logo
జాతీయం

కలెక్టర్‌ గారి భార్యగా కష్టమెరుగని జీవితం కానీ

కలెక్టర్‌ గారి భార్యగా కష్టమెరుగని జీవితం కానీ
X
Highlights

రితూ జైస్వాల్‌.. పుట్టింట్లో సుకుమారంగా పెరిగింది! కలెక్టర్‌ గారి భార్యగా కష్టమెరుగని జీవితం ఆమెది!...


రితూ జైస్వాల్‌.. పుట్టింట్లో సుకుమారంగా పెరిగింది! కలెక్టర్‌ గారి భార్యగా కష్టమెరుగని జీవితం ఆమెది! ముద్దులొలికే ఇద్దరు పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఇంట్లోనే కూర్చోకుండా సమాజసేవ చేయాలనుకున్నారు. బీహార్‌లోని హాజీపూర్‌ రితూ స్వస్థలం. చిన్న వయసు నుంచే రితూకు సమాజ సేవపై మక్కువ. రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొని పేదలకు సహాయం చేసేవారు. దాన్ని పెద్దయ్యాక కొనసాగించారు. అర్థశాస్త్రంలో పీజీ పట్టాతో పాటు.. భరతనాట్యం, కథక్‌ కూడా నేర్చుకున్నారు. 1996లో అరుణ్‌కుమార్‌ ఐఎఎస్‌తో ఆమెకు వివాహమైంది. వారికి ఆర్యన్‌, అవని ఇద్దరు పిల్లలు. ఢిల్లీలో నివాసం.

బీహార్‌లోని సింగ్‌వాహిని అనే తమ పూర్వికుల గ్రామంలో తాండవిస్తున్న సమస్యలపై పోరు మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే, గ్రామంలోని పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. అన్ని గ్రామాల్లోల్లానే సింగ్‌వాహినిలోనూ ఒకటే సమస్యలు. సురక్షిత మంచినీరు అంటే ఏమిటి? అని అమాయకంగా అడిగే గ్రామస్థులు, రోడ్డు సదుపాయం లేని మారుమూల గ్రామం, బహిరంగ మలవిసర్జన, విద్యుత్ కనెక్షన్‌లు లేకుండా చీకటిగా ఉండే గ్రామం, ఇది సింపుల్‌గా సింగ్‌వాహిని పరిచయం.

తొలి అడుగులు
గ్రామం కోసం రీతూ వేసిన తొలి అడుగు స్కూల్‌కు వెళ్లని పిల్లలను వెళ్లేలా చేయడం. ఇందుకు ఓ టీచర్‌ను ప్రత్యేకంగా రప్పించి, స్కూల్ మానేసిన పిల్లలకు చదువు చెప్పించడం. ఇందుకు టీచర్‌కు అంతకుముందు వస్తున్న జీతం కంటే ఎక్కువ చెల్లించేందుకు రీతూ స్వయంగా తన పాకెట్ మనీని వెచ్చించారు. ఆతర్వాత గ్రామస్థులతో భేటీ కావడం, బహిరంగ మలవిసర్జన, భ్రూణ హత్యలు, సేంద్రీయ వ్యవసాయం ఇలా దాదాపు అన్ని అంశాలపై గ్రామస్థుల్లో అవగాహన పెంచేలా ప్రొజెక్టర్‌ను ఉపయోగించి పలు వీడియోలు ప్రదర్శించేవారు. పల్లె బాగుకోసం ఆఫీసర్ బంగ్లాలో కాకుండా అదే పల్లెలోనే ఎక్కువ కాలం గడిపింది.

rithu

నువ్వే ఎందుకు సర్పంచ్ కాకూడదు?
సరే గ్రామం కోసం ఇంత శ్రమిస్తున్న నువ్వే ఎందుకు మా ఊరి పెద్ద కాకూడదు? ఈ ప్రశ్న రీతూలో మరింత బాధ్యత నింపింది. అంతే 2016 సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి, 72 శాతం ఓట్లతో గెలిచారు. 2000 మరుగుదొడ్లు నిర్మించి గ్రామంలో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించి, మహిళల సమస్యలు తీర్చిన రీతూ కష్టం ఊరికే పోలేదు. అదే సంవత్సరం అక్టోబర్‌లో మలవిసర్జన రహిత గ్రామ పంచాయతీగా సింగ్‌వాహినికి బీహార్ ప్రభుత్వం అవార్డ్ ప్రకటించింది. ఆతరువాత ‘రోడ్ల’పై పడ్డ ఆమె చూపుతో, వ్యక్తిగత ఖర్చుతోనే ఊరికి రహదారి నిర్మించారు. అనంతరం స్కిల్ డెవల్‌ప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టి, మొబైల్ రిపేర్, టైలరింగ్ వంటివాటిలో గ్రామస్థులకు ట్రైనింగ్ ఇప్పిస్తూ, వారికి ఉపాధి కల్పించారు. ఇటీవలి బీహార్ వరదల్లో సహాయక చర్యలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ కలెక్టర్‌గారి భార్యకు బీహార్ ప్రభుత్వం ’ఉచ్ శిక్షిత్ ఆదర్శ్ యువ సర్పంచ్’ అవార్డును అందచేసింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి రీతూ జైస్వాల్ ఒక్కరే కావడం విశేషం.

rithu

Next Story