తాగేందుకు నీరు లేక విలవిల్లాడుతున్న కేప్ టౌన్

తాగేందుకు నీరు లేక విలవిల్లాడుతున్న కేప్ టౌన్
x
Highlights

సమస్త ప్రాణకోటికి జీవనాధారం నీరు. పంచభూతాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది జలానికే. అలాంటి నీరు భూమిమీద లేకుండా పోతే ఎలా..? ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే...

సమస్త ప్రాణకోటికి జీవనాధారం నీరు. పంచభూతాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది జలానికే. అలాంటి నీరు భూమిమీద లేకుండా పోతే ఎలా..? ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఆధునిక నగరం అయిన కేప్ టౌన్ పరిస్థితి అలాంటిదే. చెప్పుకోడానికి సూపర్ ఫాస్ట్ సిటీ అయినా ప్రస్తుతం అక్కడ తాగేందుకు నీరు లేక జనం అష్టకష్టాలు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా నీరు లేని రోజుగా కేప్ టౌన్ ను ప్రకటిస్తారనే వార్తలు అక్కడి జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

కేప్ టౌన్.. సౌతాఫ్రికాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. దేశంలోనే అతిపెద్ద ఆధునిక నగరంగా పేరుగాంచిన కేప్ టౌన్ తాగేందుకు నీరు లేక విలవిల్లాడుతోంది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాలన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. దీంతో ప్రస్తుతం నీటిని రేషన్ ప్రకారం సరఫరా చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఒక మనిషికి 25 లీటర్ల నీటిని చొప్పున అందిస్తున్నారు. ఈ నీటితోటే తాగడం, స్నానం చేయడం, టాయ్ లెట్ కు ఉపయోగించుకోవడం, చేతులు కడుక్కోవడం వంటి అన్నింటికీ సరిపెట్టుకోవాలి.

దీంతో ప్రతీ నీటి కుళాయి దగ్గర పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రెండేళ్ల క్రితమే కేప్ టౌన్ లో తీవ్ర దుర్బిక్షం ఏర్పడింది. గత 400 యేళ్లలో కనీవినీ ఎరుగని కరువు వచ్చిపడింది. ఎల్ నినో ప్రభావంతో కనీస వర్షపాతం కూడా నమోదు కాకుండా పోయింది. చుట్టూ అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నా.. తాగేందుకు నీరు లేక కేప్ టౌన్ వాసులు అల్లాడిపోతున్నారు.

సుమారు 40 లక్షల జనాభా ఉన్న కేప్ టౌన్ లో తీవ్ర వర్షాభావం నెలకొంది. చలికాలంలో మాత్రమే ఇక్కడ వర్షాలు పడతాయి. వర్షపాతం కూడా సాధారణం కంటే 25 శాతం తక్కువగా నమోదవుతుంది. దీంతో 2015 నుంచి కేప్ టౌన్ కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాల్లేక అక్కడి జలాశయాలన్నీ ఎండిపోయాయి. యేటా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండగా నీటి వినియోగంతో పాటు వృధా కూడా ఎక్కువే ఉంటుంది. నీటి లీకేజీలు అరికట్టడంలో విఫలం కావడంతో సరఫరా అయ్యే నీటిలో 30 నుంచి 40 శాతం వరకు వృధాగా వెళ్లిపోతుంది.

ఇటీవలి కాలంలో జనాభా పెరగడం అందుకు తగ్గట్లు నీటి సరఫరా లేకపోవడం కూడా కరువుకు కారణమని చెబుతున్నారు. ఇటు డబ్బులున్నవారు విపరీతంగా నీటిని వృధా చేయడాన్ని కూడా అధికారులు కరువుకు కారణంగా చెబుతున్నారు. శుద్ధిచేసిన సముద్రపు నీరు, భూగర్భ జలాలు వాడటం లాంటివి ఈ నగరంలో చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 99 శాతం నీటిని వర్షాధారమైన జలాశయాల నుంచే తీసుకుంటారు. మూడేళ్లుగా ఇవి ఎండిపోవడంతో పరిస్థితి తల్లకిందులైంది. ఈ కరువుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

అయితే వచ్చే మే రెండో వారం వరకు కేప్ టౌన్ ను డే జీరో గా ప్రకటించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. జలాశయాల్లో ఉన్న అతికొద్ది నీరు కూడా అడుగంటిపోతే నీటి సరఫరాకు తెరపడినట్లే అని చెబుతున్నారు. దీంతో నీటికోసం ప్రజలు ఘర్షణ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం నీటి రేషన్ ను కూడా పోలీసు పహారాలో ఇస్తున్నారు. ఆసుపత్రులు, క్లినిక్‌లు, పాఠశాలలకు మాత్రం నీటి రేషన్‌ నుంచి మినహాయించారు. ఇప్పటికే నగర శివార్లలో వ్యవసాయానికి నీటిని పూర్తిగా ఆపేశారు. నీటి వృథా, అతి వినియోగం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. పరిమితికి మించి నీటిని వినియోగించే వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెల నుంచే ఒక వ్యక్తి 87 లీటర్లకు మించి నీటిని వాడకూడదని పరిమితి విధించారు. అయినప్పటికీ ఎక్కువగానే వినియోగిస్తుండడంతో ఇప్పుడు దానిని 25 లీటర్లకు కుదించారు.

నీటి సమస్య తీవ్రం కావడంతో నగరంలో అక్కడక్కడా శాంతిభద్రతలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అన్ని నీటి సేకరణ పాయింట్లు, కుళాయిల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటుచేశారు. నీరు పూర్తిగా ఆగిపోయే రోజు వస్తే కేప్‌టౌన్‌ అల్లకల్లోలమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో నీటి సేకరణ పాయింట్‌ వద్ద 20 వేల మంది వరకు నీటిని పట్టుకుంటున్నారు. అక్కడికి ఇకపై జనం పోటెత్తడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అప్పుడు అక్కడ పోలీసులు, సైన్యాన్ని మోహరించక తప్పదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories