బీజేపీని వెంటాడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత గండం

బీజేపీని వెంటాడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత గండం
x
Highlights

2019లో భారత దశదిశను నిర్ణయించే లోక్ సభ ఎన్నికలకు సన్నాహం అన్నట్లుగా సాగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియటమే కాదు....వివిధ సంస్థలు, ఛానెళ్లు...

2019లో భారత దశదిశను నిర్ణయించే లోక్ సభ ఎన్నికలకు సన్నాహం అన్నట్లుగా సాగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియటమే కాదు....వివిధ సంస్థలు, ఛానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... మూడు రాష్ట్రాలలో అధికార పార్టీగా ఉన్న బీజెపీకి మింగుడు పడని విధంగా ఉన్నాయి. ఐదు జాతీయ ఛానెళ్లు ...వివిధ సంస్థలతో కలసి నిర్వహించిన సర్వేలలో ఫలితాలు...కమలనాథులకు ప్రతికూలంగా, హస్తంపార్టీకి అనుకూలంగా వచ్చాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజెపీ ప్రభుత్వాలకు కాలంతీరినట్లే కనిపిస్తోంది.

హిందూ ఓటర్లు అధికంగా ఉన్న మధ్యప్రదేశ్ లో....గత 15 సంవత్సరాలుగా బీజెపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంతేకాదు...శివరాజ్ సింగ్ చౌహాన్ గత 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.అయితే..రైతుల సమస్యలు , నిరుద్యోగ సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటం..బీజెపీపాలిట గుదిబండులుగా మారాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కు మంచిపేరున్నా... ప్రభుత్వవ్యతిరేకతే అధికారానికి దూరం చేసేలా కనిపిస్తోంది. మరోవైపు..జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ ల త్రయం నేతృత్వంలో..కాంగ్రెస్ వినూత్న స్థాయిలో...దూకుడుగా ప్రచారం నిర్వహించడం ద్వారా...ఓటర్లకు చేరువయ్యింది. మధ్యప్రదేశ్ శాసనసభలోని 230 స్థానాలకు పోలింగ్ జరిగితే...116 స్థానాలు సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది.

అంతేకాదు...హిందూ ఓటర్లు అధికంగా ఉన్న మరో బీజెపీ రాష్ట్రం రాజస్థాన్ లో సైతం....కాంగ్రెస్ గాలి వీస్తున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్పాయి. వసుంధర రాజే సింధియా... అధికారం చేజార్చుకోడం ఖాయమని...ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు రకాల సర్వేలు సైతం తేల్చి చెప్పాయి.మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ల కలసి కట్టు ప్రచారం...రాజస్థాన్ లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం తథ్యమని ఎగ్జిట్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక...బీజెపీ విజయాల అడ్డా ఛత్తీస్ గఢ్ లో సైతం....పరిస్థితి తారుమారయ్యేలా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...ఇటు బీజెపీకి...అటు కాంగ్రెస్ కు...సమానంగా ఉన్నాయి.

ఛత్తీస్ గఢ్ శాసనసభలో 90 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అధికారం సాధించాలంటే 46 స్థానాలు సాధిస్తే చాలు. అయితే...46 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఇటు అధికార బీజెపీని..అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఊరిస్తోంది. మరోవైపు...గత 15 సంవత్సరాలుగా...ప్రతిపక్షాల అనైక్యత, ఓట్ల చీలికతో పాటు...సమర్థవంతమైన పాలనతో నెగ్గుకు వచ్చిన ముఖమంత్రి రమణ్ సింగ్...తొలిసారిగా ప్రభుత్వవ్యతిరేక ఓటును చవిచూడాల్సి వస్తోంది. ఏదిఏమైనా...ఇండియా టుడే, టైమ్స్ నౌ, రిపబ్లిక్, ఏబీపీ, ఇండియా టీవీ ఛానెళ్లు...పలు సంస్థలతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్....బీజెపీకి ఖేదాన్ని...కాంగ్రెస్ కు మోదాన్ని కలిగించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఓవైపు కాంగ్రెస్ ...మరోవైపు బీజెపీ మాత్రం...ఊహాగానంగా మిగిలిపోవాలని కోరుకొంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories