logo
జాతీయం

ఇక అందరి చూపూ అటువైపే

ఇక అందరి చూపూ అటువైపే
X
Highlights

కేంద్రం నుంచి బయటకొచ్చాక.. ఎన్డీయేకు రాం రాం చెప్పాక.. మంత్రి పదవులను కాదని వదిలిపెట్టాక.. రాష్ట్రంలో కూడా...

కేంద్రం నుంచి బయటకొచ్చాక.. ఎన్డీయేకు రాం రాం చెప్పాక.. మంత్రి పదవులను కాదని వదిలిపెట్టాక.. రాష్ట్రంలో కూడా తెగదెంపులు చేసుకున్నాక.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాక.. మళ్లీ.. ఇన్నాళ్లకు.. ఆ ఇద్దరు ఎదురెదురు పడుతున్నారు. ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఒకరి ముఖం మరొకరు చూసుకోబోతున్నారు. వారే ఒకరు తెలుగు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరొకరు దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ. చాలాకాలం తర్వాత ఆ ఇద్దరు లెజెండ్స్.. కలవబోతున్నారు. మరి వారి భేటీ ఎలా సాగనుంది..? అందరిలో ఆసక్తిని.. అంతకుమించిన ఉత్కంఠను పెంచుతున్న వీరిద్దరి సమావేశం ఎలా ఉండబోతోంది..?

ఎన్నాళ్లో వేచిన సమయం రానే వచ్చింది. ఇక అందరి చూపూ అటువైపే. అందరి కళ్లూ ఆ సమావేశంపైనే. ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సమావేశంలో మాటలతో పలకరింపులుంటాయా..? ఒట్టి నమస్కారాలతోనే సరిపెడతారా..? లేక అది కూడా కానరాదా..?

2014 ఎన్నికల ముందు ఫ్రెండ్ షిప్.. ఎన్డీయేలో చేరిన తర్వాత మరింత బలపడింది. అప్పట్లో ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా.. మోడీని కలిసేందుకు చంద్రబాబుకు పెద్దగా అవాంతరాలుండేవి కావు. కలిసినప్పుడల్లా ముఖం నిండుగా నవ్వుకునే సందర్భాలు బోలెడున్నాయి. ఇక ముచ్చట్లకు కొదువే లేదు. అలాంటి వారిద్దరి మధ్య నాలుగేళ్లు తిరిగే సరికి.. సీన్ రివర్స్ అయ్యింది. మాటల స్థానంలో మాట పట్టింపులు వచ్చాయి. ముఖాలు చూసేందుకు కూడా సమయం లేని పరిస్థితి వచ్చింది. అంతెందుకు.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఏకంగా అదే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు వెళ్లింది.

అప్పటి నుంచి ఉప్పూ నిప్పులా సాగిన ఇరు పార్టీల మధ్య మాటలు మంటలు రాజేశాయి. ప్రధాని మోడీపైనే చంద్రబాబు డైరెక్ట్ ఎటాక్ చేయడంతో.. పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక విపక్షాల ఏకీకరణలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకావడం.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఒకే వేదికను పంచుకోవడంతో.. వచ్చే ఎన్నికల్లో తాను ఎటువైపో చెప్పకనే చెప్పారు.. చంద్రబాబు.

ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్న సమయంలో.. మళ్లీ ప్రధాని మోడీ, చంద్రబాబు కలిసేందుకు వేదిక కానుంది.. నీతి ఆయోగ్ సమావేశం. ఢిల్లీలో ఆదివారం జరగనున్న గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీకి కూడా చేరుకున్నారు.

మరి సమావేశంలో ఏం చర్చించుకుంటారనే విషయం కన్నా.. చంద్రబాబు మోడీ మధ్య ఏం జరుగుతుందనే దానిపైనే అందరి దృష్టి నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు మోడీలు ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది..? నమస్కారాలతోటే సరిపెడతారా..? చిరునవ్వులతోటే పలకరింపులను ఆపేస్తారా..? కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇచ్చుకుంటారా..? కేవలం వచ్చిన పని ముగించుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతారా..? లేక అన్నింటినీ మర్చిపోయి ఆళింగనం చేసుకుని.. కబుర్లను పంచుకుంటారా..? గత స్మృతులను నెమరువేసుకుంటారా..? ఏదేమైనా.. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక.. తొలిసారిగా చంద్రబాబు మోడీల మధ్య జరగనున్న సమావేశం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మోడీ, బాబుల మధ్య పరిచయం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Next Story