పదును పెట్టారు. బైరెడ్డితో కలిసి జిల్లాలో పర్యటనలను పెంచారు. జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఓ సభను నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆ సభల్లోనే జిల్లాలోని మరికొంత మంది నేతలను కాంగ్రెస్ పార్టీ లోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ పై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బైరెడ్డి అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా రావాలన్న, తేవాలన్నా అది ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే సాధ్యమని కార్యకర్తల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టి తప్పు చేసింది కాని మోసం చేయలేదన్న నినాదాన్ని ప్రజల్లో కి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మరో ఇద్దరు ముగ్గురు బలమైన నేతల కోసం పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమన్ చాందీ కర్నూలు జిల్లాలో పర్యటించారు నాయకులకు కార్యకర్తలకు దశా దిశా నిర్దేశం చేశారు. అంతే కాకుండా పార్టీఅధ్యక్షుడు రాహుల్ గాంధీని జిల్లాకు తెచ్చి సభ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే సమావేశం ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో నిర్వహించాలి అన్న దానిపైన చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి జిల్లాలో పెద్ద దిక్కుగా కోట్ల ఇంత వరకు నడిపించుకుంటూ వస్తే మిగిలిన బాధ్యతను బైరెడ్డి భుజాలకు ఎత్తుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎలాగైన జిల్లాలో పార్టి బోణి కొడుతుందన్న ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పూర్వవైభవం కోసం పాకులాడుతుందన్న మాట జగమెరిగిన సత్యం. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తూ పార్టి గెలుపే ధ్యేయంగా వీరిద్దరూ ముందుకెళ్తున్నారు. వీళ్ల ప్రయత్నాలు ఫలించి హోదా ఇచ్చే పార్టీగా ప్రజల్లో విశ్వాసం పెంచుకోగలరా లేదా అన్నది ముందు ముందు తేలుతుంది.

Next Story