కేంద్రం న్యాయం చేయకుంటే సమరమే

కేంద్రం న్యాయం చేయకుంటే సమరమే
x
Highlights

విభజన హమీల విషయంలో కేంద్రంతో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ లేదంటూ మంత్రి వర్గం ప్రకటించింది....

విభజన హమీల విషయంలో కేంద్రంతో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ లేదంటూ మంత్రి వర్గం ప్రకటించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమయిన మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులతో పాటు పట్టణాల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపింది. నూతన ఐటీ పాలసీని ఆమోదించిన ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రయివేటు వ్యక్తులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో విభజన హామీల అమలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ న్యాయపోరాటం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులతో పాటు పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు కర్నూలు జిల్లా పాణ్యంలో నూతనంగా నిర్మించిన తలబెట్టిన సమీకృత ఇంథన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. వెయ్యి మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌తో పాటు 500 మెగావాట్ల పవన్ ‌ విద్యుత్‌ ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయనున్నట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలియజేశారు.

నిరుద్యోగ యువతకు ఉపాధే లక్ష్యంగా 2018-20 నూతన ఐటీ పాలసీని ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రయివేటు వ్యక్తులకు రాయితీలు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. ఏటా లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన ఐటీ పాలసి రూపొందించామన్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్దిదారులకు జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జర్నలిస్టుల గృహనిర్మాణానికి సంబంధించిన పథకానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ భేటిలో ఇటీవల సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ చర్చకు వచ్చింది. ఏ ఒక్క హామిని నెరవేర్చని కేంద్రం అన్ని హామీలు అమలు చేశామంటూ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ దృష్యా కేంద్రంపై పోరాటం మరింత ఉదృతం చేయాలంటూ మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు పోరాటాలు చేస్తున్నందున న్యాయపరంగా ముందుకు వెళితే ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే ప్రస్తుతం సుప్రీంలో నడుస్తున్న కేసులో రీ కౌంటర్ దాఖలు చేయడం కంటే .. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి తేవచ్చంటూ సీనియర్ మంత్రులు సూచించారు. దీంతోపాటు ఇటీవల కాకినాడలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష,కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు,విశాఖ రైల్వే జోన్ అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి వర్గం చర్చించింది. కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాళంటూ పలువురు మంత్రులు చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories