ఏపీలో రాజకీయం రగులుతోంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి మరి గోదావరి జిల్లాలను గెలుచుకునే పార్టీ...
ఏపీలో రాజకీయం రగులుతోంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి మరి గోదావరి జిల్లాలను గెలుచుకునే పార్టీ రాష్ట్రాన్నేలుతుందన్న నానుడి. 2014 ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారీ తలరాత మారిపోనుందా యూత్ ఓటు బ్యాంక్ లక్ష్యంగా దూసుకుపోతున్న జనసేన పరిస్దితేంటి.. పశ్చిమలో హీటెక్కిస్తున్న పాలిటిక్స్.
గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని సీట్లు గెలుచుకుని అన్నట్లుగానే అధికారంలోకి వచ్చింది టీడీపీ. ప్రత్యర్ధిని అంత దారుణంగా దెబ్బతీసి ఊహించని విజయాన్ని సాధించుకున్న టీడీపీ ఇప్పుడెలా ఉంది? చరిత్ర పునరావృతమవుతుందా?
పశ్చిమగోదావరి జిల్లాలో పొలిటికల్ వార్ హీటు పుట్టిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలు బలాబలాల ప్రదర్శనకు జిల్లా వేదికగా మారింది. జిల్లాలో జగన్ పాదయాత్రతో హోరెత్తిస్తే జగన్ అలా వెళ్లాడో లేదో ఇలా ఎంటరైపోయింది టీడీపీ.. గ్రామదర్శిని పేరుతో ప్రజల్లోకి వెళ్లి స్థానిక సమస్యల పై క్షేత్ర స్దాయిలో ఉన్న లోపాలపై దృష్టి సారించింది. టీడీపీ తమ కార్యక్రమాన్ని ఇలా పూర్తి చేసిందో లేదో ఆ వెంటనే రంగంలోకి రెడీ అవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరో రెండు లేదా మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా పశ్చిమగోదావరి నుండి బస్సు యాత్ర ద్వారా పార్టీ బలోపేతానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ తిరిగి జవసత్వాలు పుంజుకునేందుకు నానా పాట్లు పడుతోంది. ఢిల్లీ నుండి ముఖ్యనేతలను రప్పించి జిల్లాలో తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో పశ్చిమలో పాగా వేసేందుకు రెడీ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీల గెలుపు ఓటములు నిర్ణయించేది కాపు, బిసి ఓటు బ్యాంకులే జిల్లాలోని మొత్తం ఓటర్లలో 30శాతం ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే మరో 30శాతం ఓట్లు బిసి సామాజిక వర్గానివి కాగా మిగతా 40శాతం ఓటర్లు ఓసి, మైనార్టీ , ఎస్సీ, ఎస్టీ ఇలా ఇతర కులాలకు చెందినవారు ఉన్నారు. కులాల వారీగా చూస్తే కాపు, బిసి ఓటర్లే ఇక్కడి అభ్యర్దుల భవితవ్యం నిర్ణయిస్తారు 2014ఎన్నికల్లో టీడీపీ పశ్చిమలో దుమ్మురేపింది. జిల్లాలో ఉన్న మొత్తం 15 సీట్లకు 15 గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇందులో మిత్రపక్షమైన బిజెపి ఒక స్థానం సంపాదించుకుంది. జనం ఇచ్చిన ఈ తీర్పు టీడీపీ అధిష్టానానికే షాకిచ్చింది. గెలుపు ధీమా ఉన్నా ఇంతలా పశ్చిమలో క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ అధిష్టానమే ఊహించలేదు. అంతలా ఊహకందని విజయం టీడీపీ సొంతమైయ్యింది. సహజంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్మించిన పార్టీనే ఏపిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ ఉంది. అదే సెంటిమెంట్ ను నిజమేనననట్లు 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది అందుకు రాష్ట్ర విభజన ఒక కారణం కాగా, నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు లాంటి అనుభవజ్ఞడైన నేత అవసరమని మెజారిటీఓట్లు భావించడం మరో కారణం. టీడీపీ గెలుపుకు ఇవేకాదు ఇంకా సవాలక్ష కారణాలున్నాయి అట్టహాసంగా కొన్ని పథకాలను, స్కీములు మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ముందుకెళ్లింది టిడిపి .. రైతురుణ మాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపుదల లాంటి అంశాలు ఓటర్లను ఆకట్టుకోవడం ఒక కారణమైతే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి ఓటేయాలని పిలుపు నివ్వడం మరో ప్రధాన కారణం. అంతేకాదు కాపు రిజర్వేషన్ కల్పిస్తామంటూ చంద్రబాబు విసిరిన కులం వల ఓటర్లపై బాగా పనిచేసింది. జిల్లాలో టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు ఈ కారణాలన్నీ ఆ పార్టీకి కలిసొచ్చాయి. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఈ ఎన్నికల్లో అదే పట్టు నిలబెట్టుకుంటుందా అంటే మాత్రం నో అనే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ ఈసారి 7,8 సీట్లకు పరిమితమవుతుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.
పశ్చిమ గోదావరిలో టీడీపీ గ్రాఫ్ పడిపోతోందా? అయితే అందుకు కారణాలేంటి? ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఇప్పుడు ఎందుకు డల్ అయింది. మరి టీడీపీకి తగ్గే అవకాశాలు ఇతరపార్టీల ఖాతాలోకి వెళ్లే అవకాశముందా? వెలితే ఏ మేరకు?
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ గ్రాఫ్ పడిపోడానికి కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్లు చాలా కారణాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ టీడీపీకి బాగా కలిసొచ్చింది. కాపులను బిసిలలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీ కాపులందరిని టీడీపీ వైపు తిప్పింది కానీ మళ్లీ ఎన్నికలొస్తున్నా నేటికి కాపు రిజర్వేషన్ల హామీ పూర్తి స్దాయిలో నెరవేరలేదు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బ అయ్యే ఆస్కారముంది. దీనికి తోడు గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీతో బరిలోకి దిగుతున్నారు. దీంతో కాపు ఓటు బ్యాంకు రెండుగా చీలింది జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే కాపు ఓట్లు ఈసారి టీడీపీకి కలిసిరావనే చెప్పాలి మరో పక్క టీడీపీకి ఇప్పటి వరకూ ఉన్న బిసి ఓటర్ల ఫిక్సిడ్ ఓటు బ్యాంక్ తప్పితే తటస్ధంగా ఉండేవారు టీడీపీకి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు టీడీపీ చేసిన కొన్ని స్వయంకృతాపరాధాలు ఆ పార్టీకి జిల్లాలో ప్రాబల్యం తగ్గేలా చేసాయి గ్రామ స్దాయిలో జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి జరుగుతోందన్న విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక , మట్టితో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారనే విమర్మలు బలంగా వినిపిస్తున్నాయి.. ఇలా జిల్లాలో 2014తో పోల్చితే ఇప్పుడు టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనే చెప్పాలి టీడీపీకి ఈసారి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయన్నది రాజకీయ నిపుణుల అంచనా.
ఇక గత ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీ ఈసారి దూకుడు పెంచింది. 2014లో సీట్ల కేటాయింపుతోపాటు, మ్యానిఫెస్టో రూపొందించడంలో కొన్ని పరిమితులు, జగన్ కు ఉన్న అనుభవ రాహిత్యం లాంటి కారణాలతో వైసీపీ పశ్చిమలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ప్రస్తుతం పరిస్దితి పూర్తి భిన్నంగా ఉంది 2014 ఎన్నికలతో పోల్చితే పశ్చిమలో వైసీపీ పుంజుకుంది. ఇటీవల జగన్ పాదయాత్రతో జిల్లాలో క్యాడర్ లో కొత్త ఉత్తేజం వచ్చింది. టీడీపీని టార్గెట్ చేస్తూ స్దానిక ఎమ్మెల్యేల బాగోతం బయటపెడుతూ జగన్ ప్రసంగించడం టీడీపీ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం పడింది. జగన్ పై ఉన్న సానుభూతి ఈసారి వైసీపీకి కలిసిరానుంది.. టీడీపీ నుండి చీలిన కాపు ఓటు బ్యాంక్ , కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన కేడర్ ఈసారి వైసిపికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఎలా చూసినా కనీసం గత ఎన్నికల్లో ఒక్కసీటు జిల్లా నుండి గెలుచుకోలేని వైసిపి ఈసారి 7లేదా 8స్దానాలు దక్కించుకునే అవశాలున్నాయి. ఎన్నికల ఫలితాలు పార్టీ నిలబెట్టే అభ్యర్ధులపై కూడా ఆధారపడి ఉంటాయి. పవన్ సొంత జిల్లా కావడంతో యూత్ ఓటు బ్యాంక్ ఈసారి జనసేన వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. వామపక్ష పార్టీలతో కలసి పవన్ దూకుడు పెంచడంతోపాటు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించడంతో జనసేన గత ఎన్నికలతో పోల్చితే ఇప్పడు మాంచి జోరు మీదుందనే చెప్పాలి.. విభజన దెబ్బకు అంపశయ్య ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే జవసత్వాన్ని పుంజుకుంటోంది. పార్టీ వీడి తలోదారి వెళ్లిన నాయకులను, కార్యకర్తలను సొంత గూటికి తెచ్చేందుకు అగచాట్లు పడుతోంది... ఇలా పశ్చిమలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో 2019 టార్గెట్ గా ముందుకు సాగుతున్నాయి. అయితే ఈసారి ఏపిలో హంగ్ వస్తుందేమోనన్న అంచనాలు కొందరు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించడంలో , ఓటు బ్యాంక్ ను మళ్లించుకోడంలోనూ చంద్రబాబు సిద్దహస్తుడు. నంద్యాల తరహా స్ట్రేటజీని మరోసారి ప్లే చేసి అధికారం దక్కించుకోవచ్చనే ధీమాలో టిడిపి నేతలున్నారు.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా 2019 ఎన్నికలే టార్గెట్ గా పశ్చిమలో హడవుడీ మొదలైపోయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire