Top
logo

మరోసారి తప్పులో కాలేసిన టీఎస్‌పీఎస్సీ

X
Highlights

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి తప్పులో కాలేసింది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లు కోర్టుల చుట్టూ...

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి తప్పులో కాలేసింది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతుండగా తాజాగా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల ర్యాంకుల్లో తప్పులు దొర్లడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు మరోసారి బజారున పడింది. అయితే ఎప్పట్లాగే తప్పు తమది కాదంటున్న పీఎస్సీ అంతా సీజీజీ దగ్గరే జరిగిందని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది.

అన్నీ ఆన్‌లైన్‌లోనే అంతా ట్రాన్సపరెన్సీయే అని చెప్పుకునే టీఎస్‌పీఎస్సీ ఎప్పుడు ఏదో సమస్యలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా ఈ నేల 8 వ తేదీన ఫిజికల్ సైన్స్‌లో 1941 మంది స్కూల్ అసిస్టెంట్ ఫలితాలను విడుదల చేసింది. మొదటిసారి అభ్యర్థులకు ర్యాంకులిచ్చింది. కానీ ఈ ర్యాంకింగ్‌లో పొరపాటు దొర్లాయని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా 132 పోస్టులకు సంబంధించి త్వరలోనే మళ్లీ ర్యాంకులని తెలియజేస్తామని వివరించింది. ర్యాంకింగ్‌లో తప్పు సీజీజీ దగ్గర జరిగిందని వారిచ్చిన అభ్యర్థుల బయోడేటాలో తప్పులు దొర్లడంతో ర్యాంకులు మారాయని సర్దిచెప్పుకొస్తోంది.

మొదటి నోటిఫికేషన్ నుంచి టీఎస్‌పీఎస్సీ చరిత్ర చూస్తే గత మూడేళ్ళలో అనేక వివాధలకు నిలయంగా మారింది. నిన్నమొన్నటి గ్రూప్ 4, వీఆర్వో నోటిఫికేషన్లలో తప్పిదాలతో పాటు గురుకుల పరీక్షా పత్రాల్లో తప్పులు దొర్లడం సంచలనంగా మారింది. ఇక గ్రూప్ 2, గురుకుల టీచర్స్ వగైరాలన్నీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా టీఆర్టీ నోటిఫికేషన్‌ను ఏకంగా మూడుసార్లు విడుదల చేయాల్సి వచ్చింది. అయితే తప్పు జరిగిన ప్రతి సారీ నెపం సీజీజీ మీదనో, లేక ప్రభుత్వం మీదనో నేట్టడం టిఎస్ పిస్సీకి పరిపాటిగా మారింది.

టీఎస్‌పీఎస్సీ ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో తప్పిదాలతో పరువు దిగజార్చుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులను పరీక్షించి నిరుద్యోగులకు అమోదయోగ్యమైన నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యావంతులు అంటున్నారు. నాయకుల మెప్పుకోసం పనిచేస్తే ఇలాంటి తప్పిదాలే జరుగుతాయని విమర్శలు చేస్తున్నారు. తప్పులు దొర్లినప్పుడల్లా ప్రతిసారి మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని చెబుతున్నారు కానీ అందుకు తగ్గట్లుగా టీఎస్‌పీఎస్సీ వ్యవహరించడం లేదని తాజా ఘటన నిరూపిస్తుంది.

Next Story