logo
జాతీయం

పీడీపీకి బీజేపీ గుడ్‌బై

పీడీపీకి బీజేపీ గుడ్‌బై
X
Highlights

జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసింది. పీడీపీతో కలిసి సాగడం ఇక...

జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసింది. పీడీపీతో కలిసి సాగడం ఇక తమ వల్ల కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్‌చార్జ్ రాంమాధవ్ ప్రకటించారు. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డంతో సీఎం ప‌ద‌వికి మెహ‌బూబా ముఫ్తీ రాజీనామా చేశారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని రాంమాధవ్ విమర్శించారు. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశ సమ‌గ్ర‌త‌, ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో అధికారాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాంమాధ‌వ్ స్ప‌ష్టంచేశారు.

రంజాన్ తర్వాత కూడా కశ్మీర్‌లో కాల్పుల విరమణను కొనసాగించాలని సీఎం మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు, మంత్రులు.. అమిత్ షాతోపాటు ఇతర అధిష్టాన పెద్దలను కలిశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సోమవారం కలిశారు. రెండు పార్టీల మధ్య విభేదాలు ఇదే తొలిసారి కాదు.

కథువా రేప్ కేసు విషయంలో నిందితులకు మద్దతుగా బీజేపీ మంత్రులు ర్యాలీ నిర్వహించినపుడు కూడా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని పీడీపీ హెచ్చరించింది. ఇప్పుడు కాల్పుల విరమణ విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రంజాన్ ముగిసిన మరుసటి రోజే కాల్పుల విరమణను కేంద్రం విరమించుకుంది. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్య, జవాను ఔరంగజేబ్ కిడ్నాప్, హత్యలతో కేంద్రం కాల్పుల విరమణను పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో పీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

మ్యాజిక్‌ ఫిగర్‌ : 44
మొత్తం సీట్లు 87
పీడీపీ 28
బీజేపీ 25
నేషనల్‌ కాన్ఫరెన్స్‌: 15
కాంగ్రెస్‌: 12

Next Story