పది అంశాల చుట్టూ తిరిగిన జైట్లీ గత బడ్జెట్

పది అంశాల చుట్టూ తిరిగిన జైట్లీ గత బడ్జెట్
x
Highlights

అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న కొత్త బడ్జెట్ సాక్షాత్తూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ల తీరునే రెండు రకాలుగా మార్చేయనుంది. జీఎస్టీకి ముందు ఆయన ప్రాధాన్యతలు...

అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న కొత్త బడ్జెట్ సాక్షాత్తూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ల తీరునే రెండు రకాలుగా మార్చేయనుంది. జీఎస్టీకి ముందు ఆయన ప్రాధాన్యతలు వేరు. లెక్కజమా ఖర్చులు వేరు. ఇప్పుడు జీఎస్టీ అమలవుతున్న తరుణంలో అందునా ఎన్నికల నామసంవత్సరంలో జైట్లీ ఏఏ ప్రాంతాలకు ఎలాంటి తాయిలాలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

జైట్లీ గత బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రధానంగా పది అంశాల చుట్టూ తిరిగాయి. రైతులు, గ్రామీణులు, యువత, నిరుపేదలు, మౌలిక వసతులు, ప్రజాసేవలు, ఆర్థిక రంగం, డిజిటలీకరణ, ద్రవ్య స్థిరీకరణ, పన్ను సంస్కరణల పద్దులకి ప్రాధాన్యమిచ్చారు. అంతకుముందు రెండేళ్లు విద్య, వైద్యం, గ్రామీణ ఉపాధి, నైపుణ్య కార్మికులపై తగిన శ్రద్ధ పెట్టలేదన్న విమర్శల నేపథ్యంలో- జైట్లీ తన పంథా మార్చుకొని సర్దుబాట పట్టారు.

గతంలో 2003-04, 2013-14 సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ల వ్యయఖాతాలో భారీ పెంపుదల నమోదైంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందువల్ల ఈ బడ్జెట్‌లో కూడా అదే రిపీటయ్యే అవకాశాలు ఉన్నాయి. అదీకాక ఈ ఏడాది త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌తో ఆరంభించి కర్ణాటక, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ శాసనసభలకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో నాలుగుచోట్ల అధికారంలో ఉన్న బీజేపీ.. బలపడేందుకు, పార్టీ విస్తరణకు చేసే ప్రయత్నాల్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి.

ఈసారి బడ్జెట్‌ లో ఉపాధి కల్పన, వ్యవసాయ ప్రగతి, పెట్టుబడులకు ప్రోత్సాహకాలపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ప్రధాని మోడీ సూచించినట్టు సమాచారం. మొన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల ఆగ్రహం చవిచూసిన ఎన్డీయే వ్యూహనిర్ణేతలు కచ్చితంగా కర్షక బడ్జెట్‌ తోపాటు ఎక్కువ మందిని మెప్పించే ఆకర్షక బడ్జెట్‌ రూపొందించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

గత బడ్జెట్ లో రైతులకు 10లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యం ప్రకటించిన కేంద్రం, ఈసారి ఇంకో లక్ష కోట్ల మేర రుణ వితరణను నిర్దేశించవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య, విద్యారంగాలకు తగు కేటాయింపులతోనే సుస్థిర వృద్ధిరేటు సాధ్యమన్న ఆర్థిక సర్వేని ప్రభుత్వం పెడచెవిన పెట్టక పోవచ్చు. వ్యవసాయానికి, మౌలిక పెట్టుబడులకు బడ్జెట్లో పెద్దపీట దక్కనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సూచిస్తుండగా- గ్రామీణ భారతానికి కేటాయింపులు తప్పనిసరనేది క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థల అభిప్రాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories