logo
జాతీయం

ఆశల పద్దుపై ఎన్నెన్నో అంచనాలు..కేంద్ర బడ్జెట్‌పై హెచ్‌‌ఎంటీవీ విశ్లేషణ

ఆశల పద్దుపై ఎన్నెన్నో అంచనాలు..కేంద్ర బడ్జెట్‌పై హెచ్‌‌ఎంటీవీ విశ్లేషణ
X
Highlights

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వస్తుందంటే అంతా.. ఆశల పద్దు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బడ్జెట్ కసరత్తు...

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వస్తుందంటే అంతా.. ఆశల పద్దు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బడ్జెట్ కసరత్తు వెనుక వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు, రాష్ట్రాలు.. ఇలా బోలెడు కోణాలు దృష్టిలో పెట్టుకుని కత్తి మీద సాము చేయాలి. ఇలా కేంద్ర బడ్జెట్ లో ఆసక్తికరమైన నిజాలు చాలా ఉన్నాయి.

2017 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సవాళ్లను ఎదుర్కోన్నారు. గత ఏడాది బడ్జెట్ ప్రజెంటేషన్ సమయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్లమెంట్ సభ్యుడు అహీద్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో సభను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సహజంగా ఓ సిట్టింగ్ ఎంపీ చనిపోతే, సభలు వాయిదా వేయడం అనవాయితీ. అయితే, మోడీ సర్కార్ మాత్రం.. ఎలాంటి వాయిదాలు వేయకుండా, సంతాపం తెలిపి.. బడ్జెట్ ప్రజెంటేషన్ ను కొనసాగించింది.

కేంద్ర బడ్జెట్ కు సంబంధించి 15 ఆసక్తికరమైన నిజాలు
ఒకటి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో పొందుపరిచిన వార్షిక ఆర్థిక నివేదికనే సాధారణంగా కేంద్ర బడ్జెట్గ్‌గా పిలుస్తాం. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని కేంద్ర ఆర్ధిక మంత్రి ద్వారా రాష్ట్రపతి నిర్ణయిస్తారు.

రెండు. ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి నెలలోని చివరి వర్కింగ్ డేకు బదులుగా మొదటి వర్కింగ్ డేనే, పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని సులభతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపట్టింది.

మూడు. ఆర్థికమంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్లో ఫైనాన్స్ బిల్లు, కేటాయింపు బిల్లు కూడా ఉంటాయి. అయితే, ఈ రెండు బిల్లులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడానికి వీలుగా పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదించాలి.

నాలుగు. మన దేశంలో మొదటిగా కేంద్ర బడ్జెట్ ను 1947లో అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్.కె. షణ్ముఖ చెట్టి సమర్పించారు.

ఐదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఎక్కవసార్లు కేంద్ర బడ్జెట్లను సమర్పించారు. పదిసార్లు 10 బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 మధ్య కాలంలో ఒక తాత్కాలిక బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు.

ఆరు. దేశ చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ. ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇందిరా గాంధీ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ఏడు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో.. పలు పభుత్వాల్లో ఏడుసార్లు బడ్జెట్లు సమర్పించారు.

ఎనిమిది. ప్రసుత్తం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

తొమ్మిది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బ్రిటిషు వారి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మార్చారు. ఫిబ్రవరిలోని చివరి వర్కింగ్ డేలో సాయంత్రం ఐదు గంటలకు బదులుగా ఉదయం 11గంటలకే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

పది. 92 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా కాకుండా.. 2017 జనరల్ బడ్జెట్ లోనే విలీనం చేశారు.

పదకొండు. బడ్జెట్ ప్రిపరేషన్, హల్వా వేడుకతో ప్రారంభం కావడం అనవాయితీ. కేంద్రమంత్రి ఈ స్వీట్ ను బడ్జెట్ పత్రాల ముద్రణలో పాల్గొనే అధికారులు మరియు సిబ్బందికి పంచిపెడతారు. ఏదైన ముఖ్యమైన పని చేసే ముందు నోటిని తీపి చేసుకోవాలనే సాంప్రదాయాన్ని అనుసరించి హల్వా వేడుకను నిర్వహిస్తారు.

పన్నెండు. బడ్జెట్ సమర్పణ తేదీకి సుమారు ఒక వారం ముందు బడ్జెట్ పత్రాల ముద్రణ మొదలవుతుంది. బడ్జెట్ కసరత్తులో పాల్గొన్న ఉద్యోగులను, బడ్జెట్ సమర్పించే వరకు.. ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సీక్రెట్ ప్లేస్‌లో ఉంచుతారు.

పదమూడు. బడ్జెట్ పత్రాలు మొదట రాష్ట్రపతి భవన్ లో ప్రింట్ చేసేవారు. తర్వాత న్యూఢిల్లీలోని మింట్ రోడ్‌లోకి మార్చారు. 1980 నుంచి, బడ్జెట్ ప్రతులు నార్త్ బ్లాక్‌లో ముద్రిస్తున్నారు.

పద్నాలుగు. 1997-98లో పి. చిదంబరం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. ఇది భారత్ లో ఆర్ధిక సంస్కరణలకు రోడ్ మ్యాప్ లాంటిదిగా భావిస్తారు. ఇన్ కమ్ ట్యాక్సు రేట్లను తగ్గించడం, కార్పోరేట్ ట్యాక్సుపై సర్ ఛార్జీలను తొలగించడం, కార్పోరేట్ పన్నుల రేటును తగ్గించడం ఈ బడ్జెట్ లోని ప్రధానాంశాలు.

పదిహేను. 1973-74 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో 550 కోట్లు లోటు ఉండటంతో.. దీన్ని బ్లాక్ బడ్జెట్ గా పిలుస్తారు.

ఇలా మన కేంద్ర బడ్జెట్ లో 15రకాల ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. అయితే, ఈసారి జైట్లీ పద్దులు ఎలా ఉండనున్నాయి. ఎలాంటి తాయిలాలను అందించనుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Next Story