logo
జాతీయం

అభివృద్ధి మంత్రం.. గెలుపు తంత్రం

అభివృద్ధి మంత్రం.. గెలుపు తంత్రం
X
Highlights

రైతే రాజు.. గ్రామీణ రంగాలే ఆయువు పట్టు.. కంటికి కనిపించే అభివృద్ధే గెలుపు సూత్రం.. ఈ తీరునే సాగింది ఆర్థిక...

రైతే రాజు.. గ్రామీణ రంగాలే ఆయువు పట్టు.. కంటికి కనిపించే అభివృద్ధే గెలుపు సూత్రం.. ఈ తీరునే సాగింది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం.. సింపుల్ గా చెప్పాలంటే మోడీ సర్కార్ పల్లెబాట పట్టింది.. మధ్య తరగతికి, తెలుగు రాష్ట్రాలకూ మొండి చేయిచూపుతూ.. తాననుకున్నది అనుకున్నట్లు చేసుకుపోయారు జైట్లీ.

అంతా మాయ మధ్య తరగతికి మొండిచేయి వేతన జీవులకు నిరాశ కేవలం రైతులు, గ్రామీణ రంగాలకే పెద్ద పీట వేస్తూ మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఎన్నికల ఏడాది కావడంతో కంటికి కనిపించే అభివృద్ధిపైనే మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. విదేశాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై డప్పు కొట్టీ కొట్టీ అదే తీరును బడ్జెట్ లోనూ కనపరిచారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పద్దు లోనూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీరునే కేటాయింపులు చేశారు. తాననుకున్నది చేసుకు పోయారు. ఎవరెలా పోయినా సర్కార్ నడిచేందుకు అవసరమైన సొమ్మును రాబట్టుకునేలా వ్యవసాయ, గ్రామీణ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆర్థిక మంత్రి ఈ సారి బడ్జెట్ రచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ.. వాటిపై వరాల జల్లులు కురిపించారు.. తమది జనరంజక బడ్జెట్ అనీ, ప్రగతి శీల బడ్జెట్ అనీ ప్రధాని ప్రకటించుకున్నారు. సామాన్యులు, రైతులు తమ బడ్జెట్ వల్ల లబ్ది పొందుతారన్నారు.

జీఎస్టీ వల్ల రాబడి పెరిగిందని నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలూ అద్భుతం అనీ జైట్లీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే జిడిపి 7.5కు చేరుకుంటోందని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 8 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నామనీ చెప్పారు.. ప్రపంచంలోనే అయిదవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. మొత్తం 21 లక్షల కోట్ల బడ్జెట్ ను ఈసారి ప్రవేశపెట్టారు. అభివృద్ధికి చిరునామాగా రైల్వే ట్రాక్ లు కాదు విమాన యాన కేంద్రాలే అంటోంది మోడీ సర్కార్ దేశంలో కనెక్టివిటీ లేని విమానాశ్రయాలన్నింటికీ ఈసారి కనెక్టివిటీ పెంచుతామని ప్రకటించారు అలాగే స్మార్ట్ సిటీలకు, టూరిస్టు డెస్టి నేషన్ల అభివృద్ధికి కేటయింపులు ఇతోధికంగా జరిపారు రైల్వేకొత్త ట్రాకులు, మరమ్మతులకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు.

మోడీ సర్కార్ రైతు పక్షపాతినని నిరూపించుకుంది. ఈసారి ఎన్నికల బడ్జెట్ లో రైతు రుణాలకు లక్ష కోట్లు అధికంగా కేటాయించారు. అలాగే పంట కనీస మద్దతు ధరను150 శాతం పెంచుతూ రైతులకు శుభవార్త పంచారు. కిసాన్ క్రెడిట్ కార్డులను మత్య్సకారులు, పశుపోషణ చేసే వారికీ వర్తింప చేశారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య రంగంలోనూ కొన్ని సదుపాయాలూ కల్పిస్తూ సామాన్యులను ఆకట్టుకున్నారు జైట్లీ. 50 కోట్ల మంది పేద కుటుంబాలకు విస్తరించేలా జాతీయ ఆరోగ్య పథకాన్ని ప్రకటించారు.. ప్రతీ కుటుంబానికి వైద్య ఖర్చుల కింద 5 లక్షలిస్తామని ప్రకటించారు.. అలాగే టిబి రోగుల కోసం ప్రత్యేక పథకం పెట్టారు.. టిబి రోగికి పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తామన్నారు.

ఇక మహిళలను ఓటు బ్యాంకుగానే జైట్లీ సర్కార్ పరిగణించింది. మహిళలను ఆకట్టుకోడానికి చిన్న పాటి మెరుపులు మెరిపించారు దాదాపు 8 కోట్ల మంది గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తామనడంతో పాటూ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ముద్రా రుణాలను76 శాతం పెంచనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ బడ్జెట్ లో అరకొర కేటాయింపులు చేశారు.. ఎస్టీల కోసం 32,508 వేల కోట్లను కేటాయిస్తామని 305 పథకాలు ప్రవేశపెడతామనీ ప్రకటించారు.. అలాగే ఎస్సీలకు 52,719 వేల కోట్లతో 279 పథకాలు ప్రకటిస్తామన్నారు.

ఎంపీలు, రాష్ట్పపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవులకు ఆటో మేటిగ్గా వేతన పెంపు ను వర్తింప చేశారు.. అదే టైమ్ లో మధ్యతరగతి వాడిని మాత్రం కనపడకుండా దెబ్బ తీశారు.. వేతన జీవులను ఉసూరు మనిపించారు ఆదాయపన్ను చెల్లింపులో గత విధానాన్నే కొనసాగించారు. స్టాండర్డ్ డిడక్షన్ 40 వేలకు పెంచడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నది ఉద్యోగుల వాదన. పెన్షనర్లకు కంటితుడుపు చర్యగా కొంత ఉపశమనం ఇచ్చారు. పాదరక్షలు, జీడిపప్పుపై సుంకం రేట్లు తగ్గించారు మొబైల్ ఫోన్లు, టివిలపై కస్టమ్స్ డ్యూటీ 20 శాతం బాదారు.

మొత్తం మీద ప్రగతి శీల బడ్జెట్ అనే ముద్ర కనపడేలా జాగ్రత్త పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపడమే కాదు బీజేపీకి ఉపయోగం ఉంటుందనుకుంటున్న స్కీములను ప్రకటించారు తమకు ఓటు బ్యాంకు బాగుందనుకున్న రాష్ట్రాలకు లాభపడేలా నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్న జైట్లీ మొదట నిలబడి ప్రసంగం ఆరంభించినా ఆ తర్వాత కూర్చునే ప్రసంగ పాఠాన్ని చదివారు అయితే గతంలోలా ఎక్కువగా కొటేషన్లు, చమత్కారాలు పిట్ట కథలు లేకపోవడం విశేషం.

Next Story