Top
logo

వీడిన ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ

వీడిన ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ
X
Highlights

ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడింది. మోక్షం కోసమే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు...

ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడింది. మోక్షం కోసమే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఏ విధమైన పెనుగులాట జరగలేదని శరీరాలపై ఎలాంటి గాయాలు లేవ ని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి ఆత్మహత్యల వెనుక మతపరమైన విశ్వాసాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షం కోసమే వీళ్లంతా సామూహికంగా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన నారాయణ్‌ దేవి , ప్రతిభ ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్‌నగర్‌కువచ్చి స్థిరపడ్డారు. ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ప్లైవుడ్‌ వ్యాపారం కూడా చేస్తున్నారు.

నారాయణ్‌ దేవికి.. పెద్ద కుమారుడు భవనేశ్‌ భాటియా కోడలు సవిత, మనవలు నీతు, మీను, ధీరు , చిన్న కుమారుడు లలిత్‌ భాటియా, చిన్న కోడలు టీనా, వీరి కుమారుడు శివమ్‌ ఉన్నారు. ప్రతిభా దేవికి ప్రియాంక అనే కూతురు ఉంది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటి కింది భాగంలో కిరాణా దుకాణం ఉండగా మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు.

రోజూలాగానే గత శనివారం రాత్రి 11.45 గంటలకు కిరాణా దుకాణాన్ని మూసేసి నారాయణ్ దేవి కుటుంబీకులు పైకి వెళ్లారు. ఆదివారం ఉదయం 7.30 గంటలు అవుతున్నా షాపు తెరవకపోవడంతో పాల కోసం వచ్చిన పొరుగింటి వ్యక్తి పైకి వెళ్లి చూశాడు! ఇంటిల్లిపాదీ శవాలై కనిపించడంతో షాక్ తిన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు.

నారాయణ్ దేవి ఇంట్లో చేతులు వెనక్కి కట్టేసి నోటికి, కళ్లకు వస్త్రాలు చుట్టేసిన స్థితిలో ఉరితాళ్లకు వేలాడుతున్న పది శవాలు ఒకే గదిలో ఉన్నాయి. గొంతు కోసేయడంతో చనిపోయిన వృద్ధురాలి మృతదేహం మరో గదిలో ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు 11 మంది కుటుంబసభ్యులు ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు.

నారాయణ్‌ దేవి ఇంట్లో శోధించిన పోలీసులకు కొన్ని కాగితాలు లభ్యమయ్యాయి. ‘‘(చావడానికి) మీరు బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి. కళ్లను మూసుకోండి. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది’’ అని ఆ కాగితంలో ఉన్నట్టు సమాచారం. ఒక్క ప్రతిభా దేవి మృతదేహం మినహా మిగతావారందరి మృతదేహాలూ అదే స్థితిలో కనిపించడంతో దీని వెనుక తాంత్రిక కోణం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు నగలన్నీ యథాతథంగా ఉండడం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులూ ఎక్కడివక్కడ ఉండడం ఇంటిపైన ఉన్న కుక్క గట్టిగా మొరిగిన దాఖలాలు లేకపోవడం ఇంటి తలుపులను బలవంతంగా విరగ్గొట్టి ఎవరూ చొరబడినట్టు లేకపోవడంతో పోలీసులు తాంత్రిక కోణం పైనే ఎక్కువగా దృష్టి సారించారు.

నారాయణ్‌ దేవి ఇంటి సభ్యుల్లోనే తాంత్రిక పూజలు చేస్తున్న ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో ఇంటిల్లిపాదినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాత్రి ఆహారంలో మత్తు మందు కలిపి.. అందరూ మత్తులోకి జారుకున్నాక వారిని చంపేసి ఉంటారని, మధ్యలో నారాయణ దేవికి మెలకువ రావడంతో ఆమె గొంతు కోసి చంపి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో ఒకరైన ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం నవంబరులో జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని స్థానికులు వాపోతున్నారు. నారాయణ్‌ దేవి కుటుంబసభ్యులను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story