Top
logo

హరీష్‌ను టార్గెట్‌ చేయడంలో వ్యూహం అదేనా!

X
Highlights

మ‌హకూట‌మిని చీల్చాల‌న్న కేసీఆర్ వ్యూహాల‌ను త‌ల‌ద‌న్నేలా విపక్షాలు మైండ్‌గేమ్‌ వాడివేడి పెంచాయా గులాబీ ద‌ళాన్నే ...

మ‌హకూట‌మిని చీల్చాల‌న్న కేసీఆర్ వ్యూహాల‌ను త‌ల‌ద‌న్నేలా విపక్షాలు మైండ్‌గేమ్‌ వాడివేడి పెంచాయా గులాబీ ద‌ళాన్నే చీల్చాలని మ‌హ‌కూట‌మి టార్గెట్ చేస్తోందా ఇందుకు టీఆర్ఎస్ లో హర్డ్ వర్కర్.. ట్రబుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీష్‌ రావునే ఎంచుకున్నారా పార్టీ నుంచి బయ‌ట‌కొస్తున్నార‌ని ఒక‌రు కాంగ్రెస్‌లో చేరి సీఎం అవుతార‌ని మ‌రొక కీల‌క నేత చేస్తున్న బ‌హిరంగ ప్రచారం, మైండ్‌ గేమ్‌లో భాగమేనా చివరి వరకూ టీఆర్ఎస్‌లోననని, హరీష్‌ లెక్కలేనన్ని సార్లు చెప్పినా ప్రతిపక్షాలు అదే అస్త్రాన్ని ప్రయోగించడంలో ఉద్దేశమేంటి?

ఓడిపోతామ‌న్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం హ‌రీష్ రంగంలోకి దిగితే, ఇక గెలుపు ప‌క్కా అని అనేక సంద‌ర్బాల్లో సైతం రుజువ‌య్యింది. అంత‌టి కీల‌క నేత‌పై ఎన్నిక‌ల వేళ, ప్రతిప‌క్షనేత‌లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో హ‌రీష్ ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయ‌ట‌కొద్దామా అన్నట్లుగా హ‌రీష్ చూస్తున్నట్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిప‌క్షనేత‌లు. ఇవే ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ పొలిటీషియ‌న్ హ‌రీష్‌ను, ఇబ్బందులు పెడుతున్నాయి.

అస‌లే కుటుంబ రాజ‌కీయాల‌ని కేటీఆర్ కోసం కేసీఆర్, హ‌రీష్‌ను ప‌క్కన పెట్టార‌ని అందుకే ప్రాధాన్యత లేద‌ని పార్టీలో హ‌రీష్ ఇమ‌డ‌లేక‌పోతున్నార‌న్న చ‌ర్చ‌ ఇప్పటికే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. సోష‌ల్ మీడియాలో సైతం హ‌రీష్-కేటీఆర్ మధ్య ప‌డ‌టం లేద‌న్న వార్తలు విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. అలాంటి డిఫరెన్సెస్‌ ఏవీ లేవని హరీష్‌, కేటీఆర్‌ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, ఇలాంటి పుకార్లకు మాత్రం బ్రేక్‌ పడ్డం లేదు.

వీట‌న్నింటికి దాటుకొని హ‌రీష్ ప్రస్తుతం ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యత‌లు భుజాన ఎత్తుకున్నారు. ఉత్తర తెలంగాణ‌కు ఆయువు ప‌ట్టైన టీఆర్ఎస్‌కు, మ‌రిన్ని సీట్లు సాధించే ప‌నిలో నిమ‌గ్నమ‌య్యారు. ఇంత‌లోనే పిడుగులా గ‌జ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒక్కసారిగా రాజకీయంగా అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కేసీఆర్‌ను ఓడించేందుకు, అల్లుడు హ‌రీష్ స‌పోర్ట్ కూడ మ‌న‌కుంద‌ని స్వయాన హ‌రీష్ త‌న‌కు ప్రైవేట్ నెంబ‌ర్ నుంచి ఫోన్ చేసి కీల‌క విష‌యాలు చెప్పార‌ని ఇది చాలు గ‌జ్వేల్‌లో కాంగ్రెస్ గెల‌వ‌డానికి అని చేసిన వాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఒంటేరు వ్యాఖ్యలు క్షణాల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో, నేరుగా వాటిని ఖండించేందుకు హ‌రీష్ రావే, రంగంలోకి దిగారు. గ‌జ్వేల్‌లో మీడియాతో మాట్లాడిన హ‌రీష్ గెల‌వ‌లేక‌నే ఇలాంటి అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు టీఆర్ఎస్‌ని కాని మామను కాని వీడేది లేద‌ని స్పష‌్టం చేశారు. బ‌ట్టకాల్చి మీదేసే ప్రయ‌త్నం కాంగ్రెస్ నేత‌లు చేస్తున్నట్లు హ‌రీష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని ఒంటేరు ఊచలు లెక్కించేలా చేస్తామన్నారు. గజ్వేల్లో ఒంటేరుకు డిపాజిట్లు రాకుండా ప్రచారం చేస్తానన్నారు హరీష్.

ఇదిలా ఉంటే వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన టీడిపి సీనియ‌ర్ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, మ‌రో సంచ‌ల‌న వాఖ్యలు చేశారు. మీడియాను చిట్ చాట్‌కు పిలిచిన రేవూరి, వ‌చ్చే ప్రభుత్వంలో హ‌రీష్ సీఎం అవుతార‌ని జోస్యం చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు మ‌హాకూట‌మికి స‌మానంగా సీట్లు వ‌స్తాయ‌ని అప్పుడు హ‌రీష్‌ను సీఎం చేసేందుకన్నట్టుగా, హ‌రీష్‌తో పాటూ చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయ‌ట‌కొస్తారంటూ చేసిన కామెంట్లు, ఇప్పుడు మ‌రోసారి దుమారాన్ని లేపుతున్నాయి. నిజ‌మైన రాజ‌కీయ నాయ‌కుడు అంటే హ‌రీష్ రావే అన్న రేవూరి టీఆర్ఎస్ లో మామ పోరుతో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని, వ‌చ్చే నెల‌రోజుల్లోనే ఆయ‌న‌కు విముక్తి అంటూ కామెంట్స్ చేశారు.

ఇప్పటికే మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు వ్యవ‌హారంలో ఏర్పడిన అస‌మ్మతుల‌ను అవ‌కాశంగా తీసుకుని, పార్టీల‌ను చీల్చాల‌ని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న చేశారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పడిన అస‌మ్మతి వెనుక టీఆర్ఎస్ హ‌స్తముంద‌ని భావిస్తున్న కాంగ్ నేత‌లు టీఆర్ఎస్‌నే దెబ్బకొట్టేలా వ్యూహాల‌ను ర‌చిస్తున్నట్లు స‌మాచారం. అందులోనే భాగమే, హరీష్‌పై కామెంట్స్‌ అని ప్రచారం జరుగుతోంది.

అయితే హ‌రీష్ పై ప్రతిప‌క్ష నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను, గులాబీ నేత‌లు ఖండిస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేకే ఇలా పార్టీ కీల‌క వ్యక్తిని టార్గెట్ చేశార‌ని ఇందులో భాగంగానే హ‌రీష్ పై ఆరోప‌ణ‌లు చేస్తే పార్టీలో అల‌జ‌డి రేపొచ్చన్నది ప్రతిప‌క్షాల వ్యూహంగా చెబుతోంది టీఆర్ఎస్. హ‌రీష్‌పై ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా టీఆర్ఎస్‌లో వారు చిచ్చు పెట్టలేర‌ని గులాబీ పార్టీ,100సీట్లు గెలవడం ఖాయం అంటూ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story