బాక్సయిట్‌ బలపీఠమేనా? ఘాతుకం దేనికి సంకేతం?

బాక్సయిట్‌ బలపీఠమేనా? ఘాతుకం దేనికి సంకేతం?
x
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో ఏవోబీ రాష్ట్ర కమిటీ మిలటరీ కమిషన్ కార్యదర్శి రాంచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి...

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో ఏవోబీ రాష్ట్ర కమిటీ మిలటరీ కమిషన్ కార్యదర్శి రాంచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ప్రతాప్ రెడ్డి కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో యాక్షన్ టీమ్‌తో పాటు మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఉన్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయనను మిలటరీ కమిషన్ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ నియమించింది. అతని ఆధ్వర్యంలోనే యాక్షన్ టీమ్ పనిచేస్తోంది. ఈ యాక్షన్ టీమే కిడారి, సోమల హత్యలకు కారణమని తెలుస్తోంది.

అయితే, బాక్సైట్ తవ్వకాల విషయంలో మావోయిస్టులు పలుమార్లు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన కదలికలపై రెక్కీ నిర్వహించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. తమకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లొద్దని ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమ లను పోలీసులు హెచ్చరించారు. నక్సల్స్ టార్గెట్‌లో ఉన్నారని, ఆమేరకు ఈనెల 21న సర్వేశ్వరరావుకు అరకు పోలీసులు అధికారికంగా నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ సర్వేశ్వరరావు, సోమ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్లారు. ఇది తెలుసుకున్న మావోయిస్టులు కిడారి, సోమలను కిరాతకంగా చంపేశారు.

సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ గ్రామదర్శిని కార్యక్రమానికి డుంబ్రిగూడ మండలం లివిడిపుట్ట గ్రామానికి వెళ్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. సుమారు 20 మంది మావోస్టులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వాహనాన్ని ఆపివేశారన్నారు. గన్‌మెన్ల దగ్గర నుంచి వెపన్స్ తీసేసుకున్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మీద కాల్పులకు తెగబడ్డారన్నారు. ఒడిశాకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న తుపాకులను కూడా తీసేసుకున్నారున్నారు. మావోల బందీలో ఇంకా ఎవరూ లేరని స్పష్టం చేశారు. కాల్పులు జరిపినప్పుడూ 10 మంది మావోయిస్టుల దగ్గరే తుపాకులున్నట్లు తెలిసిందన్నారు. మావోల వారోత్సవాలు జరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు తెలియజేశామని వెల్లడించారు. పూర్తి భద్రత తీసుకున్నామన్నారు. కానీ ఈ ఘటన అనుకొనని విధంగా జరిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories